ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. వాల్‌పోస్టర్లతో సినిమా బాగోగులు నిర్ణ యం కావు. కానీ అవి మంచి ప్రచారం తెచ్చి పెడతాయి. పోటాపోటీగా ఉండే మాస్ హీరోల విషయంలో ఇది మరింత నిజం. వెండితెర శైలిని ప్రతి అడుగులోను అనుసరిం చే ద్రవిడ పార్టీలకి ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. ద్రవిడ మున్నేట్ర కజగం (డీ ఎంకే)లో తాజాగా మొదలైన వాల్‌పోస్టర్ల వివాదం ఈ సారి ప్రచారం స్థాయిని దాటి, విశ్లేషకులూ ఇతర పార్టీలూ కొత్త అంచనాలకు, ఆశలకు వచ్చేటట్టు చేసింది. డీఎంకే దళపతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పెద్ద కొడుకు ఎంకె అళగిరిని హీరోను చేసే ఉద్దేశంతో వెలిసిన ఈ పోస్టర్ల మీద పార్టీ నాయకత్వమే పిడకలు కొట్టించేసింది. ఈ సీరియస్ కామెడీ చివరికి ఎక్కడికి దారి తీస్తుందోనన్నది పెద్ద ప్రశ్న.
దక్షిణ తమిళనాడులోని మధురై నగరంలో జనవరి నాలుగున హఠాత్తుగా ఆ పోస్టర్లు గోడల నిండా వెలిశాయి. భారీ సిని మా పోస్టరుకు ఏమీ తగ్గకుండా రంగులతో, వృద్ధనేత కరుణానిధి, వారసత్వ పోరులో తలమునకలై ఉన్న ఆయన ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్, ఇతర పెద్దల ముఖాలన్నీ ఆ పోస్టర్‌లో ఉన్నాయి. కానీ అవి ఇచ్చిన సమాచారం అధిష్టానం పాలిట పుండు మీది కారమైంది. ‘జనవరి 30న చెన్నై నగరంలోని కలైంజర్ అరంగంలో డీఎంకే సర్వ సభ్య సమావేశం జరుగుతుంది’ అని ఆ రాతల అర్థం. జనవరి 30 అళగిరి పుట్టినరోజు. దీనికి ‘ఇని ఒరు విధి సీవొమ్’ అని శీర్షిక కూడా పెట్టారు. దీనర్థం, మనం లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. ఇది మహాకవి సుబ్రహ్మణ్య భారతి కవితలలో ఓ పంక్తి. సినిమా పోస్టర్లు వేర్వేరు నిశ్చల చిత్రాలతో దర్శనమిచ్చినట్టు, ఈ పోస్టర్లను రకరకాలుగా ముద్రించారు. అళగిరి వీరాభిమానులు ముగ్గురి పేర్లు కింద కనిపిస్తున్నా యి. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇలాంటి ‘తుంటరి పోస్టర్లు’ ఏమిటని కరుణానిధి ఇచ్చిన ప్రకటన పార్టీ పత్రిక ‘మురసోలి’లో మరునాడే కనిపించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జాతీయ పత్రికలలో, తమిళనాడు పత్రికలలో వస్తున్న వార్తలూ విశ్లేషణలను బట్టి, ఇది పార్టీతో అళగిరి చేస్తున్న ఆఖరి పోరాటం. మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాలను అళగిరి చూస్తుంటారు. చెన్నై కేంద్రంగా స్టాలిన్ మిగిలిన భాగాన్ని అదుపు చేస్తూ ఉంటారు. డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఆవిర్భవించి ఉండవచ్చు. బ్రాహ్మణాధిపత్యం మీద, వైదిక సంప్రదాయాల మీద తిరుగుబాటే ఊపిరిగా మనుగడ సాగిస్తూ ఉం డొచ్చు. కానీ రాజకీయాల దగ్గర మాత్రం మధ్యయుగం పోకడలకు, అది ఎంతో ద్వేషిం చే కాంగ్రెస్‌కు ఏ మాత్రం అతీతం కాదని ఎప్పుడో రుజువు చేసుకుంది. కరుణానిధికి ఇప్పుడు 90 ఏళ్లు. ఆయన వారసత్వం గురిం చి పోరాటం తీవ్రం కావడం అనూహ్యమేమీ కాదు. నిజానికి ఇది ఏడేళ్ల క్రితమే ప్రారంభమైంది. డీఎంకేలో స్టాలిన్ అంత్యంత ప్రజాకర్షణ గల నాయకుడంటూ 2007 సంవత్సరంలో ‘దినకరన్’ పత్రిక ప్రచురించిన కథనం తుపాను సృష్టించింది.
