‘గాంధీ’ల చేతిలో నెహ్రూ పత్రిక ఖూనీ
యూపీఏ హయాంలో జరిగిన వాటితో పోల్చినపుడు ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక కుంభకోణం లెక్కలోకి రాదు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కూడా వందల కోట్లు పలికినదే. ‘నేషనల్ హెరాల్డ్’ అనే పత్రికను ఆసరా చేసుకుని సోనియా, రాహుల్ సాగించిన కుంభకోణం ఐదు వేల కోట్ల రూపాయలే. కానీ ఇది జవహర్‌లాల్ నెహ్రూ స్ఫూర్తినీ, ఆయన జ్ఞాపకాలను ‘గాంధీ’ల నాయకత్వంలోని నేటి కాంగ్రెస్ ఎంత కించపరుస్తున్నదో భారత జాతి గమనించేటట్టు చేసింది.
సెప్టెంబర్ 9, 1937న లక్నోలో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల పత్రికను నెలకొల్పారు. భారత జాతీయ కాంగ్రెస్ వాణిని వినిపించడమే విధానంగా తీసుకున్న ‘నేషనల్ హెరాల్డ్’ తొలి సంపాదకుడు ఆయనే. 1938లో కోటంరాజు రామారావు సంపాదకుడి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు కూడా నెహ్రూ పాలక మండలి అధ్యక్షునిగా పని చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో వచ్చిన ఆంక్షల కారణంగా 1942-45 మధ్య పత్రిక మూత పడింది. 1946లో మళ్లీ ప్రచురణ ప్రారంభించినపుడు మానికొండ చలపతిరావు (ఎంసీ) సంపాదకత్వ బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుంచి 1978లో మరోసారి మూతపడే వరకు ఎంసీ ఆ స్థానంలో కొనసాగారు. ఆ విధంగా ఈ పత్రికతో తెలుగువారికి ఉన్న అనుబంధం బలమైనది. హిందీలో ‘నవజీవన్’, ఉర్దూలో ‘క్వామి ఆవాజ్’ పేర్లతో ఇదే పత్రికను వెలువరించారు. అత్యవసర పరిస్థితి తరువాత కాంగ్రెస్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు(1977-79) ఈ పత్రిక మూతపడినా, మళ్లీ ప్రచురణ సాగించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న నేషనల్ హెరాల్డ్ 1986లో మరోసారి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆదుకున్నారు. 1998లో ల క్నో శాఖ మూతపడింది. ఆ శాఖ తీర్చవలసిన బకాయిల కోసం కోర్డు ఆదేశం మేరకు కొన్ని ఆస్తులను వేలం వేశారు. పదేళ్ల తరువాత ఏప్రిల్ 1, 2008 నుంచి, అంటే యూపీఏ పాలనలోనే నేషనల్ హెరాల్డ్ ఢిల్లీ ప్రచురణ కూడా నిలిచిపోయింది. అప్పటి సంపాదకుడు టీవీ వెంకటాచలం. రూ. 90.25 కోట్ల అప్పు (ఎక్కువ ఉద్యోగుల బకాయిలు)భారంతో ఆ పత్రిక కుంగిపోయింది. 2011లో మరోసారి దీనిని తెరిపించాలని ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలకు స్వయంగా రాహుల్ అడ్డుపడ్డారని చెబుతారు. ఈ మధ్యలో రాహుల్, సోనియా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దుర్వినియోగం చేయడానికి కుట్ర పన్నారని బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణియం స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన పరిణామాలను చూస్తే ‘గాంధీ’లు నెహ్రూ కలల పత్రికను చిదిమివేయడానికి ఎంత పథకం పన్నారో సులభంగానే అర్థమవుతుంది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థ నేషనల్ హెరాల్డ్ (ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ) పత్రికను నిర్వహించేది. పత్రిక మూతపడినా 2010లో కూడా ఏజేఎల్ పని చేసింది. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు మోతీలాల్ ఓరా ఏజేఎల్ పాలక మండలి చైర్మన్. రాహుల్‌గాంధీ, మరో కాంగ్రెస్ ప్రముఖుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ డెరైక్టర్లు. ఆ సంవత్సరంలోనే ఏజేఎల్ స్థానంలో మరో పాలక మండలి ఆవిర్భవించింది. దాని పేరు యంగ్ ఇండియన్ లిమిటెడ్. ఇందులో సభ్యులు వేరెవరో కాదు, ఓరా, రాహుల్, ఫెర్నాండెజ్‌లే. ఈ కొత్త మండలి ఎందుకు? పత్రికను తిరిగి ప్రచురిస్తామని ఈ మండలి ప్రకటించినా, అది జరగలేదు. అయితే ఏజేఎల్ చెల్లించవలసిన రూ. 90 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి కొత్త మండలి హక్కును పొందింది. ఈ అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మోతీలాల్ ఓరా (పార్టీ కోశాధికారి) రూ. 90.25 కోట్లు అప్పుగా ఇచ్చారు. ఇదే కాకుండా, బహదూర్‌షా జఫార్ మార్గంలో (ఢిల్లీ) ఉన్న నేషనల్ హెరాల్డ్ భవంతినీ, ప్రింటింగ్ యంత్రాన్ని అద్దెకు ఇచ్చారు. దాని మీద వచ్చే అద్దెను ఒక ప్రైవేటు సంస్థ వసూలు చేస్తున్నది. ఆ సంస్థలో ప్రధాన సభ్యులు సోనియా, రాహుల్. అందుకే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోనియా, రాహుల్‌లకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు ఏడున వీరు కోర్టుకు హాజరు కావాలి. ఢిల్లీలోని భవంతితో సహా ఈ పత్రిక పేర లక్నో, భోపాల్, ఇండోర్, ముంబై, పంచకులా (చండీగఢ్), పాట్నాలలో ఉన్న స్థిరాస్థుల విలువ దాదాపు రూ. 5000 కోట్లు. చివరికి కాంగ్రెస్‌పార్టీ ఏజేఎల్‌కు తాను ఇచ్చిన రుణాన్ని రద్దు చేసి, ఈ ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ పరం చేసింది. ఈ వివాదం నుంచి బయటపడతామని సోనియా భృత్యులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ అదంత సులభం కాదు.
కల్హణ