పంజాబ్‌లో ఆప్‌కు మరోజన్మ
దేశంలో ఎక్కడా విజయం సాధించలేకపోయిన ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు - ఫరీద్‌కోట్, ఫతేగఢ్ సాహెబ్, పాటియాలా, సంగ్రూర్ గెలుచుకుంది. పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఆప్ సాధించిన పంజాబ్ విజయం మరీ ప్రత్యేకమైనది.
పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క అనుభవం. ఇందులో కోటలు కూలిన పార్టీలు గానీ, కోటలు అనూహ్యంగా బలపడిన పార్టీలు గానీ ఊహించని పరిణామాలే ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నమోదు చేసిన చరిత్ర మాత్రం దేశంలో ఏ ఎన్నికల విశ్లేషకుడు ఊహించినది కాదు. మరే ఇతర ఎన్నికల సర్వే ఊహించినది కూడా కాదు. దేశమంతటా పోటీ చేసిన ‘చీపురు’ పార్టీ కేవలం పంజాబ్‌లోనే నాలుగు సీట్లు గెలిచి తనకు తానే ఆశ్చర్యపోయింది.
నరేంద్ర మోడీ గాలి వీస్తోందని సర్వేలు ప్రారంభమైన సమయంలో, ఒకటి రెండు చోట్లే కావచ్చు, ఆ గాలికి అడ్డుకట్ట వేయగలిగిన పార్టీగా ఆప్ పేరు ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో కమల వికాసాన్ని ఆప్ నిరోధిస్తుందని అంచనాలు వచ్చాయి. హర్యానాలోనూ, ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాగాలలోనూ ఆప్ ప్రభావం గణనీయంగా ఉంటుందని భావించారు. కానీ ఊహించని విధంగా పంజాబ్‌లో ఆప్ ప్రతాపాన్ని చూపించడమే కొన్ని పార్టీలకూ, నేతలకూ మాట లేకుండా చేసింది. ఈ ఎన్నికలలో దేశం మొత్తం మీద 430 లోక్‌సభ స్థానాలకు ఆప్ అభ్యర్థులను నిలిపింది. వారణాసిలో ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన హల్‌చల్‌తో ఈ విషయం దాదాపు మరుగున పడింది. ఆయన పేరు మాత్రమే ఈ ఎన్నికలలో ప్రధానంగా వినిపించింది. కానీ ఆయన దారుణంగా ఓడిపోయారు. పంజాబ్‌లో ఉన్న మొత్తం 13 లోక్‌సభ స్థానాలలోనూ ఆప్ అభ్యర్థులను నిలిపింది. ఆప్ ఈ నిర్ణయం ప్రకటించగానే అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలు ఎద్దేవా చేశాయి. కానీ దేశంలో ఎక్కడా విజయం సాధించలేకపోయిన ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు- ఫరీద్‌కోట్, ఫతేగఢ్ సాహెబ్, పాటియాలా, సంగ్రూర్ గెలుచుకుంది. ఎన్నో విశేషాలను దాచుకున్న పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఆప్ సాధించిన పంజాబ్ విజయం మరీ ప్రత్యేకమైనది.
ఆప్‌ను స్థాపించి 18 మాసాలైంది. పంజాబ్‌లో లోక్‌సభ అభ్యర్థులను నిలపాలని భావించిన నాటికి అక్కడ పార్టీకి శాఖ కూడా లేదు. ఆదరాబాదరా 12 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు ఢిల్లీ నుంచి వెళ్లినవారే. చాలామంది అభ్యర్థులు ఆర్థిక సమస్యతో తగిన ప్రచారం కూడా చేసుకోలేకపోయారు. అయినా 24.4 శాతం ఓట్లు ఆప్‌కు వచ్చాయి. అభ్యర్థులు పెద్దగా ప్రాచుర్యం ఉన్నవారూ కాదు. ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుంచి డాక్టర్ సాధూసింగ్ పోటీ చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాల్, కవి. నిధుల కొరతతో నియోజకవర్గంలోని పది శాతం గ్రామాలలో కూడా ప్రచారం చేయలేకపోయారు. కానీ నాలుగున్నర లక్షల ఓట్లు వచ్చాయి. సంగ్రూర్‌లో వ్యంగ్య రచయిత భగవంత్ మాన్ రెండు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పాటియాలా నుంచి పోటీ చేసిన ధరమ్‌వీర్ గాంధీ హృద్రోగ నిపుణుడు. విదేశ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ ఇక్కడే దారుణంగా ఓడిపోయారు. దీనితో 33 పంజాబ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో (మొత్తం 117) ఆప్ ఆధిక్యంలో ఉన్నట్టయింది. మరో 25 స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది. పట్టణ, నగర ఓటర్ల అభిమాన పార్టీగా పేరు పొందిన ఆప్ పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో ప్రతాపం చూపడం విశేషం. ఈ పల్లె ప్రాంతం కేంద్రంగానే ఇటీవలి వ్యవసాయ సంక్షోభం తలెత్తింది.
ఈ విజయానికి ఆప్ విజేత ధరమ్‌వీర్ చెప్పిన కారణాలు తీవ్రమైనవి. రాష్ట్రంలో వెర్రితలలు వేస్తున్న మత్తుమందుల సంస్కృతి గురించి ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార అకాలీదళ్-బీజేపీ కూటమి పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన విశ్లేషించారు. నిజానికి అకాలీలలో నానాటికీ పెరుగుతున్న అలక్ష్య వైఖరికి ప్రజలు విసిగిపోయారనీ, గుణపాఠం చెప్పడానికి ఓటర్లు ఎదురు చూస్తున్నారనీ దాని ఫలితమే ఈ ఫలితాలనీ ఆయన అభిప్రాయపడుతున్నారు. అకాలీ-బీజేపీ కూటమి అరకొర విజయం, అమృత్‌సర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో బీజేపీ ప్రముఖుడు అరుణ్ జైట్లీ లక్ష ఓట్ల తేడాతో పరాజయం పాలవడం సిక్కులు మోడీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టే అర్థం చేసుకోవాలని కొందరి భాష్యం. పంజాబ్ అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి అకాలీ-బీజేపీ కూటమికే కాక, కాంగ్రెస్‌కు కూడా పోటీ ఇస్తూ రాష్ట్రంలో మూడో శక్తిగా ఆప్ ఎదిగే సూచనలు బలంగానే ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
కల్హణ