నేపాల్కు అన్ని విధాలా చేయూత
• ప్రచండకు మోదీ హామీ
• నేపాల్ పునర్నిర్మాణానికి
• రూ. 5,025 కోట్ల సాయం
న్యూఢిల్లీ: నేపాల్‌లో తాజా రాజకీయ మార్పుల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలని భారత్ కోరింది. ఆ దేశంలో చైనా జోక్యం పెరుగుతున్న వేళ... అన్ని విధాలా సాయం చేస్తామంటూ నేపాల్‌కు హామీనిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్)ల మధ్య శుక్రవారం విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాలు మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్ భూకంపం అనంతరం సాగుతున్న పునర్నిర్మాణ పనులకు రూ.5,025 కోట్ల సాయం చేసేందుకు భారత్ అంగీకరించింది.
రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వర్తకాన్ని పెంచడంతో పాటు, రైలు, రోడ్డు అనుసంధానం మెరుగుపర్చాలని నిర్ణయించారు. నేపాల్‌కు రెండోసారి ప్రధాని అయ్యాక ప్రచండ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ‘చర్చల ద్వారా నేపాల్లో విజయవంతంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. పొరుగు, సన్నిహిత దేశాలుగా నేపాల్లో శాంతి, స్థిరత్వం, ఆర్థిక వికాసం నెలకొనడం ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యం.
నేపాల్ అభివృద్ధి ప్రయాణం, ఆర్థిక పురోగతిలోని ప్రతి అడుగులో కలిసి సాగేందుకు భారత్ హక్కు కలిగి ఉంది’ అని భేటీలో మోదీ పేర్కొన్నారు. నేపాల్‌లో కొనసాగుతున్న హైడ్రోపవర్ పాజెక్టులు వేగంగా, విజయవంతంగా పూర్తవుతాయని హామీనిచ్చారు. ప్రచండ నాయకత్వంలో నేపాల్‌లో విజయవంతంగా రాజ్యాంగం అమలవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్‌తో అభివృద్ధి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధమని ప్రచండకు మోదీ స్పష్టం చేశారు.
రాజ్యాంగ అమలులో అందరి భాగస్వామ్యం
నేపాల్ భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉందని, ఇరు దేశాల గమ్యాలు ఒకదానితో ఒకటి ముడిపడ్డాయని ప్రచండ చెప్పారు. రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో సమాజంలోని ప్రతీ వర్గాన్ని భాగస్వాములు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నేపాల్ కొత్త రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల్ని భారత సంతతికి చెందిన మాధేసి వర్గం వ్యతిరేకిస్తోంది. తమను రాజకీయ ప్రాధాన్యం తగ్గించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయనేది వారి ప్రధాన ఆరోపణ. 4 నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం భారత్ వచ్చిన ప్రచండకు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం లభించింది. దేశ అతిధిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రచండ బస చేస్తున్నారు.
చైనాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం: మొదటి నుంచి నేపాల్‌తో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగుతుండగా... ఇటీవల కఠ్మాండుపై ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోంది. నేపాల్ మాజీ ప్రధాని ఓలి చైనాతో రవాణా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన భారత్ నేపాల్ అభివృద్ధి భాగస్వామ్యం బలోపేతానికి సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది.