పెళ్ళిలో నాగవల్లి నాటి మాట సదస్యానికి ఉంటుందా?! నేపాల్‌కు కొత్త ప్రధానిగా కొలువు తీరిన పుష్పకమల్ దహల్ (ప్రచండ)ను చూస్తే ఆ జాతీయమే గుర్తొస్తుంది. ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకు తిరిగిన 5 పార్టీల కూటమిని ఫలితాలొచ్చాక గాలికి వదిలేసి, అప్పటి దాకా తాను విమర్శించిన వారితో కలసి ఆయన అధికారంలోకి రావడం అలానే ఉంది. ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ –మావో యిస్ట్ సెంటర్’ (సీపీఎన్–ఎంసీ) నేత ప్రచండ ఈ ఎన్నికల ముందు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌తో తిరిగారు.
తీరా అధికారం కోసం తన బద్ధశత్రువైన మరో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీతో చేతులు కలిపారు. ఓలీ సారథ్య ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్– ఐక్య మార్క్సిస్ట్– లెనినిస్ట్’ (సీపీఎన్– యూఎంఎల్)తో పాటు పలు చిన్నాచితకా పార్టీలతో కలసి అధికారం పంచుకుంటున్నారు. ఏ ప్రభుత్వమూ పూర్తికాలం అధికారంలో ఉండదన్న అపకీర్తిని మూటగట్టుకున్న నేపాల్‌లో ఈ అవసరార్థ అధికార కూటమి ఎన్నాళ్ళుంటుందో తెలీదు కానీ చైనా అనుకూల ప్రచండ, దేవ్‌బా ద్వయం వల్ల భారత్ అప్రమత్తం కాక తప్పని పరిస్థితి.
68 ఏళ్ళ ప్రచండ 13 ఏళ్ళు అజ్ఞాత జీవితం గడిపారు. 1996 నుంచి 2006 వరకు సాగిన సాయుధ తిరుగుబాటుకు ప్రచండే సారథి. 2006 నవంబర్‌లో సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకంతో ఆ తిరుగుబాటు కథకు తెరపడింది. దశాబ్ద కాలపు తిరుగుబాటుకు స్వస్తి చెప్పి, సీపీఎన్ – ఎంసీ ప్రశాంత రాజకీయాల పంథాను అనుసరించడం మొదలుపెట్టాక ఆయనా ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ విప్లవ వీరుడు ప్రధాని పీఠం అధిష్ఠించడం ఇది ముచ్చటగా మూడో సారి.
దేవ్‌బా సారథ్య నేపాలీ కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించింది గనక అదే పగ్గాలు పడుతుందనీ, దేవ్‌బా, ప్రచండలు పదవిని పంచుకుంటారనీ అంతా అనుకున్నారు. కానీ, ప్రధానిగా తొలి విడత ప్రచండకు ఇవ్వడానికి దేవ్‌బా తటపటాయించడంతో తేడా వచ్చింది. అదే అదనుగా ఓలీ చాణక్యతంత్రంతో ప్రచండను తన వైపు తిప్పుకోవడం రాజకీయ చాతుర్యం.
నిజానికి, 275 స్థానాల ప్రజాప్రతినిధుల సభలో ప్రచండ నాయకత్వంలోని సీపీఎన్–ఎంసీ ఈ ఎన్నికల్లో గెలిచింది 32 సీట్లే. అయితే, ఓలీ సారథ్యంలోని సీపీఎన్–యూఎంఎల్ (78) కాక మరో అయిదు పార్టీలు మద్దతు నిచ్చాయి. అలా ప్రచండకు 165 మంది సభ్యుల అండ దొరికింది. బద్ధ శత్రువులుగా ఎన్నికల్లో పోరాడిన ప్రచండ, ఓలీలు ఫలితాలొచ్చాక ఇలా కలసిపోతారనీ, వంతుల వారీగా ప్రధాని పీఠం పంచుకొనేలా అవగాహన కుదుర్చుకుంటారనీ ఎవరూ ఊహించలేదు. ఇది ఓటర్లకూ మింగుడుపడని విషయం. ఇవన్నీ నేపాల్ అంతర్గత రాజకీయాలు. అక్కడ ఏ పార్టీలో, ఎవరు ప్రధాని కావాలనేది అక్కడి పార్టీల, ప్రజల ఇష్టం.
ఆ ప్రధానులూ, ప్రభుత్వాలూ పూర్తికాలం అధికారంలో లేకుంటే అది ఆ దేశానికి నష్టం. కాకపోతే, రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి మారిన ఈ హిమాలయ పొరుగుదేశపు బాగోగులు, దోస్తీ భౌగోళిక–రాజకీయాల్లో భారత్‌కు కీలకం. అధికారమే లక్ష్యంగా 2 కమ్యూనిస్ట్‌పార్టీ గ్రూపుల నేతలూ దగ్గరవడానికి చైనాతో సాన్నిహి త్యంతో పాటు ఓలీ అంటే సానుకూలత ఉన్న నేపాల్ ప్రెసిడెంట్ విద్యాదేవి కూడా కారణమం టారు. ఏమైనా దీంతో నేపాల్‌తో బంధాల్లో చైనాదే పైచేయనే అభిప్రాయం సహజమే.
కొత్త ప్రధాని ప్రచండ ఏనాడూ భారత్‌కు సానుకూల వ్యక్తి కాదు. పైపెచ్చు ఆయన మనసంతా చైనా మీదే. కాక పోతే, క్రితంసారి ఆయన పదవిలో ఉన్నప్పుడు భారత్ పట్ల సదా సానుకూలత చూపే నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నారు. కాబట్టి కథ నడిచిపోయింది. కానీ, ఈసారి చైనా వైపు మొగ్గే ఓలీతో కలసి అధికారం పంచుకుంటున్నారు గనక రానున్న రోజులు భారత్‌కు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. అలా చూస్తే ప్రపంచంలో ఒకప్పటి ఏకైక హిందూరాజ్యాన్ని అక్కున చేర్చుకోలేకపోవడం ఇక్కడ హిందూ ఆధిక్యవాదాన్ని పరోక్షంగా ప్రవచిస్తున్న పాలకుల దౌత్య వైఫల్యమని కొందరి విమర్శ.
అయితే, పదవి చేపట్టిన ప్రచండను ముందుగా మోదీనే అభినందించడం విశేషం. గతంలో ఓలీ అధికారంలో ఉండగా మోదీ రెండుసార్లు నేపాల్‌కెళితే, ఆయన రెండుసార్లు భారత్‌కు వచ్చారు. కింగ్‌మేకర్ ఓలీ నేతృత్వ పార్టీ కూడా తాము భారత్ కన్నా చైనాతో బంధానికే మొగ్గుతామనే భావనను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.
భారత, చైనాల పట్ల నేపాల్ వైఖరిలో పెద్ద మార్పేమీ ఉండదనీ, భారత్‌తో ‘సంతులిత, విశ్వసనీయ’ సంబంధాలు నెరుపుతామనీ అంటోంది. కానీ, ఓలీ గద్దెపై ఉన్నప్పుడే వివాదాస్పద ప్రాంతాలను నేపాల్‌లో భాగంగా చూపుతూ కొత్త రాజకీయ పటాన్ని జారీ చేయడం, చకచకా పార్లమెంట్ ఆమోదముద్ర వేయడం అంత తేలిగ్గా మర్చిపోలేం.
ఆరేళ్ళు పనిచేసి, అర్ధంతరంగా చైనా వదిలేసిన రెండు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లను ఈ ఏడాదే భారత్ చేపట్టింది. మునుపటి దేవుబా సర్కార్ వాటిని భారత్‌కు కట్టబెట్టింది. అప్పట్లో ఓలీ దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఓలీ భాగస్వామిగా కొత్త ప్రభుత్వం వచ్చేసరికి, వాటి భవిత ప్రశ్నార్థకమే. పైగా, కొత్త సర్కార్ రాగానే చైనా రకరకాల ప్రాజెక్ట్‌లతో నేపాల్‌లో కాలూనేందుకు ఉరకలేస్తోంది.
నేపాల్ – చైనా సరిహద్దు రైల్వేలైన్ అధ్యయనానికి నిపుణుల బృందాన్ని మంగళవారమే పంపింది. ఈ పరిస్థితుల్లో భారత్ చొరవ చూపాలి. ప్రాజెక్ట్‌లే కాక విద్య, వైద్యం, పర్యావరణం లాంటి అనేక అంశాల్లోనూ ప్రజాస్వామ్య గణతంత్ర భారత్‌తో సన్నిహిత భాగస్వామ్యమే నేపాల్‌కు దీర్ఘకాలంలో లాభమని నచ్చజెప్పగలగాలి. ఒక్క నేపాల్‌కే కాదు... వ్యూహాత్మకంగా మనకూ అది ముఖ్యం!
Comments
Please login to add a commentAdd a comment