నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత సరిహద్దులకు సమీపంలో నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారత యువకుడు మృతిచెందాడు. సోమవారం బీర్‌గంజ్‌లోని శంకరాచార్య గేట్ దగ్గర్లో ఈ సంఘటన జరిగింది. దీనిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుడి మొబైల్‌లోని ఓ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా అతని పేరు ఆశిష్ రామ్ అని, బిహార్‌లోని రాక్సాల్‌వాసి అని తేలింది. మధేసీ తెగ ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరపగా, తూటా ఆశిష్ తలలోకి దూసుకుపోయింది. అతడిని ఆస్పత్రి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారని నేపాల్ అధికారులు తెలిపారు. నేపాల్ కొత్తరాజ్యాంగానికి వ్యతిరేకంగా సోమవారం బీర్‌గంజ్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.
పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. సరిహద్దుల్లోని కీలక మిటేరీ బ్రిడ్జిని ఆక్రమించిన ఆందోళనకారులను నేపాల్ పోలీసులు ఖాళీ చేయించారు. అక్కడ వారు వేసుకున్న టెంట్లను తగులబెట్టి, నేపాల్, భారత్‌లమధ్య రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సంఘటన అనంతరం పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. భారత సంతతికి చెందిన మధేసీతెగ ప్రజలు 40 రోజులుగా ఈ బ్రిడ్జిని తమ స్వాధీనంలోకి తీసుకోవడంతో భారత్, నేపాల్ మధ్య రవాణా పూర్తిగా స్తంభించింది. భారత యువకుడి హత్యపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.