నవ్యాంధ్ర సాహిత్య సంచిక
పుస్తక పరిచయం
నడుస్తున్న చరిత్రను సాహిత్యంలో ప్రతిబింబింప చేయడం ఉన్నత స్థాయి రచనా వ్యాసంగం. వర్తమాన సాహిత్య ధోరణులను పరామర్శించుకోవడం కూడా అలాంటిదే. ‘నవ్యాంధ్ర’ సాహిత్య ప్రత్యేక సంచికలో ఈ రెండూ కనిపిస్తాయి. ఇందులో ఇరవై కథలు, పన్నెండు ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంకో రెండు వ్యాసాలు, సాహిత్య చర్చకు సంబంధించిన మరో వ్యాసం ఉన్నాయి. మొదటి కథ ‘శ్రీరామా ఎన్‌క్లేవ్’ (పి.సత్యవతి) క£ý నీ, ఇంటర్వ్యూలనీ చదివితే నడుస్తున్న చరిత్ర సాహిత్య రూపం దాలుస్తున్న సంగతితో పాటు, తెలుగు నాట సాగుతున్న రచనా వ్యాసంగం మీద అభిప్రాయం ఏర్పడటానికి కూడా ఆస్కారం కలుగుతుంది.
ఈ కథ పెద్ద నోట్ల రద్దు, పరిణామాలు ఇతివృత్తంగా సాగిన కథ. ఇందులో కవితలు కూడా సమకాలీన సంక్షోభాల మీద వ్యాఖ్యానాలే! ఉదాహరణ: ఎండ్లూరి సుధాకర్ కవిత, ‘ఆ 18 మంది’. ఇది పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన ఉరీ సైనికులకు నివాళిగా రాసినది. ఎండపల్లి భారతి, కె. వరలక్ష్మి, రాధిక, జి.లక్ష్మి, కుప్పిలి పద్మ, జీఆర్ మహర్షి, దాట్ల దేవదానం రాజు కథలూ ఉన్నాయిందులో. మెహెర్ కథ ‘కన్నగాడి నాన్న’ కొడుకును కోల్పోయిన తండ్రి కథ. ఆ దురదృష్ట ఘటనలో కొడుకు పోయినా, బతికి బయటపడిన కొడుకు స్నేహితుడిలో కొడుకును చూసుకుంటాడా తండ్రి. అయితే ఈ బాధ లోకానిది కాదు. లోకానికి పట్టదు.
ఈ సంచికలో ఇంటర్వ్యూలకు ప్రత్యేకత ఉంది. కొన్ని లోతైన అంశాలనే చర్చించాయి. ఉద్యమానికీ, సాహిత్యానికీ; జీవితానికీ, సాహిత్యానికీ మధ్య ఉన్న వారథులను చర్చించిన ఇంటర్వ్యూలు ఇవన్నీ. వామపక్ష ఉద్యమాలతో, ప్రజా ఉద్యమాలతో, పార్లమెంటరీ రాజకీయాలను విశ్వసించే పార్టీలతో అన్నింటికీ మించి సాహిత్యంతో మంచి అనుబంధం ఉన్న డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ఇంటర్వ్యూ చాలా విషయాలను చర్చించింది. ‘రచయిత పరిధి వేరు. పార్టీ కార్యకర్త పరిధి వేరు. రచయితలందర్నీ సామూహికంగా ‘నిబద్ధత’ పేరుతో నియంత్రించడం సమంజసం కాదు. అది రచయిత స్వేచ్ఛకు అడ్డుపడుతుందని దిగంబర కవులూ, నేనూ వ్యతిరేకించినాము. ఆ కారణాలవల్లే విరసం నుండి బయటకు వచ్చినాను’ అని డాక్టర్ చెప్పిన మాటకు సాహిత్య ప్రస్థానంలో ఎంతో విలువ ఉందనిపిస్తుంది. శిష్యరికానికీ, సిద్ధాంతం మీద నమ్మకానికీ మధ్య ఉండే సన్నని గీతను పెద్దిభొట్ల సుబ్బరామయ్య జీవితంలోంచి గమనించడం అవసరం. ఆయన విశ్వనాథ శిష్యుడు. కానీ ఆయన రచనా వ్యాసంగంలో కనిపించే దృక్పథం గురువుగారి ధోరణికి భిన్నమైనది. కొలకలూరి ఇనాక్ ఇంటర్వ్యూలో ‘తెలుగు భాషకు మనుగడ ఉందా?’ అన్న ప్రశ్నకు చక్కని సమాధానం ఉంది:
‘‘ఏదైనా అవసరం మేరకు మారుతుంది. తెలుగయినా అంతే. దాని వినియోగమైనా అంతే. సంస్కృత స్వరూపమైన భాష కొత్తరూపాలు పొందినా, కొత్త పదజాలం గ్రహించినా మార్పులకు గురి అవుతూ ఉంటుంది. తెలుగు భవిష్యత్తుకు ఢోకా లేదు’’. వీఏకే రంగారావు (సుదీర్ఘమైనది), నామిని, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు ఇంటర్వ్యూలు భిన్నాంశాలను స్పర్శించాయి. బాతిక్ కళాకారుడు పుట్టా పెంచలదాసు చిత్రకళా నైపుణ్యం మీద వ్యాసం చక్కనిది.
రాజాచంద్ర ఫౌండేషన్ గతంలో మంచి పుస్తకాలను వెలువరించింది. నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక కూడా అంతే శ్రద్ధతో వెలువరించారు. తెలుగు భాషోద్యమ సమితి సమర్పించిన ఈ సంచికకు సంపాదకులు సాకం నాగరాజ, గంగవరం శ్రీదేవి. ఈ పుస్తకం చేతిలోకి రాగానే వడ్డాది పాపయ్య ముఖచిత్రం కేసి కొన్ని లిప్తలపాటైనా చూశాకే లోపలికి వెళతాం.
నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక; సంపాదకులు: సాకం నాగరాజ, గంగవరం శ్రీదేవి; పేజీలు: 136(ఏ4 సైజ్); వెల: 100; ప్రచురణ: తెలుగు భాషోద్యమ సమితి, రాజాచంద్ర ఫౌండేషన్, తిరుపతి.
కల్హణ