‘స్వచ్ఛ’పై నలు‘దిశ’లా ప్రచారం | Pamphlets distribution of swachh bharat | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’పై నలు‘దిశ’లా ప్రచారం

Published Tue, Oct 7 2014 2:10 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

Pamphlets distribution of swachh bharat

మహబూబాబాద్ టౌన్ :   పరిశుభ్రతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిం చారు. దీనిపై ఊరూరా అవగాహన కల్పించడానికి మహబూబాబాద్‌కు చెందిన దిశ సామాజిక సేవా సంస్థ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కరపత్రాలు, స్టిక్కర్లు, పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో సైతం ప్రదర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా దిశ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.గురునాథరావు ‘సాక్షి’తో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ నివేదికల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 69 శాతం మరుగుదొడ్లు లేవని, సుమారు 30 శాతం పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం దేశంలో శిశు మరణాలు శుభ్రత లేకపోవడంతోనే సంభవిస్తున్నట్లు తెలిపిందన్నారు. ఇటీవల జాతీయ క్రైం నివేదిక ప్రకారం మహిళలు, బాలికలపై జరిగే లైంగిక దాడులు చాలా వరకు బహిర్భూమికి వెళ్లిన సందర్భాల్లోనే జరిగాయని తెలపడం చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

 ‘నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు.. మరి ఊరు బాగుంటే మనమంతా బాగుంటాం.. పెద్దలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.. భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది’ అని తెలిపారు. ఇలా గ్రామీణ యువతలో స్వచ్ఛ భారత్‌పై చైతన్యం కలిగించేందుకు దిశ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు సమీపిస్తున్న తరుణంలో సరైన నిర్ణయం తీసుకుని కేంద్రం చిత్తశుద్ధితో స్వచ్ఛ భారత్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. దీనికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement