మహబూబాబాద్: కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీకి పట్టిన చీడపురుగు.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలనే నినాదాలతో మంగళవారం వెలిసిన వాల్‌పోస్టర్లు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి. మేల్కొన్న నాయిని వర్గీయులు ఉదయమే వాల్‌పోస్టర్లను తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.
కాగా, పోస్టర్లను అంటించింది తానేనని జులైవాడకు చెందిన మూరతోటి అనిల్‌కుమార్ తెలిపారు. మాజీ మంత్రి హయగ్రీవాచారి శిష్యుడిగా 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కార్పొరేషన్ ఎన్నికల్లో తనను కాదని రాజేందర్‌రెడ్డి అనర్హుడికి టికెట్ అమ్ముకున్నాడని, పోస్టర్లను తొలగిస్తే పోరాటాన్ని ఆపేది లేదని అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఆటోలకు అంటించి, కరపత్రాలను పంచుతానని పేర్కొన్నారు.
సీపీకి ఫిర్యాదు చేశా..
ఈ విషయంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని వివరణ కోరగా తన ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు తప్పుడు ప్రచారం చేస్తూ, వాల్‌పోస్టర్లను అంటించిన అనిల్‌కుమార్‌పై సుబేదారి పోలీస్ స్టేషన్, పోలీస్ కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తనకు టికెట్ వస్తుందనే అక్కసుతో కొందరు తమ పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అనిల్‌కుమార్ ఒక రౌడీషీటర్ అని, అలాంటి వ్యక్తిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. తాను ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానని నాయిని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment