Indian died
-
NewYork: అపార్ట్మెంట్లో మంటలు.. భారత జర్నలిస్టు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం హార్లెమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఎగిసిపడ్డ మంటల్లో భారత్‌కు చెందిన యువకుడు ఫజిల్ ఖాన్(27) మృతి చెందాడు. చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటరే మంటలకు కారణమని అధికారులు తెలిపారు. మంటల్లో గాయాలపాలైన ఫజల్ఖాన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొలంబియా జర్నలిజం స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఫజల్‌ఖాన్ మృతి పట్ల న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఫజల్‌ఖాన్ తల్లిదండ్రులను సంప్రదించామని, అతడి మృతదేహాన్ని భారత్ పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. మంటలు తొలుత పై అంతస్తుల్లో ప్రారంభమయ్యాయని, దీంతో అపార్ట్మెంట్లో పై అంతస్తుల్లో ఉన్నవారు కిటికీల్లో నుంచి దూకారని అఖిల్ జోన్స్ అనే స్థానికుడు తెలిపాడు. తాను, తన తండ్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నామన్నాడు. ఫోన్, తాళాలు తప్ప తాము తమ వెంట ఏమీ తెచ్చుకోలేదని చెప్పాడు. అగ్ని ప్రమాదం కారణంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి.. పుతిన్ ప్రత్యర్థి హత్య.. వెలుగులోకి సంచలన విషయం -
రెండు విమానాలు ఢీ; భారత యువతి మృతి
వాషింగ్టన్ : పైలట్ శిక్షణలో ఉండగా రెండు విమానాలు ఆకాశంలో ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన నిషా సెజ్వాల్(19) అనే యువతితో పాటు జార్జ్ శాన్‌చెజ్(22), రాల్ఫ్ నైట్(72)లు మరణించారు. వీరితో పాటు ఉన్న మరోవ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. డీన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్కూల్‌కు చెందిన రెండు శిక్షణ విమానాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఒకదానికొకటి తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని అమెరికా విమానయాన శాఖ తెలిపింది. విమానాలు కూలిన ప్రాంతమంతా పూర్తిగా పొడవాటి గడ్డి ఉండటంతో అక్కడికి చేరుకోవడం కష్టతరంగా మారిందని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. కేవలం ఎయిర్‌బోట్స్ ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలమన్నారు. సహాయక చర్యలకు వాతావరణం కూడా అనుకూలించడం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా నిషాను గుర్తించామన్నారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు. కాగా 2007 నుంచి 2017 మధ్య కాలంలో ఈ స్కూలుకు చెందిన రెండు డజన్లకు పైగా విమానాలు ప్రమాదానికి గురైనట్టు మియామి మేయర్ తెలిపారు. కాగా, నిషా సెజ్వాల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలియరాలేదు. -
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత సరిహద్దులకు సమీపంలో నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారత యువకుడు మృతిచెందాడు. సోమవారం బీర్గంజ్లోని శంకరాచార్య గేట్ దగ్గర్లో ఈ సంఘటన జరిగింది. దీనిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుడి మొబైల్లోని ఓ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా అతని పేరు ఆశిష్ రామ్ అని, బిహార్‌లోని రాక్సాల్వాసి అని తేలింది. మధేసీ తెగ ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరపగా, తూటా ఆశిష్ తలలోకి దూసుకుపోయింది. అతడిని ఆస్పత్రి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారని నేపాల్ అధికారులు తెలిపారు. నేపాల్ కొత్తరాజ్యాంగానికి వ్యతిరేకంగా సోమవారం బీర్గంజ్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. సరిహద్దుల్లోని కీలక మిటేరీ బ్రిడ్జిని ఆక్రమించిన ఆందోళనకారులను నేపాల్ పోలీసులు ఖాళీ చేయించారు. అక్కడ వారు వేసుకున్న టెంట్లను తగులబెట్టి, నేపాల్, భారత్‌లమధ్య రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సంఘటన అనంతరం పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. భారత సంతతికి చెందిన మధేసీతెగ ప్రజలు 40 రోజులుగా ఈ బ్రిడ్జిని తమ స్వాధీనంలోకి తీసుకోవడంతో భారత్, నేపాల్ మధ్య రవాణా పూర్తిగా స్తంభించింది. భారత యువకుడి హత్యపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
సౌదీలో భారతీయుడి మృతి
ప్రొద్దుటూరు : పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ భారతీయుడు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆజాద్(43) అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రిందట సౌదీ వెళ్లాడు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మంగళవారం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు అక్కడ మరణిస్తే.. చివరి చూపు కోసం ఇక్కడికి తీసుకురావడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని అతని తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సౌదీ అరేబియా నుండి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి సుమారు రూ.3 లక్షల దాకా ఖర్చు అవుతుందని, అంత స్థోమత తమకు లేదని, ప్రభుత్వమే సాయం చేయాలని వేడుకుంటున్నారు. -
'లిటిల్ ఇండియా'లో మద్యనిషేధం విధించిన సింగపూర్
'లిటిల్ ఇండియా'.. ఈ ప్రాంతం సింగపూర్‌లో చాలా ఫేమస్. భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతమిది. ఇలాంటి ప్రాంతంలో వారాంతాలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఆదివారం ఇక్కడ అల్లర్లు జరిగి ఓ భారతీయుడు కూడా మరణించాడు. గత ఆదివారం రాత్రి హాంషైర్ పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్‌కోర్స్‌లో అల్లర్లు చెలరేగాయి. దీంతో అక్కడున్న 1.1 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఏ ఒక్కరూ మద్యం అమ్మడానికి గానీ, తాగడానికి గానీ వీల్లేదంటూ అధికారులు నిషేధం విధించారు. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి.రాజకుమార్ తెలిపారు. ఎవరైనా తాగి పట్టుబడినా, లేదా మద్యం అమ్ముతూ దొరికినా వెంటనే అరెస్టు చేస్తామన్నారు. ఎవరైనా తెలియక చేస్తే మాత్రం ముందుగా వారికి కౌన్సెలింగ్ ఇస్తామని, అప్పుడు మద్యం సీసాను పక్కకు విసిరేసి అక్కడినుంచి వెళ్లిపోతే పర్వాలేదు గానీ లేకపోతే మాత్రం అరెస్టు తప్పదని ఆయన చెప్పారు. భారతీయ వ్యాపారవేత్తలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉంటారు. గత ఆదివారం నాడు చిన్న రోడ్డు ప్రమాదం నేపథ్యంలో అల్లర్లు జరిగి శక్తివేల్ కుమారవాలు అనే భారతీయుడు మరణించాడు. 39 మంది పోలీసులు గాయపడగా, 25 పోలీసు, డిఫెన్స్ వాహనాలు తగలబడ్డాయి. -
మద్యం అమ్మకాలు నిషేధించిన సింగపూర్
సింగపూర్: అల్లర్లు జరిగిన ప్రాంతంలో మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని సింగపూర్ నిషేధించింది. రోడ్డు ప్రమాదంలో భారతీయుడు మృతి చెందడంతో ఆదివారం రాత్రి హాంషేర్ పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్‌కోర్స్‌లో అల్లర్లు చెలరేగాయి. దీంతో అక్కడ ఈ వారాంతంలో మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని నిషేధిస్తున్నట్టు హోం వ్యవహారాల శాఖ సెకండ్ మినిస్టర్ ఎస్ ఈశ్వరన్ ప్రకటించారు. అయితే ఈ నిషేధం ఏ సమయం నుంచి అమలవుతుంది, ఏ ప్రాంతం వరకు ఉంటుందనేది పోలీసులు నిర్ధారిస్తారని ఆయన పేర్కొన్నారు. అల్లర్లకు కారణం ఏమిటనేది ఎప్పుడే ఇప్పడు చెప్పలేమన్నారు. మద్యం మత్తులో ఆందోళనకారులు అల్లరకు దిగారని ప్రభుత్వం అనుమానిస్తోంది. హాంషేర్ పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్‌కోర్స్‌లో ప్రైవేటు బస్సు ఢీకొట్టడడంతో భారత్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు, తమిళనాడువాసి కురవేలు(33) మృతి చెందడడంతో 400 మంది ఆందోళనకు దిగారు. ఆగ్రహించిన స్థానిక భారతీయులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై దాడి చేయడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. 10 మంది పోలీసులతోసహా 18 మందికి ఈ ఘటనలో గాయాలయ్యాయి. 16 వాహనాలు ధ్వంసమయ్యాయి.