న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల (29.2 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన విజన్ ప్లాన్ సిద్ధమవుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. రూపకల్పనలో ఉన్న ఈ విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు.
ఈ ముసాయిదా విజన్ డిసెంబర్ 2023 నాటికి సిద్ధమవుతుందని, వచ్చే మూడు నెలల్లో విజన్ దేశ ప్రజల ముందుకు వస్తుందని వెల్లడించారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే.
ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్‌లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్‌లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశం అంటే...
ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment