అనుభవాన్ని మించిన ఉపాధ్యాయుడు లేడంటారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆ పదవి చేపట్టాక విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని, బుధవారం నాలుగు రోజుల పర్యటన కోసం రావటం ఈ సంగతినే మరోసారి తెలియజెబుతోంది. ఆయనకు వామపక్ష నేపథ్యం ఉంది. రాచరికాన్ని కూలదోసి ప్రజాతంత్ర రిపబ్లిక్‌కు పట్టంగట్టిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఆయన నేతృత్వంలోని మావోయిస్టు పార్టీయే.
అందువల్లే తొలి దఫా 2008లోనూ, ఆ తర్వాత 2016లోనూ అధికారంలోకొచ్చినప్పుడు ఆయన సహజంగానే చైనా వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి ఆయన ఆలోచనలో మార్పు వచ్చిన దాఖలా కనబడుతోంది. ఎందు కంటే మొన్న మార్చి నెలాఖరున చైనా నిర్వహించిన కీలకమైన బావ్ ఫోరం ఫర్ ఆసియా సమా వేశానికి రారమ్మని ఆ దేశం పిలిచినా, అక్కడి అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉన్నా వెళ్లకుండా ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపారు.
నేపాల్ ప్రధాని పీఠాన్ని ఎవరు అధిరోహించినా తొలి విదేశీ పర్యటన కోసం భారత్ రావటం సంప్రదాయంగా వస్తోంది. కొత్త అధినేత రాగానే ఆహ్వానించటం భారత్‌కు కూడా రివాజైంది. కానీ ఈసారి మన దేశం ప్రచండను పిలిచేందుకు ఆర్నెల్ల సమయం తీసుకుంది. ఆయన పర్యటన మూడుసార్లు వాయిదాలు పడి ప్రస్తుత కార్యక్రమం ఖరారైంది. వాస్తవానికి నేపాల్‌లో ప్రచండకు మునుపటంత ఆకర్షణ లేదు.
275 స్థానాలుండే నేపాల్ పార్లమెంటుకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 227 స్థానాలు గెల్చుకున్న ఆయన నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ఇప్పుడు రెండంకెల స్థాయికి పడిపోయింది. ఆమాటకొస్తే నేపాల్‌లో ప్రస్తుతం ఎవరికీ చెప్పుకోదగ్గ బలం లేదు. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు) తర్వాత మూడో స్థానంలో ప్రచండ పార్టీ ఉండగా... ప్రస్తుతం ఎనిమిది పార్టీల కూటమి ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయన వైఖరిలో మార్పు తెచ్చిందనుకోవాలి.
భారత్ – నేపాల్ సంబంధాల్లో అడపా దడపా ఒడిదుడుకులు ఎదురవుతున్న సంగతి నిజమే అయినా అవి నిలకడగానే ఉన్నాయి. నేపాల్‌తో మనకు 1,850 కిలోమీటర్ల నిడివి సరిహద్దు ఉంది. ఆ రీత్యా వ్యూహాత్మకంగా మన దేశానికి నేపాల్ అత్యంత ముఖ్యమైన దేశం. సముద్ర తీరం లేకపోవటం వల్ల సరుకు రవాణా, సర్వీసుల రంగాల్లో దాదాపుగా అది మన దేశంపైనే ఆధార పడుతుంది. నేపాల్ దిగుమతులన్నీ మన రేవుల ద్వారానే సాగుతాయి. ఇంధన రంగంలోనూ ఈ సహకారం కొనసాగుతోంది.
ఆ దేశంలో భారత్ పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది. మన దేశానికి నేపాల్ 450 మెగావాట్ల విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో మన సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అలాగే నేపాల్‌లో రైల్వే ప్రాజెక్టులకు భారత్ సాయం అందిస్తోంది. గురువారం ఇరుదేశాల ప్రధానులూ ఆన్‌లైన్‌లో రెండు చెక్‌పోస్టు లనూ, బిహార్ నుంచి సరుకు రవాణా రైలును ప్రారంభించారు. ఇవిగాక రెండు దేశాల ప్రధానుల సమక్షంలో ఏడు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి.
నేపాల్‌ను ఎప్పటికప్పుడు మంచి చేసుకునేందుకు చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో కొన్నిసార్లు సఫలీకృతమైంది కూడా. ఒక్క ప్రచండ అనేమిటి... భారత్ అనుకూలుడిగా ముద్రపడిన ఓలి శర్మ సైతం చైనా వ్యామోహంలో పడి మన దేశంపై నిప్పులు చెరిగిన సందర్భాలున్నాయి. కనుకనే చైనా పెట్టుబడుల శాతం గణనీయంగా పెరిగింది. కేంద్రంలో ఎవరు అధికారంలోవున్నా నేపాల్‌పై మన దేశం పెద్దన్న పాత్ర పోషించా లనుకోవటం అప్పుడప్పుడు సమస్యలకు కారణమవుతున్న సంగతి కాదనలేనిది.
ఉదాహరణకు 2016లో రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసే దశలో నేపాల్‌లోని తెరై ప్రాంతంలో ఉన్న మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతులు ఉద్యమించాయి. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవా లని, వారితో చర్చించి రాజ్యాంగంలో తగిన మార్పులు చేయాలని మన దేశం సూచించింది. కానీ దీన్ని నేపాల్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెరై ప్రాంతంలో భారీయెత్తున ఉద్యమాలు సాగాయి.
దాంతో మన దేశంనుంచి వంటగ్యాస్ రవాణా నెలల తరబడి నిలిచిపోయింది. ఉద్యమాల వెనక భారత్ ప్రమేయం ఉన్నదనీ, తమను లొంగదీసుకునేందుకే ఇవన్నీ చేస్తున్నారనీ నేపాల్ ఆరోపించింది. ఈ పరిస్థితిని అప్పట్లో చైనా చక్కగా వినియోగించుకుంది.
వాస్తవానికి ఇప్పుడు సరిహద్దుల విషయంలో ప్రచండపై ఒత్తిళ్లు ఎక్కువే ఉన్నాయి. ఉత్తరా ఖండ్‌లోని లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ చాన్నాళ్లుగా వాదిస్తోంది. వాటిని తమ దేశంలో భాగంగా చూపుతూ మూడేళ్ల క్రితం మ్యాప్‌లు కూడా ముద్రించింది.
వాటికి సంబంధించిన బిల్లుల్ని కూడా అక్కడి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అనంతర కాలంలో ఈ వివాదం సద్దుమణిగింది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారం కుదిరింది. దీన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మోదీకి ప్రచండ సూచించారు.
ఇరుగుపొరుగు అన్నాక సమస్యలు సహజం. వాటిని ఒడుపుగా పరిష్కరించుకోవటంలోనే ఆ దేశాల పరిణతి కనబడుతుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలనూ ‘సూపర్ హిట్’ చేస్తామనీ, వాటిని హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్తామనీ ప్రచండకు నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ఇదొక మంచి పరిణామం. తదుపరి కార్యాచరణ ఆ దిశగా చురుగ్గా కదిలితే శతాబ్దాలనాటి ఇరు దేశాల సంబంధాలూ మరింత ఉన్నత స్థాయికి చేరతాయనడంలో అతిశయోక్తి లేదు.
నేపాల్‌తో పటిష్ఠ బంధం
Published Fri, Jun 2 2023 3:41 AM | Last Updated on Fri, Jun 2 2023 3:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment