గాంధీ, నెహ్రూ, వాజేపేయి చేయలేదా?
న్యూఢిల్లీ: ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మాజీ మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సందీప్ కుమార్ కు చెందిన ఓ అభ్యంతరకర వీడియో బయటకు రావడంపై శుక్రవారం ఆయన స్పందించారు. సందీప్ చేసింది తప్పేమీ కాదని వెనకేసుకొచ్చారు. శృంగారం మానవ లక్షణం అని సందీప్ ను సమర్ధించే ప్రయత్నం చేశారు.
సందీప్ వివాదంపై అశుతోష్ తన బ్లాగ్ లో వివరణ ఇచ్చారు. దేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా సామాజిక బాధ్యతలను మరిచి ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని వివాదాస్పదంగా మాట్లాడారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, వాజ్ పేయిలు కూడా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయని చెప్పారు. అయితే వారు రాజకీయంగా ఏ విధంగానూ నష్టపోలేదని అన్నారు.
నెహ్రూ తనతో పాటు పనిచేసే మహిళలతో వివాహేతర సంబధాలు కలిగి ఉన్నారనే పుకార్లు షికార్లు చేశాయని చెప్పారు. ఎడ్వినా మౌంట్ బాటెన్ తో నెహ్రూకు ఉన్న అనుబంధం గురించి అప్పట్లో విపరీతమైన చర్చ జరిగేదని బ్లాగ్ లో రాశారు. 1910లో గాంధీజీ సర్లా చౌదరితో అనుబంధాన్ని పెంచుకున్నారని.. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ కు దూరపు బంధువని చెప్పారు. సర్లా తన ఆత్మకు భార్య అని గాంధీజీనే స్వయంగా చెప్పారని తెలిపారు.
దీంతో సీ రాజగోపాలాచారి మిగిలిన పార్టీ సీనియర్ నేతలు ఈ విషయంలో జోక్యం చేసుకుని గాంధీజీ ఆమెను వదలివేసేలా చేశారని అన్నారు. ఆ తర్వాతి రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకునేందుకు యువతులతో కలిసి గాంధీజీ నిద్రించారని చెప్పారు. నెహ్రూ ఈ విషయంపై గాంధీతో మాట్లాడినా ఆయన వినలేదని తెలిపారు.
అటల్ బీహారీ వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ సంప్రదాయాలను పాటిస్తూ వివాహం చేసుకోలేదని చెప్పారు. పార్లమెంటులో తాను బ్యాచిలర్ నే కానీ బ్రహ్మచారిని మాత్రం కాదని ఆయనే ప్రకటించారని గుర్తుచేశారు. వాజ్ పేయి బహిరంగంగానే కళాశాల స్నేహితురాలితో కలిసి తిరిగారని.. అప్పుడు ఎవరూ ఆయనకు అడ్డుచెప్పలేదని అన్నారు. సోషలిస్టు లీడర్ రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెస్, చైనీస్ లీడర్ మావో జె డాంగ్ ల జీవితాలను కూడా అశుతోష్ ఉదాహరణగా పేర్కొన్నారు.