'లిటిల్ ఇండియా'.. ఈ ప్రాంతం సింగపూర్లో చాలా ఫేమస్. భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతమిది. ఇలాంటి ప్రాంతంలో వారాంతాలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఆదివారం ఇక్కడ అల్లర్లు జరిగి ఓ భారతీయుడు కూడా మరణించాడు. గత ఆదివారం రాత్రి హాంషైర్ పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్కోర్స్లో అల్లర్లు చెలరేగాయి. దీంతో అక్కడున్న 1.1 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఏ ఒక్కరూ మద్యం అమ్మడానికి గానీ, తాగడానికి గానీ వీల్లేదంటూ అధికారులు నిషేధం విధించారు.
ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి.రాజకుమార్ తెలిపారు. ఎవరైనా తాగి పట్టుబడినా, లేదా మద్యం అమ్ముతూ దొరికినా వెంటనే అరెస్టు చేస్తామన్నారు. ఎవరైనా తెలియక చేస్తే మాత్రం ముందుగా వారికి కౌన్సెలింగ్ ఇస్తామని, అప్పుడు మద్యం సీసాను పక్కకు విసిరేసి అక్కడినుంచి వెళ్లిపోతే పర్వాలేదు గానీ లేకపోతే మాత్రం అరెస్టు తప్పదని ఆయన చెప్పారు. భారతీయ వ్యాపారవేత్తలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉంటారు. గత ఆదివారం నాడు చిన్న రోడ్డు ప్రమాదం నేపథ్యంలో అల్లర్లు జరిగి శక్తివేల్ కుమారవాలు అనే భారతీయుడు మరణించాడు. 39 మంది పోలీసులు గాయపడగా, 25 పోలీసు, డిఫెన్స్ వాహనాలు తగలబడ్డాయి.
'లిటిల్ ఇండియా'లో మద్యనిషేధం విధించిన సింగపూర్
Published Fri, Dec 13 2013 11:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement