
వాషింగ్టన్ : పైలట్ శిక్షణలో ఉండగా రెండు విమానాలు ఆకాశంలో ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన నిషా సెజ్వాల్(19) అనే యువతితో పాటు జార్జ్ శాన్‌చెజ్(22), రాల్ఫ్ నైట్(72)లు మరణించారు. వీరితో పాటు ఉన్న మరోవ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. డీన్ ఇంటర్‌నేషనల్ ఫ్లైట్ స్కూల్‌కు చెందిన రెండు శిక్షణ విమానాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఒకదానికొకటి తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని అమెరికా విమానయాన శాఖ తెలిపింది.
విమానాలు కూలిన ప్రాంతమంతా పూర్తిగా పొడవాటి గడ్డి ఉండటంతో అక్కడికి చేరుకోవడం కష్టతరంగా మారిందని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. కేవలం ఎయిర్‌బోట్స్ ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలమన్నారు. సహాయక చర్యలకు వాతావరణం కూడా అనుకూలించడం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా నిషాను గుర్తించామన్నారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు. కాగా 2007 నుంచి 2017 మధ్య కాలంలో ఈ స్కూలుకు చెందిన రెండు డజన్లకు పైగా విమానాలు ప్రమాదానికి గురైనట్టు మియామి మేయర్ తెలిపారు. కాగా, నిషా సెజ్వాల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment