ఉషస్సులు వద్దంటున్న ఉత్తర కొరియా
విలీనం కోసం దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తన నాయకత్వంలోనే కార్యకలాపాలను నిర్వహింప చేస్తున్నారు. సైనిక విన్యాసాలతో, నిరంతర వివాదాలతో ఉత్తర కొరియా ఉంటున్నప్పటికీ ఏకీకరణ విషయంలో పార్క్ ప్రయత్నాలు ఆపలేదు.
‘నాసా’ అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం కొరియాల మధ్య వెలు గుల తేడాను చూపుతోంది. మధ్యలో దాదాపు చీకటిగా ఉన్న ప్రాంతం ఉత్తర కొరియా. కాస్త మినుకుమినుకు మంటున్న స్థలమే ఉత్తర కొరియా రాజధాని పైన్గాంగ్. కుడి పక్క దిగువ భాగం దక్షిణ కొరియా. ఆపైన ఎడమ భాగాన ఉన్నది చైనా. ఉత్తర కొరియా విద్యుత్ వినియోగం గంటకు 739 కిలోవాట్లు. దక్షిణ కొరియా వినియోగం గంటకు 10,162 కిలోవాట్లు.
యుద్ధం చరిత్ర మీద మిగిల్చే విషాదానికి అంతు ఉండదు. తరం తరువాత తరం ఆ బాధను అనుభవిస్తూనే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం, దరిమిలా సోవియెట్ రష్యా, అమెరికా మధ్య నెలకొన్న ప్రచ్ఛన్నయుద్ధం ఎన్నో సమాజాలను, దేశాలను ఇలాంటి విషాదంలోకి నెట్టివేశాయి. ఉభయ కొరియాల గాథ అలాంటిదే. 1945లో తొందరపాటుతో జరిగిన కొరియా విభజన ఆధునిక ప్రపంచ చరిత్రకే పెద్ద పాఠం. వెయ్యేళ్లు కలసి జీవిం చి, ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో విడిపోయిన దక్షిణ, ఉత్తర కొరియాలను ఐక్యం చేయడానికి 1990లో ప్రారంభమైన ప్రయత్నం ఇప్పటికి కూడా ఊపందుకోలేదు.
చెదురుమదురుగా ఉన్న సమాజాలను ఒకే దేశం కింద ఐక్యం చేయడానికి ఉద్యమించడం చరిత్రకు కొత్తకాదు. ఇటలీ, జర్మనీ ఏకీకరణలు ఇందుకు గొప్ప తార్కాణం. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిన తరువాత అప్పటిదాకా ఆ దేశం అధీనంలో ఉన్న కొరియా ద్వీపకల్పం అంతర్జాతీయ రాజకీయాలకు వేదిక అయింది. సోవియెట్ రష్యా మద్దతుతో కొరియా ఉత్తర భాగం పైన్గాంగ్ రాజధానిగా డెమాక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దీపీఆర్‌కే)గా అవతరించింది. ఇదే ఉత్తర కొరియా. మిగిలినది సియోల్ కేంద్రంగా దక్షిణ కొరియా పేరుతో, అమెరికా అండగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఆర్‌ఓకే) ఏర్పడింది. ఆగర్భ శత్రువులైనట్టు దాయాదుల మధ్య భీకర యుద్ధం (1950-53)కూడా జరిగింది. కానీ తూర్పు ఐరోపా, సోవియెట్ రష్యా పరిణామాలు ఉభయ కొరియాలను ఏకీకరణ దిశగా ఆలోచించేటట్టు చేశాయి.
తమ రెండు దేశాల ఏకీకరణ వ్యవహారం కోసం 1990లోనే దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. రెండు దేశాల మధ్య విడిపోయిన బంధువుల సమావేశం ఈ ఫిబ్రవరి ఆఖరి వారంలో సియోల్‌లో జరిగింది. ఈ సమావేశాల ముగింపు, ప్రస్తుత కొరియా అధ్యక్షురాలు పార్క్ పదవిని చేపట్టి ఒక సంవత్సరకాలం పూర్తికావడం ఒకేసారి జరిగింది. ఆ సందర్భంగా చానళ్లలో ప్రసంగించిన పార్క్, ఏకీకరణకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని హామీ ఇచ్చారు.
ఏకీకరణ కోసం రూపొందించిన మూడెంచల పథకానికి కొత్తరూపు ఇవ్వవలసిన సమయం కూడా వచ్చిందని ఆ శాఖ ప్రస్తుత మంత్రి రేయూ కిల్ జెయీ అనడం విశేషం. ఇలా బంధువుల కలయికకు అవకాశం కల్పిస్తూ 2010 తరువాత కార్యక్రమం జరగడం మళ్లీ ఇప్పుడే. నిజానికి 1990 ముందు కూడా ఐక్యత కోసం కొంత కృషి జరిగింది. సన్ మ్యూంగ్ మూన్ (1920-2012) అనే పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో ‘యూనిఫికేషన్ చర్చి’ పేరుతో 1954 నుంచి ఒక ప్రయత్నం జరిగింది. ఉత్తర కొరియాకే చెందిన మూన్ నలభయ్ దశకంలో కమ్యూనిస్టులతో కలసి జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడినవాడే. తరువాత ఉత్తర కొరియా ప్రభుత్వం చర్చి పట్ల విద్వేషపూరితమైన వైఖరి అవలంబించడంతో దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చాడు.
దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ ఆసియాలో నాలుగో స్థానంలో ఉంది. ఉత్తర కొరియా కంటె నలభయ్ రెట్లు పెద్దది. అయినా ఆ దేశాన్ని కలుపుకోవాలని ఆశిస్తున్నది. కానీ ఈ ఆశయానికి యువతరం అనుకూలంగా లేకపోవడం గమనించాలి. సమస్యలతో సతమతమవుతున్న దేశాన్ని ఇప్పుడు విలీనం చేసుకోవలసిన అవసరం ఏమొచ్చిందన్నదే ఎక్కువ మంది యువకుల ప్రశ్న. అయితే రెండు దేశాల రాజ్యాంగాలు విలీనాన్ని ఒక ఆశయంగా పొందుపరుచుకున్నాయి. అయినా ఈ ప్రతిపాదనకు ఉత్తర కొరియా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ విలీనం కోసం దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తన నాయకత్వంలోనే నిర్వహింప చేస్తున్నారు. సైనిక విన్యాసాలతో, నిరంతర వివాదాలతో ఉత్తర కొరియా ఉంటున్నప్పటికీ ఏకీకరణ విషయంలో పార్క్ ప్రయత్నాలు మానుకోవడం లేదు. పార్క్ తొలి యేటి పని తీరుపై మంచి మార్కులు వేయడానికి ఆమె ఉత్తర కొరియా విధానం కూడా కారణమని పలువురు పేర్కొన్నారు.
- కల్హణ