అసోం పథకంతో అసలుకే మోసం!
2012లో కూడా రెండు నెలల పాటు బీటీఏడీ స్థానిక గిరిజనుల మధ్య ఘర్షణలతో విలవిలలాడింది. ఆ అరవైరోజులలో వందమంది చని పోయారు. దాదాపు లక్షమంది నిరాశ్రయులయ్యారు. ఆ కొండ మీద అల్లర్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇదో నిదర్శనం.
అదే సమస్యతో, అవే వర్గాల మధ్య వైషమ్యంతో అసోం కొండ ప్రాంతం మరోసారి భగ్గుమంది. ఏప్రిల్ ముప్పయ్యో తేదీన లోక్‌సభ ఏడో విడత పోలింగ్ ముగియగానే మే 1న కొక్రాఝర్ ప్రాంతం అల్లర్లతో అట్టుడికినట్టు ఉడికిపోయిం ది. స్థానిక గిరిజనులకూ, బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు చెప్పే ముస్లింలకూ మధ్య మరోసారి హింసాకాండ చెలరేగింది. బంగ్లాదేశ్ నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న తేయాకు కార్మికులంతా బెంగాలీ భాష మాట్లాడేవారే. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952లోనే తొలిసారి ఈ వైషమ్యాలు బయటపడ్డాయి. అంటే బంగ్లాదేశ్ అవతరణకు ముందే, తూర్పు పాకిస్థాన్ కాలంలో రూపు దిద్దుకున్న సమ స్య ఇది. తరువాత నాలుగు పర్యాయాలు స్థానిక గిరిజనులైన బోడోలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి మధ్య పెద్ద ఎత్తున ఇదే సమస్యతో ఘర్షణలు జరిగాయి. తాజా ఘర్షణలో ఇద్దరు చిన్నారులతో సహా ముప్పయ్ మంది చనిపోయారు. ఇంత సుదీర్ఘ కాలం నుంచి ఈ సమస్య నానుతూ ఉన్నదంటే,దీని పరిష్కారానికి ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో పని చేయలేదనే అర్థం. ఉగ్రవాదం చెలరేగి, గిరిజనులు ఏకే 47ను ఆశ్రయించగా, ఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి కూడా ఆయుధాలు సరఫరా చేయాలనీ, అందుకు దరఖాస్తులు తీసుకోవాలంటూ వింత ప్రతిపాదన తెరపైకి రావడం విషాదం. ఇది మరోసారి మైనారిటీలను మభ్య పెట్టడానికే.పరిష్కారాన్ని మరోసారి సుదీర్ఘంగా వాయిదా వేయడానికే.
ఇది జాతుల సమస్య. చాలా చోట్ల ఈ సమస్య తీవ్రమవుతున్నట్టే అసోం కొండలలో కూడా తీవ్రమవుతూనే ఉంది. ఎప్పటిలాగే బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ పరిధి మరోసారి నెత్తురుతో తడిసింది. అజ్ఞాత ఉద్యమ సంస్థ నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సంగ్‌భిజిత్ వర్గం ఈ కాల్పులకు పాల్పడిందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణను ఆ సంస్థ ఖండించడం విశేషం. బోడోలాండ్ టెరిటోరియల్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ (బీటీఏడీ)లో ఒకటైన కొక్రాఝర్‌లో బాలాపారా అనే ఊరు తాజా హింసాకాండకు వేదికైంది. బోడో ఉగ్రవాదులు ఏకే 47 ఆయుధాలతో వచ్చి బంగ్లాదేశీయుల మీద ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నో ఉద్యమాల తరువాత కొక్రాఝర్, బక్సా, షిరాంగ్, ఉదల్‌గురి అనే జిల్లాలను కలిపి బీటీఏడీ పేరిట ఏర్పాటుచేశారు. తాజా అల్లర్లు కొక్రాఝర్‌తో పాటు బక్సాలో కూడా జరిగాయి. తమ భాష, సంస్కృతుల పరిరక్షణకు ఇలాంటి స్వయం ప్రతిపత్తి అవసరమని బోడోలు పోరాడుతున్నారు. 1967లో వచ్చిన ఉద్యాచల్ ఉద్యమం లక్ష్యం అదే. ప్రత్యేక రాష్ట్రం నినాదం కూడా అందులో ఉంది. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నవారు అసోం కొండలలో బోడోల ఆస్తులను ఆక్రమిస్తున్నారని, తమ సంస్కృతికి భంగం వాటిల్లే తీరులో వ్యవహరిస్తున్నారని గిరిజనుల ఆరోపణ.
2012లో కూడా రెండు నెలల పాటు బీటీఏడీ స్థానిక గిరిజనుల మధ్య ఘర్షణలతో విలవిలలాడింది. ఆ అరవైరోజులలో వంద మంది చనిపోయారు. దాదాపు లక్షమంది నిరాశ్రయులయ్యారు. ఆ చిన్న కొండ ప్రాంతంలో అల్లర్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. బో డోలు స్థానిక గిరిజనులు. తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చే గిరిజనులు (ముస్లింలు), బెంగాలీ హిందువులతో కూడా వారు స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎన్నోసార్లు ఘర్షణలకు దిగారు. 2003లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే సమస్య పట్ల భా రత ప్రభుత్వం కొంత శ్రద్ధ తీసుకుని, ఉగ్రవాదులతో చర్చ లు జరిపి, ఆయుధాలు విడిచిపెట్టేలా చేసి కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చింది. నిజానికి సమస్య ఇంత క్లిష్టంగా మారిపోవడానికి కారణం 2001 నుంచి అసోంను ఏలుతున్న తరుణ్ గొగోయ్ ప్రభుత్వమేనని (కాంగ్రెస్) ఆరోపణలు ఉన్నాయి.
బోడోలు ఆయుధాలు విడిచిపెట్టేటట్టు చేయడమే సమస్య పరిష్కారానికి తొలి మెట్టు అని అభిప్రాయాలు వెలువడుతున్న కాలంలో, తరుణ్ గొగోయ్ ప్రభుత్వం ఇంకొక వర్గానికి ఆయుధాలు సరఫరా చేస్తామని చెప్పడం వింతగానే ఉంటుంది. తాజా అల్లర్ల తరువాత, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారి ఆత్మ రక్షణార్థం ప్రభుత్వం లెసైన్సులతో కూడిన తుపాకులు సరఫరా చేయాలని అసోం అటవీ శాఖ మంత్రి రాకీబుల్ హుస్సేన్ కోరారు. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు తరువాత వార్తలు వెలువడ్డాయి. ఇది సాధ్యమైన, సమస్య పరిష్కారానికి ఆచరణ యోగ్యమైన ప్రతిపాదన అని ఎవరూ అనలేరు. అంతకంటె బోడోల వాస్తవ సమస్యను గమనించి రాజ్యాంగం పరిధిలో పరిష్కరించడానికి చర్చలు జరపాలి. బోడోలు ఆయుధాలు విడిచిపెట్టేటట్టు చేయడమే దీనికి సరైన మార్గం. అసోం ప్రభుత్వం ఆలోచన అసలుకే ఎసరు పెడుతుంది.
కల్హణ