మైత్రీ ఒప్పందాన్ని సమీక్షిద్దాం! | PM Narendra Modi in Kathmandu: India wants a powerful Nepal | Sakshi
Sakshi News home page

మైత్రీ ఒప్పందాన్ని సమీక్షిద్దాం!

Published Tue, Aug 5 2014 1:54 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మైత్రీ ఒప్పందాన్ని సమీక్షిద్దాం! - Sakshi

మైత్రీ ఒప్పందాన్ని సమీక్షిద్దాం!

భారత్, నేపాల్ అంగీకారం
నేపాల్ దేశాధినేతలతో మోడీ చర్చలు
రాజ్యాంగ రచనకు సాయం చేస్తామని హామీ    

 
కఠ్మాండు: నేపాల్‌తో సుహృద్భావ సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశంపై వరాల వర్షం కురిపించారు. చరిత్రాత్మక మైత్రీ ఒప్పంద సమీక్ష, విద్యుత్ రంగంలో సహకారం, ముఖ్యమైన రహదారుల నిర్మాణంలో సహకారాన్ని వేగవంతం చేయడం, నూతన రాజ్యాంగ రచనలో తోడ్పాటు, స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 180 నుంచి 250 పెంచడం..  మొదలైనవి అందులో ఉన్నాయి. 1950 నాటి శాంతి-మైత్రీ ఒప్పందాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సమీక్షించి, సవరించడానికి భారత్, నేపాల్‌లు అంగీకరించాయి. అలాగే విద్రోహ శక్తులు సరిహద్దును ఇరు దేశాలకు ముప్పు కలిగించేందుకు వాడుకోకుండా త్వరగా సరిహద్దు వివాదాన్ని ఒకేసారి పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి.  నరేంద్ర మోడీ సోమవారం నేపాల్ దేశాధ్యక్షుడు రామ్‌బరణ్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాలతోపాటు, ఆ దేశ విపక్ష నేతలతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. మైత్రీ ఒప్పందం సవరణకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలని ఇరు దేశాల సంయుక్త కమిషన్(జీసీ) ఇటీవల తమ విదేశాంగ కార్యదర్శులను ఆదేశించడాన్ని మోడీ, సుశీల్‌లు స్వాగతించారు. నేపాల్ తొలుత సూచనలు చేస్తే సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించుకోవచ్చని మోడీ అన్నారు. నేపాల్‌లో సమాఖ్య, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ ఏర్పాటు కోసం కొత్త రాజ్యాంగాన్ని ఏడాదిలోగా రచించాలని, ఇందుకు భారత్ సాయం చేస్తుందని మోడీ నేపాల్ నేతలకు హామీ ఇచ్చారు.

నేపాల్ నేతలతో మోడీ చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఇరు దేశాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. అందులోని వివరాు ప్రకారం.. నేరస్తుల అప్పగింత, పరస్పర న్యాయ సహాయ ఒప్పందాల ముసాయిదాలు త్వరగా ఖరారు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రక్షణ సహకారంపై ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాకు బీహార్‌లోని రాక్సాల్ నుంచి కఠ్మాండు వ రకు పైప్‌లైన్ నిర్మించాలని నేపాల్ కోరగా భారత్ అంగీకరించింది. నేపాల్ నుంచి లక్నోకు నేరుగా విమానాల ప్రయాణానికి మూడు ఎంట్రీ పోస్టులు తెరవాలన్న వినతినీ మన్నించింది. తమ దేశంలో భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, వాణి జ్య నిబంధనలను సడలించానలి నేపాల్ కోరగా, పరిశీలిస్తామని భారత్ పేర్కొంది. విద్యుత్ వాణిజ్య ఒప్పందం ఖరారుకు సాగుతున్న చర్చలను 45 రోజుల్లో ముగించాలని ఇరు దేశాలు తమ ప్రతినిధులను ఆదేశించాయి. పర్యటనను పురస్కరించుకుని మోడీకి నేపాల్ అధ్యక్షుడు రామ్‌బరణ్ విందు ఇచ్చారు. తమ దేశంలో పర్యటించాలని మోడీ .. సుశీల్‌ను కోరగా ఆయన అంగీకరించారు. నేపాల్ పర్యటన ముగించుకుని మోడీ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

ప్రచండతో భేటీ..

మోడీ పర్యటనపై నేపాల్ మావోయిస్టులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మోడీ నేపాల్ మాజీ ప్రధాని, మావోయిస్టు పార్టీ నేత ప్రచండతో సమావేశమై చర్చలు జరిపారు. నేపాల్ శాంతి ప్రక్రియకు మద్దతు, ఆర్థిక ప్రగతిపై మోడీకి స్పష్టత ఉందని, ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రచండ పేర్కొన్నారు. మోడీ నేపాల్ మావోయిస్టు నేత బాబూరామ్ భట్టారాయ్‌తోనూ చర్చలు జరిపారు.1950నాటి మైత్రీ ఒప్పందాన్ని సమీక్షించేందుకు మోడీ అంగీకరించడం, నేపాల్‌కు రాయితీపై రూ. 6వేల కోట్ల రుణం ప్రకటించడంతో.. భారత్‌ను వ్యతిరేకించే నేపాల్ మావోయిస్టులు ఆయనపై పొగడ్తలు కురిపించారు. ‘నేపాల్ రాజ్యాంగ పరిషత్‌లో మీ ప్రసంగం నేపాల్ ప్రజల హృదయాలను హత్తుకుంద’ంటూ ప్రచండ మోడీతో చెప్పారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement