Nepal Prime Minister
-
నేపాల్‌తో పటిష్ఠ బంధం
అనుభవాన్ని మించిన ఉపాధ్యాయుడు లేడంటారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆ పదవి చేపట్టాక విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని, బుధవారం నాలుగు రోజుల పర్యటన కోసం రావటం ఈ సంగతినే మరోసారి తెలియజెబుతోంది. ఆయనకు వామపక్ష నేపథ్యం ఉంది. రాచరికాన్ని కూలదోసి ప్రజాతంత్ర రిపబ్లిక్కు పట్టంగట్టిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఆయన నేతృత్వంలోని మావోయిస్టు పార్టీయే. అందువల్లే తొలి దఫా 2008లోనూ, ఆ తర్వాత 2016లోనూ అధికారంలోకొచ్చినప్పుడు ఆయన సహజంగానే చైనా వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి ఆయన ఆలోచనలో మార్పు వచ్చిన దాఖలా కనబడుతోంది. ఎందు కంటే మొన్న మార్చి నెలాఖరున చైనా నిర్వహించిన కీలకమైన బావ్ ఫోరం ఫర్ ఆసియా సమా వేశానికి రారమ్మని ఆ దేశం పిలిచినా, అక్కడి అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉన్నా వెళ్లకుండా ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపారు. నేపాల్ ప్రధాని పీఠాన్ని ఎవరు అధిరోహించినా తొలి విదేశీ పర్యటన కోసం భారత్ రావటం సంప్రదాయంగా వస్తోంది. కొత్త అధినేత రాగానే ఆహ్వానించటం భారత్‌కు కూడా రివాజైంది. కానీ ఈసారి మన దేశం ప్రచండను పిలిచేందుకు ఆర్నెల్ల సమయం తీసుకుంది. ఆయన పర్యటన మూడుసార్లు వాయిదాలు పడి ప్రస్తుత కార్యక్రమం ఖరారైంది. వాస్తవానికి నేపాల్‌లో ప్రచండకు మునుపటంత ఆకర్షణ లేదు. 275 స్థానాలుండే నేపాల్ పార్లమెంటుకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 227 స్థానాలు గెల్చుకున్న ఆయన నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ఇప్పుడు రెండంకెల స్థాయికి పడిపోయింది. ఆమాటకొస్తే నేపాల్‌లో ప్రస్తుతం ఎవరికీ చెప్పుకోదగ్గ బలం లేదు. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు) తర్వాత మూడో స్థానంలో ప్రచండ పార్టీ ఉండగా... ప్రస్తుతం ఎనిమిది పార్టీల కూటమి ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయన వైఖరిలో మార్పు తెచ్చిందనుకోవాలి. భారత్ – నేపాల్ సంబంధాల్లో అడపా దడపా ఒడిదుడుకులు ఎదురవుతున్న సంగతి నిజమే అయినా అవి నిలకడగానే ఉన్నాయి. నేపాల్‌తో మనకు 1,850 కిలోమీటర్ల నిడివి సరిహద్దు ఉంది. ఆ రీత్యా వ్యూహాత్మకంగా మన దేశానికి నేపాల్ అత్యంత ముఖ్యమైన దేశం. సముద్ర తీరం లేకపోవటం వల్ల సరుకు రవాణా, సర్వీసుల రంగాల్లో దాదాపుగా అది మన దేశంపైనే ఆధార పడుతుంది. నేపాల్ దిగుమతులన్నీ మన రేవుల ద్వారానే సాగుతాయి. ఇంధన రంగంలోనూ ఈ సహకారం కొనసాగుతోంది. ఆ దేశంలో భారత్ పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది. మన దేశానికి నేపాల్ 450 మెగావాట్ల విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో మన సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అలాగే నేపాల్‌లో రైల్వే ప్రాజెక్టులకు భారత్ సాయం అందిస్తోంది. గురువారం ఇరుదేశాల ప్రధానులూ ఆన్లైన్లో రెండు చెక్‌పోస్టు లనూ, బిహార్ నుంచి సరుకు రవాణా రైలును ప్రారంభించారు. ఇవిగాక రెండు దేశాల ప్రధానుల సమక్షంలో ఏడు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. నేపాల్‌ను ఎప్పటికప్పుడు మంచి చేసుకునేందుకు చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో కొన్నిసార్లు సఫలీకృతమైంది కూడా. ఒక్క ప్రచండ అనేమిటి... భారత్ అనుకూలుడిగా ముద్రపడిన ఓలి శర్మ సైతం చైనా వ్యామోహంలో పడి మన దేశంపై నిప్పులు చెరిగిన సందర్భాలున్నాయి. కనుకనే చైనా పెట్టుబడుల శాతం గణనీయంగా పెరిగింది. కేంద్రంలో ఎవరు అధికారంలోవున్నా నేపాల్‌పై మన దేశం పెద్దన్న పాత్ర పోషించా లనుకోవటం అప్పుడప్పుడు సమస్యలకు కారణమవుతున్న సంగతి కాదనలేనిది. ఉదాహరణకు 2016లో రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసే దశలో నేపాల్‌లోని తెరై ప్రాంతంలో ఉన్న మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతులు ఉద్యమించాయి. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవా లని, వారితో చర్చించి రాజ్యాంగంలో తగిన మార్పులు చేయాలని మన దేశం సూచించింది. కానీ దీన్ని నేపాల్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెరై ప్రాంతంలో భారీయెత్తున ఉద్యమాలు సాగాయి. దాంతో మన దేశంనుంచి వంటగ్యాస్ రవాణా నెలల తరబడి నిలిచిపోయింది. ఉద్యమాల వెనక భారత్ ప్రమేయం ఉన్నదనీ, తమను లొంగదీసుకునేందుకే ఇవన్నీ చేస్తున్నారనీ నేపాల్ ఆరోపించింది. ఈ పరిస్థితిని అప్పట్లో చైనా చక్కగా వినియోగించుకుంది. వాస్తవానికి ఇప్పుడు సరిహద్దుల విషయంలో ప్రచండపై ఒత్తిళ్లు ఎక్కువే ఉన్నాయి. ఉత్తరా ఖండ్‌లోని లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ చాన్నాళ్లుగా వాదిస్తోంది. వాటిని తమ దేశంలో భాగంగా చూపుతూ మూడేళ్ల క్రితం మ్యాప్‌లు కూడా ముద్రించింది. వాటికి సంబంధించిన బిల్లుల్ని కూడా అక్కడి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అనంతర కాలంలో ఈ వివాదం సద్దుమణిగింది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారం కుదిరింది. దీన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మోదీకి ప్రచండ సూచించారు. ఇరుగుపొరుగు అన్నాక సమస్యలు సహజం. వాటిని ఒడుపుగా పరిష్కరించుకోవటంలోనే ఆ దేశాల పరిణతి కనబడుతుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలనూ ‘సూపర్ హిట్’ చేస్తామనీ, వాటిని హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్తామనీ ప్రచండకు నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ఇదొక మంచి పరిణామం. తదుపరి కార్యాచరణ ఆ దిశగా చురుగ్గా కదిలితే శతాబ్దాలనాటి ఇరు దేశాల సంబంధాలూ మరింత ఉన్నత స్థాయికి చేరతాయనడంలో అతిశయోక్తి లేదు. -
నేపాళంలో కొత్త భూపాలం?
పెళ్ళిలో నాగవల్లి నాటి మాట సదస్యానికి ఉంటుందా?! నేపాల్‌కు కొత్త ప్రధానిగా కొలువు తీరిన పుష్పకమల్ దహల్ (ప్రచండ)ను చూస్తే ఆ జాతీయమే గుర్తొస్తుంది. ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకు తిరిగిన 5 పార్టీల కూటమిని ఫలితాలొచ్చాక గాలికి వదిలేసి, అప్పటి దాకా తాను విమర్శించిన వారితో కలసి ఆయన అధికారంలోకి రావడం అలానే ఉంది. ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ –మావో యిస్ట్ సెంటర్’ (సీపీఎన్–ఎంసీ) నేత ప్రచండ ఈ ఎన్నికల ముందు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌తో తిరిగారు. తీరా అధికారం కోసం తన బద్ధశత్రువైన మరో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీతో చేతులు కలిపారు. ఓలీ సారథ్య ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్– ఐక్య మార్క్సిస్ట్– లెనినిస్ట్’ (సీపీఎన్– యూఎంఎల్)తో పాటు పలు చిన్నాచితకా పార్టీలతో కలసి అధికారం పంచుకుంటున్నారు. ఏ ప్రభుత్వమూ పూర్తికాలం అధికారంలో ఉండదన్న అపకీర్తిని మూటగట్టుకున్న నేపాల్‌లో ఈ అవసరార్థ అధికార కూటమి ఎన్నాళ్ళుంటుందో తెలీదు కానీ చైనా అనుకూల ప్రచండ, దేవ్బా ద్వయం వల్ల భారత్ అప్రమత్తం కాక తప్పని పరిస్థితి. 68 ఏళ్ళ ప్రచండ 13 ఏళ్ళు అజ్ఞాత జీవితం గడిపారు. 1996 నుంచి 2006 వరకు సాగిన సాయుధ తిరుగుబాటుకు ప్రచండే సారథి. 2006 నవంబర్‌లో సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకంతో ఆ తిరుగుబాటు కథకు తెరపడింది. దశాబ్ద కాలపు తిరుగుబాటుకు స్వస్తి చెప్పి, సీపీఎన్ – ఎంసీ ప్రశాంత రాజకీయాల పంథాను అనుసరించడం మొదలుపెట్టాక ఆయనా ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ విప్లవ వీరుడు ప్రధాని పీఠం అధిష్ఠించడం ఇది ముచ్చటగా మూడో సారి. దేవ్బా సారథ్య నేపాలీ కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించింది గనక అదే పగ్గాలు పడుతుందనీ, దేవ్బా, ప్రచండలు పదవిని పంచుకుంటారనీ అంతా అనుకున్నారు. కానీ, ప్రధానిగా తొలి విడత ప్రచండకు ఇవ్వడానికి దేవ్బా తటపటాయించడంతో తేడా వచ్చింది. అదే అదనుగా ఓలీ చాణక్యతంత్రంతో ప్రచండను తన వైపు తిప్పుకోవడం రాజకీయ చాతుర్యం. నిజానికి, 275 స్థానాల ప్రజాప్రతినిధుల సభలో ప్రచండ నాయకత్వంలోని సీపీఎన్–ఎంసీ ఈ ఎన్నికల్లో గెలిచింది 32 సీట్లే. అయితే, ఓలీ సారథ్యంలోని సీపీఎన్–యూఎంఎల్ (78) కాక మరో అయిదు పార్టీలు మద్దతు నిచ్చాయి. అలా ప్రచండకు 165 మంది సభ్యుల అండ దొరికింది. బద్ధ శత్రువులుగా ఎన్నికల్లో పోరాడిన ప్రచండ, ఓలీలు ఫలితాలొచ్చాక ఇలా కలసిపోతారనీ, వంతుల వారీగా ప్రధాని పీఠం పంచుకొనేలా అవగాహన కుదుర్చుకుంటారనీ ఎవరూ ఊహించలేదు. ఇది ఓటర్లకూ మింగుడుపడని విషయం. ఇవన్నీ నేపాల్ అంతర్గత రాజకీయాలు. అక్కడ ఏ పార్టీలో, ఎవరు ప్రధాని కావాలనేది అక్కడి పార్టీల, ప్రజల ఇష్టం. ఆ ప్రధానులూ, ప్రభుత్వాలూ పూర్తికాలం అధికారంలో లేకుంటే అది ఆ దేశానికి నష్టం. కాకపోతే, రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి మారిన ఈ హిమాలయ పొరుగుదేశపు బాగోగులు, దోస్తీ భౌగోళిక–రాజకీయాల్లో భారత్‌కు కీలకం. అధికారమే లక్ష్యంగా 2 కమ్యూనిస్ట్‌పార్టీ గ్రూపుల నేతలూ దగ్గరవడానికి చైనాతో సాన్నిహి త్యంతో పాటు ఓలీ అంటే సానుకూలత ఉన్న నేపాల్ ప్రెసిడెంట్ విద్యాదేవి కూడా కారణమం టారు. ఏమైనా దీంతో నేపాల్‌తో బంధాల్లో చైనాదే పైచేయనే అభిప్రాయం సహజమే. కొత్త ప్రధాని ప్రచండ ఏనాడూ భారత్‌కు సానుకూల వ్యక్తి కాదు. పైపెచ్చు ఆయన మనసంతా చైనా మీదే. కాక పోతే, క్రితంసారి ఆయన పదవిలో ఉన్నప్పుడు భారత్ పట్ల సదా సానుకూలత చూపే నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నారు. కాబట్టి కథ నడిచిపోయింది. కానీ, ఈసారి చైనా వైపు మొగ్గే ఓలీతో కలసి అధికారం పంచుకుంటున్నారు గనక రానున్న రోజులు భారత్‌కు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. అలా చూస్తే ప్రపంచంలో ఒకప్పటి ఏకైక హిందూరాజ్యాన్ని అక్కున చేర్చుకోలేకపోవడం ఇక్కడ హిందూ ఆధిక్యవాదాన్ని పరోక్షంగా ప్రవచిస్తున్న పాలకుల దౌత్య వైఫల్యమని కొందరి విమర్శ. అయితే, పదవి చేపట్టిన ప్రచండను ముందుగా మోదీనే అభినందించడం విశేషం. గతంలో ఓలీ అధికారంలో ఉండగా మోదీ రెండుసార్లు నేపాల్కెళితే, ఆయన రెండుసార్లు భారత్‌కు వచ్చారు. కింగ్‌మేకర్ ఓలీ నేతృత్వ పార్టీ కూడా తాము భారత్ కన్నా చైనాతో బంధానికే మొగ్గుతామనే భావనను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. భారత, చైనాల పట్ల నేపాల్ వైఖరిలో పెద్ద మార్పేమీ ఉండదనీ, భారత్‌తో ‘సంతులిత, విశ్వసనీయ’ సంబంధాలు నెరుపుతామనీ అంటోంది. కానీ, ఓలీ గద్దెపై ఉన్నప్పుడే వివాదాస్పద ప్రాంతాలను నేపాల్‌లో భాగంగా చూపుతూ కొత్త రాజకీయ పటాన్ని జారీ చేయడం, చకచకా పార్లమెంట్ ఆమోదముద్ర వేయడం అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆరేళ్ళు పనిచేసి, అర్ధంతరంగా చైనా వదిలేసిన రెండు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లను ఈ ఏడాదే భారత్ చేపట్టింది. మునుపటి దేవుబా సర్కార్ వాటిని భారత్‌కు కట్టబెట్టింది. అప్పట్లో ఓలీ దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఓలీ భాగస్వామిగా కొత్త ప్రభుత్వం వచ్చేసరికి, వాటి భవిత ప్రశ్నార్థకమే. పైగా, కొత్త సర్కార్ రాగానే చైనా రకరకాల ప్రాజెక్ట్‌లతో నేపాల్‌లో కాలూనేందుకు ఉరకలేస్తోంది. నేపాల్ – చైనా సరిహద్దు రైల్వేలైన్ అధ్యయనానికి నిపుణుల బృందాన్ని మంగళవారమే పంపింది. ఈ పరిస్థితుల్లో భారత్ చొరవ చూపాలి. ప్రాజెక్ట్‌లే కాక విద్య, వైద్యం, పర్యావరణం లాంటి అనేక అంశాల్లోనూ ప్రజాస్వామ్య గణతంత్ర భారత్‌తో సన్నిహిత భాగస్వామ్యమే నేపాల్‌కు దీర్ఘకాలంలో లాభమని నచ్చజెప్పగలగాలి. ఒక్క నేపాల్‌కే కాదు... వ్యూహాత్మకంగా మనకూ అది ముఖ్యం! -
నేపాల్‌లో నాటకీయ పరిణామాలు.. ప్రధానిగా ‘ప్రచండ’ నియామకం
కాఠ్మాండు: నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ ప్రధానిగా నియామకమయ్యారు. అధికార పంపకాలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదుర్ దేవ్బాతో జరిగిన చర్చలు విఫలమైన క్రమంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో జతకట్టారు ప్రచండ. ఓలితో పాటు విపక్షంలోని చిన్న చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు ప్రకటించాయి. దీంతో తనకు 165 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారిని కలిశారు. అధికారం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం నేపాల్ తదుపరి ప్రధానిగా ప్రచండను నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఆదివారం సాయంత్రం 5 గంటల్లోనే చట్టసభ్యులు మెజారిటీని కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్ కోరారు. గడువు ముగిసే సమయానికి కొద్ది గంటల ముందు ప్రచండ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో ఆయనను నియమిస్తూ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రచండతో పాటు సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) ప్రెసిడెంట్ రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్ రాజేంద్ర లింగ్దే సహా ఇతర నేతలు హాజరయ్యారు. ప్రచండకు మొత్తం 275 సభ్యుల్లో 165 మంది చట్టసభ్యుల మద్దతు లభించింది. అందులో సీపీఎన్-యూఎంఎల్ 78, సీపీఎన్-ఎంసీ 32, ఆర్ఎస్పీ 20, ఆర్పీపీ 14, జేఎస్పీ 12, జనమాత్ 6, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ 3 సభ్యులు ఉన్నారు. నేపాల్ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రచండ. రొటేషన్ పద్ధతిపై ఒప్పందం.. నేపాల్ ప్రధాని పదవీ కాలం ఐదేళ్లు. పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలని ఎన్నికలకు ముందు షేర్ బహదుర్ దేవ్బా, పుష్ప కమల్ దహాల్ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి రెండున్నరేళ్లు తనకు పదవి ఇవ్వాలని ప్రచండ కోరగా.. అందుకు దేవ్బా నిరాకరించటంతో సంక్షోభం తలెత్తింది. విపక్ష కూటమితో చేతులు కలిపారు ప్రచండ, సహచర కమ్యూనిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలిని కలిశారు. రొటేషన్ పద్ధతిన ప్రధాని పదవిని పంచుకునేందుకు ఓలి అంగీకరించటంతో ప్రభుత్వ ఏర్పాటు, ప్రచండ ప్రధాని పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
దేవ్‌బాను ప్రధానిగా నియమించండి
ఖాట్మాండూ: నేపాల్ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానిగా నియమించా లంటూ నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సూచించింది. చీఫ్ జస్టిస్ చోళేంద్ర షంషేర్ రాణా ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును సోమవారం వెలువరిం చింది. మంగళవారంలోగా దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై 18 సాయంత్రం 5 గంటలకు సభ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (5) ప్రకారం ప్రధానిని ఎన్నుకొనే ఓటింగ్‌లో పార్టీ విప్ ఏ మాత్రం పని చేయబోదని సీజే జస్టిస్‌రాణా తెలిపారు. రాజ్యాంగ విరుద్ధం నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ప్రతిపాదన మేరకు పార్లమెంట్‌దిగువ సభను అధ్యక్షురాలు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న ఓలీ నిర్ణయం దీంతో బెడిసికొట్టింది. నవంబర్ 12, 19లో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దేవ్‌బాకు మద్దతు దిగువ సభను రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో మొత్తం 30 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో 146 మంది ప్రతిపక్ష పార్టీ నేతలు కలసి వేసిన పిటిషన్ కూడా ఉంది. మెజారిటీకి అవసరమైన మద్దతు తమ సంకీర్ణ కూటమిలో ఉన్నందున అవకాశం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కూటమిలో సభ్యుడైన నేపాల్ కమ్యూనిస్ట్‌పార్టీ–యూఎంఎల్ నేత మాధవ్ కుమార్ మాట్లాడుతూ.. చేయాల్సి ందంతా సుప్రీంకోర్టు చేయడంతో ఇక తామేమీ మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దేవ్బా గతంలో నాలుగు సార్లు ప్రధానిగా పని చేశారు. 1995–97, 2001–02, 2004–05, 2017–18 మధ్య ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా తీర్పుతో అయిదోసారి ప్రధాని కానున్నారు. మరోవైపు ఓలీ మద్దతుదా రులు సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటిని మేము పాటించాల్సిన అవసరం లేదు అని నినాదాలున్న కార్డులను పట్టుకొని వీధుల్లో నిరసనలు తెలిపారు. ఓలీ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోవడంతో గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. -
నేపాల్: తదుపరి ప్రధాని షేర్ బహదూర్ దుబా?
ఖాట్మండూ: ఓలి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతోంది. దీనికోసం మంగళవారం నేపాలీ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు భేటీ అయ్యారు. గురువారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని దేశాధ్యక్షుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్సీ అధ్యక్షుడు షేర్‌బహదూర్ దుబాను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పుష్ప కమల్ ప్రంచండ నేతృత్వంలోని సీపీఎన్ మావోయిస్టు సెంటర్ మద్దతు తెలపగా, సమాజ్‌వాదీ పార్టీలో ఓ వర్గం వ్యతిరేకించింది. గతంలో ప్రధానిగా చేయని కొత్త వ్యక్తిని ప్రధానిగా చేయాలని ఆ వర్గం పట్టుబడుతోంది. ఈ మూడు పార్టీల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సందిగ్దత కొనసాగుతోంది. ఒకవేళ ఈ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే నేపాల్ రాజ్యాంగం ప్రకారం.. అతిపెద్ద పార్టీకి చెందిన నాయకున్ని మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆయన 30 రోజుల్లోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి. అదే జరిగితే ఓలి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. (చదవండి: KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి) (చదవండి: సీఎం అవుతానని 30 ఏళ్ల క్రితమే చెప్పాడు : సీఎం భార్య) -
KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి
ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రతినిధుల సభ విశ్వాసాన్ని కోల్పోయారు. పుష్పకమాల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన మెజారిటీ కోల్పోయారు. నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 మంది సభ్యులు ఉండగా సోమవారం విశ్వాసపరీక్ష కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 232 మంది హాజరయ్యారు. వారిలో 93 ఓట్లు ప్రధాని ఓలికి మద్దతుగా రాగా, 124 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మరో 15 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారని స్పీకర్ అగ్ని సప్కోట తెలిపారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మొత్తం 136 ఓట్లు కావాల్సి ఉండగా, ఆ మార్కును ఓలి అందుకోలేకపోయారు. మెజారిటీ సాధించలేకపోయిన ఓలి నేపాల్ రాజ్యాంగంలోని 100 (3) ప్రకరణ ప్రకారం ఆటోమేటిగ్గా పదవిని కోల్పోతారు. ఇదిలా ఉండగా నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబ, సీపీఎన్ చైర్మన్ ప్రచండ, జనతా సమాజ్‌వాదీ పార్టీ చైర్మన్ ఉపేంద్ర యాదవ్‌లు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాలని దేశ అధ్యక్షుడు భండారిని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. -
నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి
సాక్షి, విశాఖపట్నం : శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు. రాముడు భారతదేశంలో జన్మించాడనేందుకు ఎన్నో చారిత్రక సాక్ష్యాలున్నాయని వాటిని వక్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. చైనా ప్రధాని కుట్రలకు అనుగుణంగా నేపాల్ ప్రధాని నడుచుకోవడం దారుణమని, ఇకనైనా నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. శ్రీరాముని జన్మస్థలం గురించి తెలిసీ తెలియని మాటలు సరికాదని పేర్కొన్నారు.భారత్‌లో జన్మించిన రాముడు ఎంతోమందికి ఆరాధ్య దైవమన్న స్వరూపానందేంద్ర.. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడని కొనియాడారు. రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ నేపాల్ ప్రధాని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. . -
నేపాల్ ప్రధానికి మతి భ్రమించింది : అభిషేక్ సింగ్వి
ఢిల్లీ : రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ ప్రకటించిన నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం ఓలి కి మతి భ్రమించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింగ్వి ఫైర్ అయ్యారు. చైనా ప్రధాని ఆదేశాల మేరకే ఓలీ ఇలాంటి నీతిమాలిన ఆరోణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పడు రాముడు నేపాలీ దేశస్తుడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది! ) సోమవారం ఓ మీడియాతో ఓలీ మాట్లాడుతూ.. సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి కమ్యూనికేషన్ లేని కాలంలో సీతను వివాహం చేసుకోవడానికి రాముడు జనక్‌పూర్‌కు ఎలా వచ్చాడంటూ ప్రశ్నించారు. ప్రస్తుత భారతదేశంలోని ఆయోధ్య నుంచి రాముడు జనక్‌పూర్‌కు రావడం అసాధ్యమంటూ పేర్కొన్నాడు. అయితే నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. #Oli #NepalPM seems 2hv lost his mental balance or is puppet &parrot like mouthing lines scripted by desperate #Chinese. 1st he claimed territories never earlier claimed by #Nepal. Now he relocates #Ram #Sita #Ayodhya & #RamRajya a few hundred miles from Ayodhya inside Nepal! — Abhishek Singhvi (@DrAMSinghvi) July 14, 2020 -
శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది!
కఠ్మాండు: భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వివాదం రేపిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అసలైన అయోధ్య నేపాల్‌లో ఉంది. శ్రీరాముడు నేపాల్ దేశస్తుడు’ అని ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేశారు. ప్రధాని ఓలి తాజా వ్యాఖ్యలపై అధికార పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని ప్రచండ స్పందించారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా గానీ, దౌత్యపరంగా గానీ సరికావన్నారు. -
నేపాల్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
కఠ్మాండు: అధికారాన్ని పంచుకునే విషయంలో రాజీ కుదరకపోవడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండల మధ్య చర్చలు ఆదివారం అసంపూర్తిగా ముగిశాయి. మళ్లీ సోమవారం చర్చలు కొనసాగించాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. కీలక పార్టీ స్టాండంగ్ కమిటీ సమావేశానికి ముందే ఒక ఒప్పందానికి రావాలని వారు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కేపీ శర్మ ఓలి దిగిపోవాలని ప్రచండ వర్గం కోరుతోంది. ప్రచండకు సీనియర్ నేతలు మద్దతిస్తున్నారు. మరోవైపు, విపక్ష నేపాలీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో ప్రధాని ఓలి భేటీ అయ్యారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విపక్ష మద్దతును కోరేందుకే ఓలి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఓలి ప్రధానిగా కొనసాగేందుకు అవసరమైతే.. అధికార పార్టీని చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి. -
భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్ ప్రధానికి షాక్
ఖాట్మాండు: భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నేపాల్‌లోని అధికార పక్షమైన కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. పార్టీ చైర్మన్ పుష్ప కమల్ దహల్ కూడా ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడం నేపాల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వామ్యలు అయ్యారని ఆదివారం ప్రధాని ఓలీ ఆరోపించారు. (నన్ను గద్దె దింపేందుకు కుట్ర: నేపాల్ ప్రధాని) నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. దీనికి అధికార పార్టీ సభ్యులతో పాటు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను పదవి నుంచి తప్పించడానికి భారత్ కుట్రలు పన్నుతోందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనవి కావన్నారు. అనవసరంగా చిరకాల మిత్ర దేశమైన భారత్‌తో విరోధం ప్రధాని వైఫల్యమే అని అసహనం వ్యక్తం చేశారు. అలాగే సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయడం తగదన్నారు. ప్రధాని వ్యాఖ్యలు పొరుగు దేశాలతో నేపాల్ సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించారు. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్) పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి ముఖ్యనేతలు కూడా ప్రధాని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకత్వం అందించడంలో ప్రధాని ఓలీ విఫలమయ్యారని.. పార్టీ పగ్గాలను కూడా సరైన నేతలకు అప్పగించాలని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మొత్తం 18 మంది నాయకులు హాజరవగా 17 మంది రాజీనామాకు పట్టుబట్టినట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో ప్రధాని ఏ విధంగానూ స్పందించకపోవడం గమనార్హం. -
పాత బాణీ విడనాడాలి
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌లో మూడురోజులు పర్యటించి వెళ్లారు. నాలుగేళ్లుగా ఇరు దేశాల సంబంధాలు ఒడిదుడుకుల్లో ఉన్న నేపథ్యంలో మాత్రమే కాదు... తన తొలి విదేశీ పర్యటనకు ఓలి మన దేశాన్ని ఎంచుకోవడంవల్ల కూడా దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో వ్యవసాయరంగంలో భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్యా ఉన్న రైల్వే లైన్లను విస్తరించుకోవడం, జలమార్గాలను ఏర్పాటు చేసుకోవడం, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం, వాణి జ్యాన్ని పెంపొందించుకోవడం వగైరా అంశాల్లో అవగాహన కుదిరింది. ఒకప్పుడు నేపాల్ మనకు అత్యంత సన్నిహిత దేశం. తన అవసరాలన్నిటికీ మనపైనే ఆధా రపడే దేశం. మన కనుసన్నల్లో నడిచే దేశం. ఆ దేశ రాజకీయాలను శాసించగలిగే స్థితిలో భారత్ ఉండేది. కానీ అక్కడ రాచరిక పాలన అంతమయ్యాక వరసబెట్టి జరుగుతున్న పరిణామాలు మనకు ఇబ్బందికరంగానే పరిణమిస్తూ వచ్చాయి. దాంతో సంబంధం లేకుండానే మన దేశం నేపాల్‌ను నిర్లక్ష్యం చేయడం అంత క్రితమే మొదలైంది. 1997లో అప్పటి ప్రధాని ఇందర్‌కుమార్ గుజ్రాల్ తర్వాత 2014లో నరేంద్ర మోదీ వచ్చేవరకూ మన ప్రధాని ఎవరూ ఆ దేశం పర్యటించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతకన్నా ఆశ్చర్యకరమేమంటే... ఇండో-నేపాల్ జాయింట్ కమిషన్ 1987లో ఏర్పాటైనప్పుడు రెండేళ్లకోసారి ఆ కమిషన్ సమావేశం కావాలని నిర్ణయించగా 2014 వరకూ ఏ ప్రభుత్వమూ ఆ ఊసెత్తలేదు. ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోవడమే రివా జైంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఈ సంబంధాలు 2015లో మరింత దిగ జారాయి. అప్పట్లో తెరై ప్రాంతంలోని తారూ, మాధేసి వంటి మైనారిటీ జాతులు రాజ్యాంగంలో తమ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్న ఆగ్రహంతో రహ దార్లను దిగ్బంధించాయి. దాంతో మన దేశం నుంచి అక్కడకు వెళ్లాల్సిన వంట గ్యాస్, నిత్యావసరాలు రోజుల తరబడి నిలిచిపోయాయి. అంతక్రితమే వచ్చిన భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్ ఈ దిగ్బంధంతో ఊపిరాడని స్థితికి చేరుకుంది. మాధేసీలకు మద్దతిస్తున్న మన దేశం ఈ దిగ్బంధనానికి పరోక్షంగా సహకరించిందని, కష్టకాలంలో తమను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిందని నేపాలీ పౌరుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఆ సమయంలో నేపాల్ రిపబ్లిక్ తొలి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విద్యాదేవి భండారీ చైనాతో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నారు. మాధేసీల హక్కుల పరిరక్షణకు సంబం« దించిన సమస్యతోపాటు... తాము వద్దని అనధికారికంగా చెప్పినా రాజ్యాంగంలో నేపాల్‌ను లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా పేర్కొనడంపై కూడా మన దేశానికి అభ్యంతరం ఉందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే నేపాల్ ఆంతరంగిక అంశాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలున్నా అవి అత్యవసర సరఫరాలు నిలిచిపోయే స్థితికి వెళ్లకుండా చూసి ఉంటే అది మన ప్రయోజనాలకే తోడ్పడేది. భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తన అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నదని అక్కడి పౌరుల్లో అభిప్రాయం ఏర్పడటం మంచిది కాదని గుర్తిస్తే బాగుండేది. నేపాల్ జనాభా 2.9 కోట్లు. భౌగోళికంగా కూడా చిన్న దేశం. కానీ ఆ దేశంతో మనకు 1,850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దుల్లో అరడజను ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యా పేచీలున్నాయి. కాలా పానీ నదీ జలాల వివాదం ఉంది. ఇరు దేశాల మధ్యా రాకపోకలకు వీసా నిబంధన లేకపోవడం వల్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం బెడద సమస్యలు ఏర్పడుతున్నాయి. సరిహద్దు భద్రతలో రెండు దేశాలమధ్యా సహకారం చాలా అవసరం. సఖ్యత ముఖ్యం. అయితే నేపాల్‌లో జరిగిన పరిణామాలన్నీ మన ప్రభుత్వానికి అసంతృప్తి కలిగి స్తూనే వచ్చాయి. మూడు నెలలక్రితం అక్కడ జరిగిన ఎన్నికల్లో ఓలి నాయ కత్వంలోని వామపక్ష సీపీఎన్(యుఎంఎల్)–సీపీఎన్(మావోయిస్టు) కూటమి ఘన విజయం సాధించింది. ఓలి, ఆయన నాయకత్వంలోని సీపీఎన్(యూఎంఎల్) చైనాతో సఖ్యంగా ఉండాలని ఆదినుంచీ వాదించేవారు. 2015నాటి దిగ్బంధం సమయంలో కూడా యూఎంఎల్ భారత వ్యతిరేక వైఖరి తీసుకుంది. అందువల్లే ఓలి రాకతో భారత్–నేపాల్ సంబంధాలు దెబ్బతినొచ్చునన్న ఊహాగానాలు వెలు వడ్డాయి. దీనికితోడు గత నెలలో ఓలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాకిస్తాన్ ప్రధాని అబ్బాసీ నేపాల్ పర్యటించారు. భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో ఈ పర్యటన మంచి సంకే తాలు పంపదని అక్కడి మీడియా ఓలిని హెచ్చరించింది. లోగడ ఆయన ప్రధానిగా పనిచేసినప్పుడు చైనాతో బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓలిపై భారత వ్యతిరేకి అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆయన గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్నే ఎంచుకున్నారు. అంతేగాక భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకుపోవాలన్న కృత నిశ్చయంతో ఈ పర్యటన జరుపుతున్నానని చెప్పారు. కనుక గతాన్ని మరిచి నేపాల్‌తో పటిష్టమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి మన దేశం కూడా గట్టిగా ప్రయత్నించాలి. మూడు నెలలనాటి ఎన్నికల తర్వాత అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. నేపాల్ ఆంతరంగిక పరిస్థితులు బాగా మారాయని గుర్తించడంతో పాటు మన నిర్లక్ష్యం పర్యవసానంగా ఇప్పటికే అక్కడ చైనా ప్రభావం పెరిగిందన్న సంగతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నేపాల్ ఆర్థికాభివృద్ధికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన ఈ తరుణంలో మన నుంచి అందే సహకారం చైనాతో పోలిస్తే మెరుగ్గా ఉన్నదన్న అభిప్రాయం కలిగించగలగాలి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికీ మించి నేపాల్ ఒక సార్వభౌమాధికార దేశమని, దానితో ఆ విధంగానే వ్యవహరించాలని మన దౌత్య వ్యవహర్తలు గుర్తిస్తే మంచిది. -
మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేపాల్ రాయబార కార్యాలయంలో నేపాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ స్వాగతం పలికారు. ఓలి శనివారం ప్రధాని మోదీతో ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొంటారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో ఉన్న జీబీ పంత్ వ్యవసాయ, సాంకేతికత యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడి సంకరణ విత్తనాల ఉత్పత్తి కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అదే యూనివర్సిటీ ఓలికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. -
రూ.950 కోట్ల రద్దైన నోట్లు, వెనక్కి తీసుకోరా..
కాఠ్మాండు : రద్దయిన పెద్ద నోట్లు నేపాల్‌లో ఇంకా భారీగా ఉన్నట్టు తెలిసింది. ఈ వారంలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, తమ వద్దనున్న లక్షల కొద్దీ రద్దయిన భారత నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో మన దేశ అధికారులతో చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాత, నేపాల్ ప్రజల వద్ద, అధికారిక రంగాల్లో సుమారు రూ.950 కోట్ల రద్దయిన భారత బ్యాంకు నోట్లు ఉన్నట్టు అంచనాలు వెలువడ్డాయి. ఈ నోట్లను ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలనే విషయంలో నేపాల్, భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నేపాల్ ప్రజల వద్ద భారీగా రద్దయిన పెద్ద నోట్లు ఉన్నట్టు తెలిసింది. అవినీతికి వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీ నోట్లకు, ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే భారత్ కరెన్సీని ఎక్కువగా వాడుతున్న నేపాల్, భూటాన్ దేశాలు ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. భారత డిమానిటైజేషన్ నిర్ణయం నేపాలీ దేశస్తులను తీవ్రంగా బాధించిందని, ఇప్పటికే పలుమార్లు భారతీయ నేతలతో ఈ విషయంపై చర్చించామని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని పీఎం ఓలీ నేపాల్ పార్లమెంట్‌కు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే భారత పర్యటనలో నేపాల్ ప్రధాని ఓలీ, మన ప్రధాని నరేంద్రమోదీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను, ఇతర అధికారులను కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్య చర్చల్లో భాగంగా రద్దయిన నోట్ల విషయం గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. నోట్ల ఎక్స్చేంజ్ చేసుకుంటామని ఆర్బీఐ మాటిచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక చర్చలు జరుగలేదని సెంట్రల్ నేపాల్ రాష్ట్ర బ్యాంకు గవర్నర్ చింతా మనీ శివకోటి చెప్పారు. ఆర్బీఐ, నేపాల్ లేదా మరే ఇతర దేశాల నుంచి పాత కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోలేదని మన దేశ సీనియర్ అధికారులు చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో దీనిపై ఎలాంటి ప్రొవిజన్లను రూపొందించలేదని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని, భారత ప్రధానితో భేటీ అయి, ఈ విషయంపై చర్చించబోతున్నారు. నేపాల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. భారత కరెన్సీని నేపాలీ ప్రజలు, వ్యాపారస్తులు అధికంగా వాడతారు. అయితే ఒక్కసారిగా మోదీ డిమానిటైజేషన్ ప్రకటించడంతో, భారత కరెన్సీ నోట్లను ఇళ్లలో పొదుపు చేసుకున్న నేపాలీ ప్రజలపై ఈ ప్రభావం అధికంగా పడింది. -
నేపాల్ ప్రధానిగా ఓలీ
కఠ్మాండు: హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్–యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ 174 సీట్లు గెలిచింది. -
డోక్లాం వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలి
భారత్, చైనాలకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సూచన సాక్షి, తిరుమల: భారత్, చైనాల మధ్య నెలకొన్న డోక్లాం వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సూచించారు. శనివారం తన సతీమణి అర్జూరాణా దేవ్బా, ఇతర కుటుంబీకులతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో సంస్కృతి, వారసత్వ ,స్నేహ, సుహ్రుద్భావ సంబంధాలు ఉన్నాయని, అందుకే తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌కు వచ్చినట్లు చెప్పారు. -
నేపాల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
నేపాల్ ప్రధాని దేవ్బాతో భేటీలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: నేపాల్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ హామీనిచ్చారు. నేపాల్æప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో గురువారం మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం, భూకంపాల తర్వాత హిమాలయన్ దేశాల్లో పునర్నిర్మాణం వంటి ఎనిమిది అంశాలపై వీరిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. భారత్–నేపాల్‌ల మధ్య ఉన్న ఓపెన్ సరిహద్దు దుర్వినియోగం కాకుండా ఇరుదేశాల భద్రత, రక్షణ బలగాలు ఒకరినొకరు సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. దీనికి దేవ్బా స్పందిస్తూ ప్రతి విషయంలోనూ భారత్‌కు సహకారం అందిస్తామని, ఓపెన్ సరిహద్దు ఉన్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగనివ్వమని హామీనిచ్చారు. సమావేశానంతరం ఇద్దరు నేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ దేవ్బాతో సమావేశం సుహృద్భావ వాతావరణంలో చక్కగా జరిగిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ, భద్రత అంశాలు ఎంతో కీలకమైనవిగా అభిప్రాయపడ్డారు. అనంతరం కటైయా–కుసాహ, రాక్సల్–పర్వానీపూర్ సరిహద్దుల ప్రాంతాల మధ్య విద్యుత్ రవాణా లైన్లను ప్రారంభించారు. -
నేడు నగరంలో నేపాల్ ప్రధాని పర్యటన
ఇన్ఫోసిస్‌తో పాటు టీ హబ్ సందర్శించనున్న ప్రధాని సాక్షి, హైదరాబాద్: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన నగరానికి చేరుకుంటారు. ఇన్ఫోసిస్ క్యాంపస్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్ ఇంక్యుబేటర్ వ్యవస్థను సందర్శిస్తారు. రాత్రి ఆయనకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హోటల్ తాజ్ ఫలక్‌నుమాలో విందు ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఆయన నేపాల్ తిరుగు పయనమవుతారని వెల్లడించాయి. -
నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ రాజీనామా
ఖాట్మండ్ : నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రపంచ రాజీనామా చేశారు. రాజకీయ ఒప్పందంలో భాగంగా ఆయన తన పదవికి బుధవారం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) నేత షేర్ బహదూర్ దేవ్ బా నియమితులవనున్నారు. గత ఏడాది ఆగస్టులో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తన రాజీనామాను వెల్లడించిన అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రచండ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి విద్యాదేవి భండారికి సమర్పించారు. -
ప్రధానితో భేటీ అయిన నేపాల్ పీఎం
-
భారత్ చేరుకున్న ప్రచండ
కాట్మండు: నేపాల్ ప్రధాని ప్రచండ నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానిగా రెండో పర్యాయం ఎన్నికయ్యాక ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. శుక్రవారం ప్రధాని మోదీతో ప్రచండ భేటీ కానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్, కేంద్ర మంత్రులతోనూ సమావేశమవుతారు. ఆదివారం స్వదేశానికి బయల్దేరుతారు. నేపాల్ రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియలో ఎలాంటి సూచనలు చేయలేదని భారత్ తెలిపింది. మధేసీలు, తారులు, జంజాటీలను విశ్వాసంలోకి తీసుకోనంత వరకు నూతన రాజ్యాంగాన్ని అమలు చేసే వాతావర ణం కల్పించడం సాధ్యం కాదని ప్రచండ అన్నారు. -
నేపాల్ ప్రధాని మూడు రోజుల పర్యటన
నేపాల్ ప్రధాని ప్రచండ భారతదేశ పర్యటన నేటినుంచీ ప్రారంభం కానుంది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు విచ్చేసిన నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహాల్ ప్రచండ... మూడు రోజుల పర్యటన ఈరోజు ప్రారంభమవుతుంది. నేపాల్ ప్రధానమంత్రిగా ఈ సంవత్సరం ఆగస్టు 4న రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన ప్రచండ.. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకోవడంలో భాగంగా మొదటిసారి ఇండియా సందర్శిస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా దహాల్ ఉన్నతస్థాయి ప్రతినిథి వర్గంతో భేటీ కానున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా భారత్ లోని ప్రధాన నాయకత్వంతో దహాల్ చర్చలు జరపనున్నారు. హింమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ నదిపై నిర్మించిన కాంక్రీట్ డ్యామ్, 1500 మెగావాట్ల సామర్థ్యం గల.. జల విద్యుత్ ను ఉత్పత్తి చేసే నథ్పా జాక్రి జలశక్తి ప్రాజెక్ట్. లను ఆయన సందర్శిస్తారు. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో కలిసే భారత, నేపాల్ ప్రధాన మంత్రులు.. ప్రతినిథి స్థాయి చర్చలు జరిపిన అనంతరం.. ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
నేపాల్ ప్రధానిపై అవిశ్వాసం
కఠ్మాండు : నేపాల్ ప్రధాని ఓలిపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో సీపీఎన్-యూఎంఎల్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలోపడడం తెలిసిందే. దీంతో మావోయిస్టు సెంటర్ మంత్రులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఓలి తాను పదవి నుంచి వైదొలగనని, పార్లమెంటులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సెంటర్, నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ), సీపీఎన్ (యునెటైడ్).. ఓలీపై నేపాల్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఓటింగ్ వచ్చే వారం జరిగే అవకాశం ఉంది. కాగా 601 మంది సభ్యులు గల పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు మూడింటికి కలిపి 292 మంది సభ్యులున్నారు. ఓలికి పార్టీ యూఎంఎల్‌కి 175 మంది సభ్యులున్నారు. తీర్మానం గట్టెక్కడానికి 299 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే 50 మంది సభ్యులు గల ఆరు మధేసి పార్టీలు అవిశ్వాసానికి మద్దతిస్తామన్నాయి. -
పొరుగుదేశంలో రాజకీయ సంక్షోభం
ఖాట్మాండు: పొరుగుదేశం నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నేపాల్ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) మద్దతు ఉపసంహరించుకుంది. మంత్రి పదవుల నుంచి వైదొలగాల్సిందిగా తమ పార్టీ నేతలను ఆదేశించింది. సీపీఎన్ (ఎంసీ) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ మంగళవారం ఈ మేరకు ప్రకటించారు. దీంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి ప్రభుత్వం మైనార్టీలో పడింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్), సీపీఎన్ (ఎంసీ) కూటమి తరపున తొమ్మిది నెలల క్రితం నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఒలి బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ కూటమిలో సీపీఎన్ (ఎంసీ) రెండో పెద్ద పార్టీ. కాగా గత మేలో కుదుర్చుకున్న తొమ్మిది అంశాలతో కూడిన ఒప్పందాన్ని అమలు చేయనందుకు నిరసనగా సీపీఎన్ (ఎంసీ) ఒలి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంది. -
నేపాల్ సర్వతోముఖాభివృద్ధికి సాయం
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీ: భారత్-నేపాల్‌ల మధ్య గత నాలుగు నెలలుగా చెదిరిన ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడినపెట్టే దిశగా ఇరు దేశాలు విస్తృత చర్చలు చేపట్టాయి. రవాణా, విద్యుత్ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తొమ్మిది అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ నుంచి నేపాల్‌కు 80 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే 400 కేవీ ధాల్కేబార్-ముజఫర్‌పూర్ ట్రాన్స్మిషన్ లైన్‌ను ఇద్దరూ జాతికి అంకితం చేశారు. అనంతరం ఓలీ సమక్షంలో మోదీ మీడియాతో మాట్లాడుతూ నేపాల్‌లో శాంతి, సుస్థిరత వెల్లివిరియాలని కోరుకుంటున్నామని ఆ దేశ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధమని చెప్పారు. ఓలీ మాట్లాడుతూ భారత్ ఎప్పటికీ తమ సన్నిహిత మిత్ర దేశంగా ఉంటుందన్నారు. ప్రధానితో భేటీకి ముందు ఓలీతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు. భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్‌కు గతంలో ప్రకటించిన 100 కోట్ల డాలర్లలో భాగంగా 25 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం విడుదల, భారత్‌తో సరిహద్దుగల తెరాయ్ ప్రాంతంలో 518 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, నేపాల్ బంగ్లాదేశ్‌ల మధ్య విశాఖపట్నం పోర్టు ద్వారా వర్తకం. విశాఖపట్నం నుంచి రైలు రవాణా మార్గం మొదలైన అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.