![PM Modi Posters On Hyderabad Uppal Elevated Corridor Delay - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/28/Uppal_Flyover_Modi_posters.jpg.webp?itok=npBqAn0T)
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. ఉప్పల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు.
‘‘మోదీ గారు.. ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్ళు? తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’’ అని వెలిసిన పోస్టర్లు దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఉప్పల్ నుండి ఘట్‌కేసర్ వెళ్ళే వరంగల్ హైవే పై కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ఐదేళ్లలో సగం పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో..
ఆ రూట్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పనులు నడుస్తుండడంతో సాయంత్రం వేళ్ల ఉప్పల్, మేడిపల్లి మధ్య ప్రయాణం గంటకు పైనే పడుతోంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లేవారు ఉప్పల్ రింగ్‌రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది. దీంతో వాహనదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోస్టర్ రాజకీయం తెర మీదకు వచ్చింది.
ఉప్పల్ వరంగల్ హైవేపై.. ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌మాల పథకం కింద రూ.626.80 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల దూరంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దాకా ఈ ఫ్లైఓవర్ వేయాలని భావించింది కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. 2018 మేలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. జూలైలో పనులు ప్రారంభం కాగా.. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన.. ఈ 45 మీటర్ల ఆరులేన్ల కారిడార్ పనులు నెమ్మదిగా సాగుతోంది. మరోవైపు ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్ పనులు పూర్తయితేనే రోడ్డు పనులు పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు. దీంతో ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు.
హైదరాబాద్ లో మళ్ళీ పోస్టర్ల కలకలం
— Latha (@LathaReddy704) March 28, 2023
ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ 5 ఏండ్లు అయినా 40% పూర్తి కాలేదు.. ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు మోడీ గారు అంటూ ఫ్లైఓవర్ పిల్లర్లపై వెలసిన పోస్టర్లు.#ModiDisasterForIndia#ModiHataoDeshBachao pic.twitter.com/tAXRBbull3
Comments
Please login to add a commentAdd a comment