మధురైలో ఆ పత్రిక ప్రతులను అళగిరి వర్గీయులు తగులబెట్టారు. పత్రిక కార్యాలయం మీద దాడికి దిగారు. ఈ అల్లర్లను అదుపు చేయడానికి జరిపిన కాల్పులలో ముగ్గురు చనిపోయారు కూడా. అప్పు డు కొడుకులిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కరుణానిధి తన వంతు ప్రయత్నం చేశారు. అవేమీ ఫలితాలను ఇవ్వలేదనే అనిపిస్తుంది. తాజా వాల్‌పోస్టర్ల వివాదం, తరువాత జరిగిన పరిణామాలు ఇదే చెబుతున్నాయి. పోస్టర్లు ముద్రించిన ముగ్గురిని పార్టీ బహిష్కరించింది. వారు తన వర్గం వారు కాదని అళగిరి వెంటనే ప్రకటన చేశారు. ఆ వెంటనే మధురై శాఖను రద్దు చేసి తాత్కాలిక నిర్వాహక కమిటీని స్టాలిన్ ఏర్పాటు చేశారు. దీన్నిండా స్టాలిన్ వర్గీయులే. స్టాలిన్ చర్యను ఖండిస్తూనే, తనను పార్టీలో ఏకాకిని చేసే కుట్ర ఇప్పటిది కాదనీ, అయినా తాను విమర్శలకు దిగడం లేదనీ అళగిరి చెప్పారు.
అక్కడితో ఆగక, తాను ఒక్క కరుణానిధి నాయకత్వాన్ని మినహా మరెవ్వరి నాయకత్వాన్ని ఆమోదించే ప్రశ్నే లేదంటూ స్టాలిన్ నాయకత్వానికి అళగిరి నేరుగానే సవాలు విసిరారు. జయలలితతో విభేదాలు పెంచుకున్న దేశీయ మరుపోక్కు ద్రవిడ కజగం (డీఎండీకె)తో రేపటి పార్లమెంట్ ఎన్నికలలో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు సాక్షాత్తు కరుణానిధి చేసిన ప్రకటనను కూడా అళగిరి ఎద్దేవా చేశారు. డీఎండీకే నేత, సినీనటుడు విజయ్‌కాంత్ డీఎండీకే అధినాయకుడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆయనే. డీఎంకే మూడో స్థానంలో ఉంది. అయితే విజయ్‌కాంత్‌ను తాను రాజకీయవేత్తగానే పరిగణించనని అళగిరి ప్రకటించి, తండ్రి ఆగ్రహాన్ని చవి చూశా రు. క్రమశిక్షణ తప్పిన వారు ఎవరినైనా పార్టీ నుంచి పంపే అధికారం తమకు ఉందని వృద్ధనేత మండిపడ్డారు. ఈ పరిణామాలన్నీ జనవరి నాలుగున మొదలై నాలుగు రోజులలోనే వేగంగా జరిగిపోవడం విశేషం.
ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. తమిళనాడులో ఒక ఆధారం కోసం పడిగాపులు పడి ఉన్న కాంగ్రెస్ ఇందుకు ఎలాగూ సై అం టుంది. డీఎంకేకు బద్ధశత్రువైన జయకు ఈ ‘మధురై బలాఢ్యుడు’ స్నేహహస్తం చాపే అవ కాశాలు కూడా ఉన్నాయని మరొక వాదన. స్టాలిన్‌ను ఎదుర్కొనడానికీ, ఇప్పటికే రకరకాల కేసులతో జైళ్లలో మగ్గుతున్న తన అనుచరులకు ఊరట కల్పించడానికీ ఇది అళగిరికి ఉపయోగపడుతుందని అంచనా. ఏమైనా మధురై పోస్టర్లు ఒక బాక్సాఫీసు హిట్‌నే దేశం ముందుకు తేబోతున్నాయని అనుకోవచ్చు.
- కల్హణ