విధాన పాపం... ప్రజలకు శాపం... | Sakshi Guest Column On India economy | Sakshi
Sakshi News home page

విధాన పాపం... ప్రజలకు శాపం...

Published Fri, Aug 23 2024 5:31 AM | Last Updated on Fri, Aug 23 2024 5:31 AM

Sakshi Guest Column On India economy

విశ్లేషణ

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. వాస్తవంలో పేరు గొప్ప... ఊరు దిబ్బ లాగా దేశ ప్రజల స్థితిగతులున్నాయి. ఒక పక్కన నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. మరో పక్కన నింగినంటే ద్రవ్యోల్బణం, అంతంత మాత్రపు ప్రజల కొనుగోలు శక్తిని మరింతగా దిగజారుస్తోంది. మోదీ ప్రభుత్వం దేశం మీద వరుసగా రుద్దిన పెద్ద నోట్ల రద్దు, అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు, కోవిడ్‌ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాలే ఈ దుఃస్థితికి కారణం. ఫలితంగా లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయి ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడింది.

నేడు వెలువడుతోన్న అనేక ఆర్థిక సంబంధిత గణాంకాలు చితికిపోతోన్న ప్రజల వాస్తవ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉదాహరణకు 2023 –24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల రుణభారం, వారి మిగులు ఆదాయంలో (కనీస అవసరాల తాలూకు ఖర్చుల అనంతరం మిగిలే ఆదాయం) 52 శాతానికి చేరుకుంది. ఇది 2022–23లో 48 శాతంగా ఉంది. కాగా, 2019–20 ప్రాంతంలో ఇది 40 శాతమే. ఇక 2012 –13లో అయితే ఈ మిగులు ఆదాయంలో, కుటుంబాల రుణభారం కేవలం 32 శాతం. అంటే, గడిచిన సుమారు దశాబ్ద కాలంలో ప్రజల రుణభారం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా, కుటుంబాలు తమ ఆదాయాలలో అధిక భాగాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగించవలసి వస్తోంది. 

ఈ కారణం వలన, కనీస అవసరాలకు పోను... ఆ పైన ఖర్చులు పెట్టగల స్థోమత దిగజారిపోయింది. ఈ స్థితిలోనే 2023–24
కాలంలో, బ్యాంకుల రిటైల్‌ రుణాలు 27.5 శాతం మేరకు పెరగగా, ఈ రుణాలు తీసుకున్నవారు, ఆ రుణంలో వినియోగ ఖర్చులకు వాడే మొత్తం కేవలం 8.5 శాతం పెరిగింది.  అంటే, కుటుంబీకులు తాము తీసుకున్న రుణం తాలూకు పూర్తి మొత్తాన్ని వినియోగానికి వాడు కోలేకపోతున్నారు. దీనికి కారణం, వారు ఇందులోంచి కొంత భాగాన్ని పాత అప్పులు తీర్చేందుకు వాడటం. 

ప్రజల ఈ ఆర్థిక దుఃస్థితి వలన 50 వేల రూపాయల లోపు రిటైల్‌ రుణ గ్రహీతలు వాటిని సరైన సమయంలో చెల్లించలేని పరిస్థితి పెరుగుతోంది. ఫలితంగానే క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాల తాలూకు బకాయిల మొత్తం 2018–19 లోని జీడీపీలో 3.6 శాతం నుంచి 2023–24 నాటికి 5.6 శాతానికి పెరిగిపోయింది. ఈ విధంగా రిటైల్‌ రుణాలలో మొండి బకాయిగా మారుతున్నవి 8.2 శాతానికి పెరిగాయి. 

ఈ క్రమంలోనే వ్యవసాయ రుణాలు మొండి బకాయిలుగా మారడం కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి తాలూకు ప్రభావం ఏమిటంటే, 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసి కంలో (ఏప్రిల్‌–జూన్‌ ) భారత కార్పొరేట్ల లాభాల పెరుగుదల, దాని ముందరి ఏడాది త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మార్కె ట్‌లో డిమాండ్‌ లేక ఈ కార్పొరేట్ల అమ్మకాల స్థాయి కూడా పడి పోయింది. 

మొత్తంగా ప్రస్తుతం మన దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌ పతనం కావడం వల్ల, ప్రైవేట్‌ పెట్టుబడిదారులు కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టే పెట్టుబడులు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ పెట్టుబడుల స్థాయి 2009 సెప్టెంబర్‌ త్రైమాసికం నాటి అనంతరం కనిష్ఠ స్థాయిలో ఉంది. గణాంకాలను పరిశీలిస్తే, కొత్త ప్రాజెక్ట్‌లలో ప్రైవేట్‌ రంగం తాలూకు వాటా 2023–24 లోని చివరి త్రైమాసికం లోని 85.4 శాతం నుంచి, 2024–25 మొదటి త్రైమాసికంలోని 66.7 శాతానికి పడిపోయింది. 

మరి, ఈ ఆర్థిక పతనానికి కారణం ఏమిటి? ఇతరత్రా కారణాలు ఏవైనా... మోదీ ప్రభుత్వ విధానాల తాలూకు ప్రభావమే ప్రధానంగా ఈ దుఃస్థితికి కారణం. వరుస పరంపరగా మోదీ ప్రభుత్వం దేశం మీద రుద్దిన 1) పెద్ద నోట్ల రద్దు 2) అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు 3) కోవిడ్‌ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాల వంటివి దీనికి కారణం. ఉదాహరణకు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలన దేశంలోని లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయారు. 

అసంఘటిత రంగంగా ఉండే వీరు తమ వ్యాపారాలను క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఆన్‌ లైన్‌లో నిర్వహించుకోగల అవకాశం లేక వ్యాపారాల నుంచి వైదొలగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే, తమ అమ్మకాలకు డెబిట్, క్రెడిట్‌ కార్డులను అంగీక రించగల పెద్ద రిటైల్‌ మార్టులు, మాల్స్‌ వ్యాపారాలు పెరిగాయి. చితికిపోయిన ఈ చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారం పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు బదలాయించబడింది. అదీ కథ. పెద్ద నోట్ల రద్దు అనేది అంతిమంగా కాకులను కొట్టి గద్దలకు వేసేదిగా పరిణమించింది.

ఇక, జీఎస్టీ అమలు క్రమంలో కూడా లక్షలాది మంది చిన్న వ్యాపారస్థులు, ఉత్పత్తిదారులు చితికిపోయారు. అసంఘటిత రంగంలోని వీరంతా, బలవంతంగా జీఎస్టీ పరిధిలోకి లాగబడి, పెరిగి పోయిన ఖర్చులతో (అదనపు పన్నుల భారం వచ్చి పడింది కనుక) వ్యాపారాలు, ఉత్పత్తి చేయలేక చేతులు ఎత్తేశారు. ఈ విధంగా జీఎస్టీ అమలు దేశంలోని అసంఘటిత రంగానికి చావు దెబ్బ అయ్యింది. 

కోవిడ్‌ కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా, మరెన్నో లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చితికిపోయాయి. స్థూలంగా ఈ విధానాల అన్నిటి ఫలితంగా 2022–23 నాటికి దేశంలోని సరుకు ఉత్పత్తి రంగంలో ఉన్న, అసంఘటిత రంగ పరిశ్రమల సంఖ్య 9.3 శాతం తగ్గి, 17.82 మిలియన్లకు పరిమితమయ్యింది.

దాంతో, ఈ పరిశ్రమలలో 15 శాతం మేర కార్మికులు ఉపాధిని కోల్పోయారు. సాధారణ స్థితిలో, ఈ అసంఘటిత సరుకు ఉత్పత్తి రంగ పరిశ్రమల సంఖ్య దేశంలో సాలీనా 2 మిలియన్ల చొప్పున పెరుగుతూ వచ్చింది. అవకతవక విధానాలు లేకుంటే ఈ అసంఘటిత రంగ సరుకు ఉత్పత్తి పరిశ్రమల సంఖ్య మరింతగా పెరిగి ఉండాలి. 

స్థూలంగా, మోదీ విధానాల ఫలితంగా సుమారు 10 మిలియన్ల మేర కొత్త సంస్థల ఆవిర్భావానికి ఆస్కారం లేకుండా పోయింది. దీనికిమించి, ఈ సంస్థలు ఒకొక్క దానిలో 2.5 నుంచి 3 ఉపాధి అవకాశాల కల్పనను మనం కోల్పోయాము. ఫలితంగా సుమారు 25–30 మిలియన్ల ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం మూసుకుపోయింది. 

అంటే, ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగాన్ని... సంఘటిత రంగం దిశగా మళ్ళించే పేరిట, మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఈ విధానాలు తొలుత కొంత పెద్ద కార్పొరేట్లకు అనుకూలించినా, అంతిమంగా నేడు అవి కూర్చున్న కొమ్మను నరుక్కున్న తీరుగా, కార్పొరేట్ల లాభాలకు కూడా గండి కొడు తున్నాయి. 

ఈ క్రమంలోనే, మార్కెట్‌లో డిమాండ్‌ దిగజారిపోయి నేడు రిటైల్‌ రంగంలోని రిలయన్‌ ్స, టైటాన్, రేమాండ్‌ వంటి సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవ త్సరం కాలంలోనే సుమారుగా 26 వేల మందిని ఈ సంస్థలు ఇంటికి పంపాయి.

మోదీ ప్రభుత్వ విధానాల ప్రతికూల ప్రభావాన్ని అర్థం చేసు కొనేందుకు ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలకు ముందర ఎయిర్‌ కూలర్ల తయారీలో బ్రాండెడ్‌ సంస్థలతో పాటుగా, స్థానికంగా చవకగా తయారయ్యే కూలర్లు కూడా ఉండేవి. ధర తక్కువ ఉన్న ఈ కూలర్లకు భారీ మార్కెట్టే ఉండేది. కానీ, ఇవి తమ ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కొరతలు, పెరిగిన పన్ను భారాల వల్ల మూసివేత బాట పట్టాయి. 

మార్కెట్‌ నుంచి వైదొలగిన ఈ లోకల్‌ సంస్థల అమ్మకాలు బ్రాండెడ్‌ కంపెనీలకు బదలాయించబడ్డాయి. ఫలితంగా తొలుత ఈ పెద్ద సంస్థల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. కానీ, చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బ తినడంతో దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం వలన ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్‌ పతనమై అంతిమంగా అది పెద్ద సంస్థల అమ్మకాలూ... లాభాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకు తిన్న విధానాల కథ ఇది. లాభాల దురాపేక్ష తప్ప, దూరదృష్టి లేని కార్పొరేట్ల గుడ్డితనం నేడు మోదీ విధానాల రూపంలో దేశ ప్రజలకు అశనిపాతంగా మారుతోంది!

డి. పాపారావు 
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్‌: 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement