wall posters
-
కాంగ్రెస్‌లో వాల్‌పోస్టర్ల కలకలం..! వాల్‌పోస్టర్లు అంటించింది నేనే..!!
మహబూబాబాద్: కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీకి పట్టిన చీడపురుగు.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలనే నినాదాలతో మంగళవారం వెలిసిన వాల్‌పోస్టర్లు వరంగల్ పశ్చిమ కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి. మేల్కొన్న నాయిని వర్గీయులు ఉదయమే వాల్‌పోస్టర్లను తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, పోస్టర్లను అంటించింది తానేనని జులైవాడకు చెందిన మూరతోటి అనిల్‌కుమార్ తెలిపారు. మాజీ మంత్రి హయగ్రీవాచారి శిష్యుడిగా 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కార్పొరేషన్ ఎన్నికల్లో తనను కాదని రాజేందర్‌రెడ్డి అనర్హుడికి టికెట్ అమ్ముకున్నాడని, పోస్టర్లను తొలగిస్తే పోరాటాన్ని ఆపేది లేదని అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఆటోలకు అంటించి, కరపత్రాలను పంచుతానని పేర్కొన్నారు. సీపీకి ఫిర్యాదు చేశా.. ఈ విషయంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని వివరణ కోరగా తన ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు తప్పుడు ప్రచారం చేస్తూ, వాల్‌పోస్టర్లను అంటించిన అనిల్‌కుమార్‌పై సుబేదారి పోలీస్ స్టేషన్, పోలీస్ కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు టికెట్ వస్తుందనే అక్కసుతో కొందరు తమ పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అనిల్‌కుమార్ ఒక రౌడీషీటర్ అని, అలాంటి వ్యక్తిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. తాను ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానని నాయిని ధీమా వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ వార్.. అదే దారిలో బీజేపీ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాల్ పోస్టర్ల వార్‌కు తెర తీయగా.. ఇప్పుడు అదే దారిలో బీజేపీ కౌంటర్‌కు దిగింది. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఫ్లై ఓవర్‌కు బీజేపీ అతికించింది. ఈ క్రమంలో మళ్లీ పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది. ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్‌పై రచ్చ కొనసాగుతోంది. మొన్న మోదీ ఫొటోలతో ఫ్లై ఓవర్ పనులు సాగడం లేదని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు కొందరు వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్లు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా ఏర్పాటు చేశారు. కాగా, వాస్తవాలు తెలుసుకోవాలంటూ ఒక దిన పత్రికలో వచ్చిన వార్తతో వాల్ పోస్టర్ వెలిసింది. ఉప్పల్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ ర్యాలీ నిర్వహించి, ధర్నాకు దిగారు. ఫ్లై ఓవర్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే కారణమని బిజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. చదవండి: ‘మోదీగారు.. ఇంకెన్నాళ్లూ?’ ఉప్పల్ తిప్పల్‌పై పిల్లర్లకు పోస్టర్లు -
ఉప్పల్ తిప్పల్.. మోదీ పోస్టర్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఉప్పల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్ళు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఉప్పల్ నుండి ఘట్కేసర్ వెళ్ళే వరంగల్ హైవే పై కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఐదేళ్లలో సగం పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో.. ఆ రూట్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పనులు నడుస్తుండడంతో సాయంత్రం వేళ్ల ఉప్పల్, మేడిపల్లి మధ్య ప్రయాణం గంటకు పైనే పడుతోంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లేవారు ఉప్పల్ రింగ్‌రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది. దీంతో వాహనదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది. ఉప్పల్ వరంగల్ హైవేపై.. ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని భావించింది కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2018 మేలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు. దీంతో ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. హైదరాబాద్ లో మళ్ళీ పోస్టర్ల కలకలం ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ 5 ఏండ్లు అయినా 40% పూర్తి కాలేదు.. ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు మోడీ గారు అంటూ ఫ్లైఓవర్ పిల్లర్లపై వెలసిన పోస్టర్లు.#ModiDisasterForIndia#ModiHataoDeshBachao pic.twitter.com/tAXRBbull3 — Latha (@LathaReddy704) March 28, 2023 -
మునుగోడు బైపోల్: రాజగోపాల్‌రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. చండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రే వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరులో నామినేషన్ దాఖలు చేసిన నాడే.. ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం గమనార్హం. ఫోన్ పే తరహాలో.. కాంట్రాక్ట్ పే అంటూ వేల పోస్టర్లను రాత్రికి రాత్రే అంటించారు ప్రత్యర్థులు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన ఆస్తులు, అప్పులు, పోలీసు కేసులు.. ఇతరత్ర వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సోమవారం అందజేసి.. నామినేషన్ వేశారు. అయితే.. రాజగోపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా పోస్టర్లు ప్రచురించి.. గోడలకు అంటించారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఏర్పాట్లు చేసిన పోస్టర్లు దుమారం రేపుతోన్నాయి. ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ దర్శనమిస్తున్న పోస్టర్లు స్థానికుల్ని చర్చించుకునేలా చేస్తున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి గోడలకు వేలాది పోస్టర్లను కొంతమంది అతికించారు. రూ.18 వేల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు. పైగా 500 కోట్ల బోనస్ సంపాదించారంటూ పోస్టర్లో పొందుపర్చారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతోన్నాయి. ఈ పోస్టర్ల వ్యహారంపై బీజేపీ మండిపడుతోంది. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, ఇలా పోస్టర్లతో ఆయనను ఇబ్బందికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఆయన రాజీనామా చేసిన దగ్గర నుంచి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతూనే ఉన్నాయి. -
ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!
గత ఐదేళ్లుగా సరైన జోడి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ, దొరకట్లేదు. సంబంధాల కోసం ఎంతో డబ్బు ఖర్ఛు చేశాం.. ఫలితం లేదు. ఏం చేయను.. తప్పట్లేదు అంటూ ఆ యువకుడు చేసిన పని ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ కులం, ఇతర వివరాలతో పాటు మధురై అంతటా రోడ్ల కూడళ్లలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వేశాడతను. ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే జగన్.. పార్ట్ టైంలో డిజైనర్‌గా కూడా పని చేస్తున్నాడు. నా పనిలో భాగంగా ఎంతో మంది కోసం.. ఎన్నో పోస్టర్లు డిజైన్ చేశా. నా కోసం ఎందుకు డిజైన్ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఇలా అంటున్నాడు ఆ యువకుడు. ఎంతో మంది అమ్మాయిని చూస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ, ఎవరూ సరిపోయే జోడిని తేలేకపోయారు. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు అతను. అయితే.. పోస్టర్లు పెట్టాక ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే.. అబ్బే లేదంట. కేవలం.. మ్యారేజ్ బ్రోకర్లు మాత్రమే ఫోన్లు చేస్తున్నారట పాపం. నైంటీస్‌లో పుట్టిన తనకు ఇదొక టఫ్ టైం అంటున్నాడు ఎమ్మెఎస్ జగన్. ఇంటర్నెట్లో మీమ్స్‌తో పాటు కొంతమంది ఫోన్ కాల్స్ చేసి.. పాపం అతన్ని పెళ్లి చూపులంటూ ఏడ్పించారట కూడా. కానీ, ఎవరినీ పట్టించుకోకుండా ఈ ప్రయత్నం ఆపనంటున్నాడు అతను. ఒకవేళ.. త్వరలో మంచి సంబంధం గనుక కుదిరితే.. కృతజ్ఞతలతో మరొక పోస్టర్ తయారు చేస్తాడంట. -
మిస్టరీ తేల్చిన ‘పోస్టర్’
వర్గల్: హతురాలి ఆచూకీ కోసం పోలీసులు అంటించిన వాల్‌పోస్టర్లు ఓ మిస్టరీని ఛేదించాయి. అడవిలో కనిపించిన మహిళ మృతదేహం ఎవరన్నదీ తేలిపోయింది. వివరాలివీ... మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట అడవిలో ఈ నెల 6 న గుర్తు తెలియని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహం పూసల దండ, ముక్కుపుడక, ధరించిన దుస్తులు మాత్రమే పోలీసుల దర్యాప్తుకు ఆధారంగా మిగిలాయి. దీంతో ఆ మహిళ ఎవరు అన్నది మిస్టరీగా మారింది. మిస్సింగ్ కేసుల ఆధారంగా గౌరారం పోలీసులు సాగించిన శోధన ఫలించలేదు. దీంతో వారు ఫొటోతో కూడిన వాల్‌పోస్టర్లను వర్గల్, తూప్రాన్, ములుగు, మేడ్చల్ తదితర మండలాల్లో అంటించారు. కేసు నమోదైన తరువాత 12 రోజులకు బుధవారం తూప్రాన్ మండలం పాలాటలో మృతురాలి బంధువులు పోస్టర్ చూసి మృతదేహాన్ని గుర్తుపట్టారు. మృతురాలు పాలాటకు చెందిన ఓలెం బాలమణి(45)గా నిర్ధారించారు. మృతురాలి వివరాలివీ.. తూప్రాన్ మండలం పాలాటకు చెందిన ఓలెం బాలమణి భర్త నర్సాపూర్‌కు చెందిన ముద్దగోలోల్ల రాములు గతంలోనే మృతి చెందాడు. ఆ తరువాత రోడ్డు ప్రమాదంలో కొడుకు కూడా చనిపోయాడు. దీంతో ఆమె తూప్రాన్‌లో ఓ అద్దె గదిలో ఉంటూ అక్కడి అభిరుచి హోటల్లో దినసరి వేతనంపై పనిచేస్తోంది. ఈ నెల 3న సాయంత్రం వరకు హోటల్లో పనిచేసిన ఆమె తరువాత రోజు నుంచి అదృశ్యమైంది. పని చేసిన రోజే వేతనం కావడంతో ఆమె ఎందుకు రాలేదో యజమాని పట్టించుకోలేదు. ఆమె అదృశ్యమైన విషయం బంధువులకు కూడా తెలియకపోవడంతో మీనాజీపేట అడవిలో బాలమణి శవం మిస్టరీగా మిగిలిపోయింది. అడవిలో ఏం జరిగింది..? ఆమె శవంగా ఎందుకు మారిందో ప్రశ్నార్థకంగా నిలిచింది. అడవిలో ఏం జరిగింది, ఎవరైనా అఘాయిత్యానికి ఒడిగట్టారా, అక్కడే అంతమొందించారా, లేదా ఎక్కడైనా హతమార్చి ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా.. ఇలాంటి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ కేసును ఛేదిస్తామని గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి అంటున్నారు. -
వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధం!
హైదరాబాద్: నగరంలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధాన్ని కచ్చితంగా అమలుచేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. సోమవారం జీహెచ్ఎంసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చెత్త సమస్య, నాలాల ఆక్రమణ, మంచినీటి సరఫరాపై సుధీర్ఘ చర్చ జరిగింది. దీంతోపాటు వాల్ పోస్టర్ల సమస్య, వాల్ రైటింగ్స్ పై కూడా చర్చించి వాటిపై నిషేధాన్ని తప్పకుండా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
‘స్వచ్ఛ’పై నలు‘దిశ’లా ప్రచారం
మహబూబాబాద్ టౌన్ : పరిశుభ్రతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిం చారు. దీనిపై ఊరూరా అవగాహన కల్పించడానికి మహబూబాబాద్‌కు చెందిన దిశ సామాజిక సేవా సంస్థ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కరపత్రాలు, స్టిక్కర్లు, పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో సైతం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా దిశ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.గురునాథరావు ‘సాక్షి’తో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ నివేదికల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 69 శాతం మరుగుదొడ్లు లేవని, సుమారు 30 శాతం పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం దేశంలో శిశు మరణాలు శుభ్రత లేకపోవడంతోనే సంభవిస్తున్నట్లు తెలిపిందన్నారు. ఇటీవల జాతీయ క్రైం నివేదిక ప్రకారం మహిళలు, బాలికలపై జరిగే లైంగిక దాడులు చాలా వరకు బహిర్భూమికి వెళ్లిన సందర్భాల్లోనే జరిగాయని తెలపడం చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు.. మరి ఊరు బాగుంటే మనమంతా బాగుంటాం.. పెద్దలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.. భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది’ అని తెలిపారు. ఇలా గ్రామీణ యువతలో స్వచ్ఛ భారత్‌పై చైతన్యం కలిగించేందుకు దిశ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు సమీపిస్తున్న తరుణంలో సరైన నిర్ణయం తీసుకుని కేంద్రం చిత్తశుద్ధితో స్వచ్ఛ భారత్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. దీనికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు. -
సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాలంటూ పోస్టర్లు
-
సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాలంటూ పోస్టర్లు
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మంగళవారం గాంధీలో తెలంగాణ-సీమాంధ్ర వైద్యుల మధ్య రగడ నెలకొంది. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర వైద్యులను హెచ్చరిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు ఇరుప్రాంతాల వైద్యుల మధ్య వివాదానికి దారి తీసాంది. రాష్ట్రం విభజించినందువల్ల 'మీరు మీ స్వస్థలాలకు ప్రాధాన్యత ఇచ్చి వెళ్లగలరని, తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తప్పవని' వాల్ పోస్టర్లో హెచ్చరించారు. గాంధీ ఆస్పత్రి, మెడిక్ల కళాశాల్లో సుమారు 300 మంది ప్రొఫెసర్లు, అసోషియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తుండగా వారిలో 60శాతం మంది వైద్యులు సీమాంధ్రకు చెందినవారే. కాగా తమపై దాడులు చేశారంటూ తెలంగాణ వైద్యులు సూపరిండెంటెంట్ ఫిర్యాదు చేశారు. సీమాంధ్ర డాక్టర్లు విధులకు హాజరు కావటం లేదంటూ తెలిపారు. కాగా ఇరు ప్రాంతాల వైద్యుల మధ్య ఏర్పడ్డ వివాదంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
హైటెక్ ప్రచారం
ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా సాగుతోంది. జెండాలు, వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, కరపత్రాలు, భారీ కటౌట్ల స్థానంలో తాజాగా కంప్యూటర్లు, సెల్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేని నేతలు సైతం ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రసంగ పాఠాలతో సోషల్ మీడియా (సెల్‌ఫోన్, ఇంటర్నెట్) ద్వారా విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని కాలనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువజన, కుల, ఉద్యోగ సంఘాల నేతల పేర్లు, ఫోన్ నెంబర్లను సేకరించి అభ్యర్థులే స్వయంగా ఓటర్లతో మాట్లాడుతున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఓటు ఎందుకు వేయాలో, ఎవరికి వేయాలో సూచిస్తూ ప్రతి రోజూ ఓటర్ల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించుకుని వారి సేవలను వినియోగించుకుంటున్నారు. హైటెక్ హంగులతో ఎంఐఎం ప్రచారం .. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీకి దీటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎంఐఎం ప్రచారంలో హైటెక్ హంగులు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు గుర్తింపు, పనితనంపై కూడళ్లలో భారీ హోర్డింగులతో ప్రచారాస్త్రాన్ని సందిస్తోంది. హోర్డింగ్‌లపై చారిత్రక ప్రదేశాలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీల ఫొటోలను ముద్రించారు. సాంస్కృతిక బృందాలు.. కంప్యూటర్ పరిజ్ఞానం లేని, చదువు రాని ఓటర్లను ఆకర్షించేందకు వారికి అర్థమయ్యే రీతిలో అభ్యర్థి గురించి ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ఎవరికి వారే స్వతహాగా ప్రత్యేక సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థి గొప్పతనం, ఆయన జీవన శైలి, ఇప్పటి వరకు ఆయన చేసిన సేవ, తదితర అంశాలే ఇతివృత్తంగా చేసుకుని సుప్రసిద్ధ రచయితలతో పాటలు రాయించి, ప్రముఖ గాయకులతో పాడిస్తున్నారు. స్టూడియోల్లో వీటిని రికార్డ్ చేయిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతుండటం విశేషం. ఓటరు దృష్టిని ఆకర్షించేందుకు పార్టీగుర్తు, జెండా రంగులో ప్రత్యేకంగా టీ-షర్టులు, చీరలు తయారు చేయించి కార్యకర్తలకు పంచుతున్నారు. బిజీగా ఫ్లెక్సీ సెంటర్లు.. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతుండటంతో వాటిని ముద్రించే ఫ్లెక్సీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకూ పనిలేక ఖాళీగా కనిపించిన ఆర్టిస్టులు, పెయింటర్లు ప్రచార రథాలు, బ్యానర్లు, జెండాల తయారీలో బిజీగా మారిపోయారు. ప్రచారానికి భారీ కాన్వాయ్‌తో బయలు దేరుతున్నారు. ఇందు కోసం వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలకు నెలవైన ఫంక్షన్ హాళ్లు తాజాగా ఎన్నికల ప్రచారానికి వేదికలవుతున్నాయి. సోషల్ మీడియాదే హవా ... ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల సంయుక్తంగా సోషల్ మీడియాపై ఓ సర్వే నిర్వహించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో 160 సీట్లను ఫేస్బుక్, ఆర్కూట్, ట్విట్టర్ల వంటి సోషల్ మీడియా డామినేట్ చేయబోతున్నాయని తేల్చింది. యువతరం మొత్తం సోషల్ మీడియాకే అతుక్కుపోయినట్ట పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు 7.5 కోట్లున్న ఈ సంఖ్య, ఎన్నికల సమయంలో 11 కోట్లు దాటిపోతుందనేది అంచనా. వీరిలో దాదాపు 97 శాతం ఫేస్బుక్ ఖాతాదారులే. సమయం దొరికితే చాలు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, వెబ్‌టీవీ...ఏదో ఒకదానికి కనెక్ట్ అవ్వడం సర్వసాధారణమని వెల్లడించింది. రంగంలోకి పీఆర్ ఏజెన్సీలు .. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచార బాధ్యతలను పీఆర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. గెలుపోటములపై ముందే ఓ అభిప్రాయానికి వచ్చేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. ఓటరు నాడి తెలుసుకుని వారికి ఏం కావాలో వాటినే ఎన్నికల ఎజెండాలో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఏ బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేయాలి. ఏ ఏ అంశాలపై మాట్లాడాలి. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి. తదితర అంశాలపై ముందే ఓ అవగాహనకు వచ్చి కాలనీల వారిగా ఎన్నికల ఎజెండాలను రూపొందించి అభ్యర్థులకు అందిస్తున్నాయి. -
అళగిరి ఆఖరి పోరాటం
ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. వాల్‌పోస్టర్లతో సినిమా బాగోగులు నిర్ణ యం కావు. కానీ అవి మంచి ప్రచారం తెచ్చి పెడతాయి. పోటాపోటీగా ఉండే మాస్ హీరోల విషయంలో ఇది మరింత నిజం. వెండితెర శైలిని ప్రతి అడుగులోను అనుసరిం చే ద్రవిడ పార్టీలకి ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. ద్రవిడ మున్నేట్ర కజగం (డీ ఎంకే)లో తాజాగా మొదలైన వాల్‌పోస్టర్ల వివాదం ఈ సారి ప్రచారం స్థాయిని దాటి, విశ్లేషకులూ ఇతర పార్టీలూ కొత్త అంచనాలకు, ఆశలకు వచ్చేటట్టు చేసింది. డీఎంకే దళపతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పెద్ద కొడుకు ఎంకె అళగిరిని హీరోను చేసే ఉద్దేశంతో వెలిసిన ఈ పోస్టర్ల మీద పార్టీ నాయకత్వమే పిడకలు కొట్టించేసింది. ఈ సీరియస్ కామెడీ చివరికి ఎక్కడికి దారి తీస్తుందోనన్నది పెద్ద ప్రశ్న. దక్షిణ తమిళనాడులోని మధురై నగరంలో జనవరి నాలుగున హఠాత్తుగా ఆ పోస్టర్లు గోడల నిండా వెలిశాయి. భారీ సిని మా పోస్టరుకు ఏమీ తగ్గకుండా రంగులతో, వృద్ధనేత కరుణానిధి, వారసత్వ పోరులో తలమునకలై ఉన్న ఆయన ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్, ఇతర పెద్దల ముఖాలన్నీ ఆ పోస్టర్లో ఉన్నాయి. కానీ అవి ఇచ్చిన సమాచారం అధిష్టానం పాలిట పుండు మీది కారమైంది. ‘జనవరి 30న చెన్నై నగరంలోని కలైంజర్ అరంగంలో డీఎంకే సర్వ సభ్య సమావేశం జరుగుతుంది’ అని ఆ రాతల అర్థం. జనవరి 30 అళగిరి పుట్టినరోజు. దీనికి ‘ఇని ఒరు విధి సీవొమ్’ అని శీర్షిక కూడా పెట్టారు. దీనర్థం, మనం లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. ఇది మహాకవి సుబ్రహ్మణ్య భారతి కవితలలో ఓ పంక్తి. సినిమా పోస్టర్లు వేర్వేరు నిశ్చల చిత్రాలతో దర్శనమిచ్చినట్టు, ఈ పోస్టర్లను రకరకాలుగా ముద్రించారు. అళగిరి వీరాభిమానులు ముగ్గురి పేర్లు కింద కనిపిస్తున్నా యి. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇలాంటి ‘తుంటరి పోస్టర్లు’ ఏమిటని కరుణానిధి ఇచ్చిన ప్రకటన పార్టీ పత్రిక ‘మురసోలి’లో మరునాడే కనిపించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జాతీయ పత్రికలలో, తమిళనాడు పత్రికలలో వస్తున్న వార్తలూ విశ్లేషణలను బట్టి, ఇది పార్టీతో అళగిరి చేస్తున్న ఆఖరి పోరాటం. మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాలను అళగిరి చూస్తుంటారు. చెన్నై కేంద్రంగా స్టాలిన్ మిగిలిన భాగాన్ని అదుపు చేస్తూ ఉంటారు. డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఆవిర్భవించి ఉండవచ్చు. బ్రాహ్మణాధిపత్యం మీద, వైదిక సంప్రదాయాల మీద తిరుగుబాటే ఊపిరిగా మనుగడ సాగిస్తూ ఉం డొచ్చు. కానీ రాజకీయాల దగ్గర మాత్రం మధ్యయుగం పోకడలకు, అది ఎంతో ద్వేషిం చే కాంగ్రెస్‌కు ఏ మాత్రం అతీతం కాదని ఎప్పుడో రుజువు చేసుకుంది. కరుణానిధికి ఇప్పుడు 90 ఏళ్లు. ఆయన వారసత్వం గురిం చి పోరాటం తీవ్రం కావడం అనూహ్యమేమీ కాదు. నిజానికి ఇది ఏడేళ్ల క్రితమే ప్రారంభమైంది. డీఎంకేలో స్టాలిన్ అంత్యంత ప్రజాకర్షణ గల నాయకుడంటూ 2007 సంవత్సరంలో ‘దినకరన్’ పత్రిక ప్రచురించిన కథనం తుపాను సృష్టించింది. మధురైలో ఆ పత్రిక ప్రతులను అళగిరి వర్గీయులు తగులబెట్టారు. పత్రిక కార్యాలయం మీద దాడికి దిగారు. ఈ అల్లర్లను అదుపు చేయడానికి జరిపిన కాల్పులలో ముగ్గురు చనిపోయారు కూడా. అప్పు డు కొడుకులిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కరుణానిధి తన వంతు ప్రయత్నం చేశారు. అవేమీ ఫలితాలను ఇవ్వలేదనే అనిపిస్తుంది. తాజా వాల్‌పోస్టర్ల వివాదం, తరువాత జరిగిన పరిణామాలు ఇదే చెబుతున్నాయి. పోస్టర్లు ముద్రించిన ముగ్గురిని పార్టీ బహిష్కరించింది. వారు తన వర్గం వారు కాదని అళగిరి వెంటనే ప్రకటన చేశారు. ఆ వెంటనే మధురై శాఖను రద్దు చేసి తాత్కాలిక నిర్వాహక కమిటీని స్టాలిన్ ఏర్పాటు చేశారు. దీన్నిండా స్టాలిన్ వర్గీయులే. స్టాలిన్ చర్యను ఖండిస్తూనే, తనను పార్టీలో ఏకాకిని చేసే కుట్ర ఇప్పటిది కాదనీ, అయినా తాను విమర్శలకు దిగడం లేదనీ అళగిరి చెప్పారు. అక్కడితో ఆగక, తాను ఒక్క కరుణానిధి నాయకత్వాన్ని మినహా మరెవ్వరి నాయకత్వాన్ని ఆమోదించే ప్రశ్నే లేదంటూ స్టాలిన్ నాయకత్వానికి అళగిరి నేరుగానే సవాలు విసిరారు. జయలలితతో విభేదాలు పెంచుకున్న దేశీయ మరుపోక్కు ద్రవిడ కజగం (డీఎండీకె)తో రేపటి పార్లమెంట్ ఎన్నికలలో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు సాక్షాత్తు కరుణానిధి చేసిన ప్రకటనను కూడా అళగిరి ఎద్దేవా చేశారు. డీఎండీకే నేత, సినీనటుడు విజయ్‌కాంత్ డీఎండీకే అధినాయకుడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆయనే. డీఎంకే మూడో స్థానంలో ఉంది. అయితే విజయ్‌కాంత్‌ను తాను రాజకీయవేత్తగానే పరిగణించనని అళగిరి ప్రకటించి, తండ్రి ఆగ్రహాన్ని చవి చూశా రు. క్రమశిక్షణ తప్పిన వారు ఎవరినైనా పార్టీ నుంచి పంపే అధికారం తమకు ఉందని వృద్ధనేత మండిపడ్డారు. ఈ పరిణామాలన్నీ జనవరి నాలుగున మొదలై నాలుగు రోజులలోనే వేగంగా జరిగిపోవడం విశేషం. ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. తమిళనాడులో ఒక ఆధారం కోసం పడిగాపులు పడి ఉన్న కాంగ్రెస్ ఇందుకు ఎలాగూ సై అం టుంది. డీఎంకేకు బద్ధశత్రువైన జయకు ఈ ‘మధురై బలాఢ్యుడు’ స్నేహహస్తం చాపే అవ కాశాలు కూడా ఉన్నాయని మరొక వాదన. స్టాలిన్‌ను ఎదుర్కొనడానికీ, ఇప్పటికే రకరకాల కేసులతో జైళ్లలో మగ్గుతున్న తన అనుచరులకు ఊరట కల్పించడానికీ ఇది అళగిరికి ఉపయోగపడుతుందని అంచనా. ఏమైనా మధురై పోస్టర్లు ఒక బాక్సాఫీసు హిట్‌నే దేశం ముందుకు తేబోతున్నాయని అనుకోవచ్చు. - కల్హణ -
మావోయిస్టుల పేరిట ముగ్గురి హత్యకు కుట్ర
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల ప్రాంతంలో ముగ్గురిని హతమార్చి మావోయిస్టు పార్టీని పునర్నిర్మించేందుకు కొందరు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఆయుధాల అన్వేషణలో డమ్మి పిస్టల్‌ను కొనుగోలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. మావోయిస్టుల పేరిట ముందస్తుగానే వాల్‌పోస్టర్లు అంటించి కలకలం సృష్టించిన ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోస్టర్ల వెనుక జరిగిన కుట్రను ఛేదించారు. ముగ్గురి హత్యలతో ఉద్యమం వేములవాడ మండలం మారుపాక వద్ద హత్యకు గురైన సుద్దాలకు చెందిన మాజీ సర్పంచ్ ఏనుగు వేణుగోపాల్‌రావు ఉరఫ్ ప్రభాకర్‌రావు హత్య కేసులో నిందితులుగా ఉన్న మొండయ్య, కుంటయ్య, లక్ష్మణ్‌ను హత్య చేసి మావోయిస్టుల పేరిట ఉద్యమం నడపాలన్న కుట్రను పోలీసులు కనిపెట్టారు. ఆ ముగ్గురిని హత్య చేస్తే రూ.15 లక్షలు సమకూర్చుతానని వేణుగోపాల్‌రావు తనయుడు హామీ ఇచ్చినట్లు పోలీసుల విచారణ తేలింది. భారీ మొత్తంలో డబ్బు రావడంతో ఆయుధాలు కొనుగోలు చేసి మావోయిస్టుల పేరిట విప్లవోద్యమాన్ని నడిపించేందుకు ఐదుగురు యువకులు కుట్ర పన్నారు. గడువులోగా ఆ ముగ్గురిని హతమార్చితే అనుకున్న సొమ్మును అప్పగించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో గడువు దాటిపోయి.. విషయం బయటకు రావడంతో పోలీసులు లోతుగా విశ్లేషించి కుట్ర చేసిన ఐదుగురిని పట్టుకున్నట్లు సమాచారం. డమ్మీ పిస్టల్‌తో వసూళ్లు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన కిషన్, నాగరాజు, మల్కపేటకు చెందిన బోయిని రాజేందర్, శ్రీకాంత్, కొలనూరుకు చెందిన విష్ణులు డమ్మీ పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ పిస్టల్‌ను చూపించి ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. 30 వేలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ డబ్బులతో నిజమైన ఆయుధం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఆయుధాలను సేకరించే మార్గం లభించకపోవడంతో మాజీ నక్సలైట్లను కలిసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మావోయిస్టుల పేరిట హత్యలకు పన్నిన కుట్రలు చేసే వ్యవహారం బయటపడింది. ఇటీవల కోనరావుపేట మండలం ధర్మారంతోపాటు పలు గ్రామాల్లో మావోయిస్టుల పేరిట పోస్టర్లు వేశారు. ముందుగా పోస్టర్లు వేసి భయం కలిగించి హత్యలతో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సదరు యువకులు వ్యూహం పన్నినట్లు తెలిసింది. హత్య కుట్ర కేసును ఛేదించే క్రమంలో మావోయిస్టుల పేరిటపోస్టర్లు వేసిన వ్యవహారం బయటపడింది. లోతుగా విచారిస్తున్న పోలీసులు ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యవహారంలో పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. శాస్త్రీయంగా ఫోన్ సంభాషణలను సేకరించి హత్య వెనుక కుట్రను ఆరా తీస్తున్నారు. కరీంనగర్ ఓఎస్డీ ఎల్.సుబ్బారాయుడు, సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, రూరల్ సీఐ మహేశ్, కోనరావుపేట ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.