చరిత్రతో మోడీ సమరం
ప్రధాని మన్మోహన్‌సింగ్ అయితే, ‘మోడీ అత్యుత్సాహంతో చారిత్రక వాస్తవాలతో పాటు, భౌగోళిక హద్దులను కూడా మారుస్తున్నా’రని ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ‘ఇంతటి మహాజ్ఞాని, చరిత్ర మీద అమోఘమైన అభినివేశం ఉన్నవాడు’ అంటూ, పేరు ప్రస్తావించకుండా అపహాస్యం చేశారు.
చంద్రగుప్తమౌర్యుడికీ, చంద్రగుప్తుడికీ, చంద్రగుప్తవిక్రమాదిత్యుడికీ మధ్య చాలా తేడా ఉంది. చంద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్త వంశానికి చెందినవారు. మొదట పేర్కొన్న చంద్రగుప్తుడులో ‘గుప్త’ అని ఉన్నా, అది ఆయన వంశ నామం కాదు. ఆయన మౌర్యుడు. కానీ వీరిని ఒకరిగా చెప్పడమో, లేక తేడా తెలియకుండా ప్రస్తావించడమో చేస్తే అది తప్పిదమే. భారతదేశ చరిత్ర తక్కువదేమీ కాదు. కానీ భారతీయులకు చరిత్ర స్పృహ తక్కువే. నాయకులు కూడా సామాన్య భారతీయులు జాబితాలో చేరితే కొంచెం కష్టమనిపిస్తుంది.
భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. చరిత్ర, అది ఇచ్చే ఉద్వేగాలు, ప్రేరణల మీద విశేషమైన నమ్మకం ఉన్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ ఎం పిక చేసుకున్న ప్రధాని అభ్యర్థి ఇటీవల మాట్లాడిన కొన్ని చారిత్రాకాంశాలు అపహాస్యం పాలుకావడం విషాదం. అక్టోబర్ 27న ‘హుంకారం’ పేరుతో పాట్నాలోని గాంధీ మైదానంలో ఇచ్చిన ఉపన్యాసం, నవంబర్ 11న గుజరాత్‌లోనే చరిత్రాత్మక ఖెడా దగ్గర ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఇచ్చిన ఉపన్యాసాలు మోడీని, ఆయన పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి.
మనల్ని పాలించడానికి ఒక చరిత్రకారుడు కావాలని మనం అనుకోవడం లేదు. కానీ చారిత్రకాంశాల ప్రస్తావన దగ్గర జాగరూకత ఉండాలి. చిన్న పొరపాటైనా పెద్ద రగడకు దారితీస్తుంది. సొంత రాష్ట్రంలోనే ఖెడా దగ్గర జరిగిన కార్యక్రమంలో ఆయన శ్యామాప్రసాద్ ముఖర్జీ (1901-1953) గుజరాత్ ముద్దుబిడ్డ అని అన్నారు. మోడీ ప్రస్తావించవలసిన అసలు పేరు శ్యాంజీ కృష్ణవర్మ (1857-1930). వర్మ విప్లవ సంఘాలతో కలిసి భారత స్వాతంత్య్రం కోసం పనిచేశారు. లండన్‌లో ఇండి యా హౌస్ స్థాపించిన గొప్పతనం కూడా ఆయనదే.
చిత్రం ఏమిటంటే, 22 ఆగస్టు, 2003న మోడీ స్విట్జర్లాండ్ నుంచి కృష్ణవర్మ చితాభస్మాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఈ మేరకు గుజరాత్ పర్యాటకశాఖ వెబ్‌లో సమాచారం ఉంది. ఇన్ని ఉన్నా ఒక బెంగాలీ ప్రముఖుడిని గుజరాత్ ముఖ్యమంత్రి తన రాష్ట్ర పౌరుడిని చేశారు. పైగా ముఖర్జీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. బీజేపీ పూర్వరూపం అదే. 1951-52లో ఆవిర్భవించిన జనసంఘ్ అత్యవసర పరిస్థితి (1975-77) తరువాతి పరిణామాలలో భాగంగా జనతాపార్టీలో ఒకటైంది. ముఖర్జీ కాశ్మీర్ అంశం మీద పోరాడుతూ అక్కడి జైలులోనే జూన్ 23,1953లో మరణించారు (ఇందుకు నెహ్రూ బాధ్యుడని మొన్న ఈ జూన్‌లోనే పంజాబ్‌లో జరిగిన ఒక సభలో మోడీ అన్నా రు). అయితే ఇది తడబాటు మాత్రమేనని బీజేపీ అధికార ప్రతినిధి లేఖి వివరణ ఇచ్చుకున్నారు.
పాట్నా సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మోడీని ఇం కాస్త ఇబ్బంది పెట్టాయి. ఆయన అక్కడ ప్రయోగించిన ‘గుప్త’ పాశుపతాస్త్రం ఎదురు తిరిగిందని మోడీ విమర్శకులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రముఖుడు, నెహ్రూ చరిత్ర రాసిన శశి థరూర్ మోడీ తడబాట్ల మీద చాలా వ్యంగ్యంగా స్పందించారు. చంద్రగుప్త మౌర్యుడికీ, చంద్రగుప్తుడికీ మధ్య తేడాను మోడీ గుర్తించాలని శశి వ్యాఖ్యానించారు. అలాగే సర్దార్ పటేల్ అంత్యక్రియలకు నెహ్రూ హాజరు కాలేదంటూ మోడీ విసిరిన విసురును కూడా శశి కొట్టిపారేశారు. ‘మోడీ మంచివాడు, ముక్కుకు సూటిగా ఉంటాడు. కానీ విస్తృతంగా చదువుకున్నవాడు కాదు’ అని శశి ముక్తాయింపు ఇచ్చాడు. ప్రధాని మన్మోహన్‌సింగ్ అయితే, ‘మోడీ అత్యుత్సాహంతో చారిత్రక వాస్తవాలతో పాటు, భౌగోళిక హద్దులను కూడా మారుస్తున్నా’రని ఎద్దేవా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ‘ఇంతటి మహాజ్ఞాని, చరిత్ర మీద అమోఘమైన అభినివేశం ఉన్నవాడు’ అంటూ, పేరు ప్రస్తావించకుండా అపహాస్యం చేశా రు. అలెగ్జాండర్ గంగ ఒడ్డున ఓడిపోయాడని చెప్పడం, తక్షశిలను (ఇస్లామాబాద్‌కు సమీపంలోనిది) బీహార్‌లో భాగంగా పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. అయితే మోడీని ప్రశంసించి నితీశ్ ఆగ్రహానికి గురైన జేడీ(యు) జాతీయ కార్యదర్శి శివరాజ్ సింగ్ మాత్రం ఈ విషయంలో మోడీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇన్నాళ్లూ సర్దార్ పటేల్‌ను మరచిపోయిన కాంగ్రెస్ పార్టీ, మోడీని తూర్పార పట్టడానికి ఆయన పేరును ఉపయోగించుకోవడమే విడ్డూరమని సింగ్ అంటున్నారు.
మోడీని పాట్నాలో అడుగుపెట్టనివ్వకూడదన్న పట్టుదలతో ఉన్న నితీశ్, నెహ్రూ కుటుంబం మీద ధ్వజమెత్తడంలో ముందుండే మోడీ లోని దోషాన్ని ఎంచే అవకాశం కోసం సదా పొంచి ఉండే కాంగ్రెస్ ఇలాంటి విమర్శలు చేయడంలో కొంత రాజకీయం కూడా ఉంది. కానీ ప్రధాని పదవికి పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి ఇలా దోషాలతో చరిత్ర చెప్పడాన్ని ఎవరూ మెచ్చరు.
- కల్హణ