కఠ్మాండు: అధికారాన్ని పంచుకునే విషయంలో రాజీ కుదరకపోవడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండల మధ్య చర్చలు ఆదివారం అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ సోమవారం చర్చలు కొనసాగించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. కీలక పార్టీ స్టాండంగ్ కమిటీ సమావేశానికి ముందే ఒక ఒప్పందానికి రావాలని వారు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కేపీ శర్మ ఓలి దిగిపోవాలని ప్రచండ వర్గం కోరుతోంది. ప్రచండకు సీనియర్ నేతలు మద్దతిస్తున్నారు. మరోవైపు, విపక్ష నేపాలీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో ప్రధాని ఓలి భేటీ అయ్యారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విపక్ష మద్దతును కోరేందుకే ఓలి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఓలి ప్రధానిగా కొనసాగేందుకు అవసరమైతే.. అధికార పార్టీని చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment