![Real Ayodhya is in Nepal and Lord Rama was Nepali - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/14/RSDTR.jpg.webp?itok=MsLvODHU)
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి
కఠ్మాండు: భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వివాదం రేపిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అసలైన అయోధ్య నేపాల్‌లో ఉంది. శ్రీరాముడు నేపాల్ దేశస్తుడు’ అని ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు.
అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేశారు. ప్రధాని ఓలి తాజా వ్యాఖ్యలపై అధికార పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని ప్రచండ స్పందించారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా గానీ, దౌత్యపరంగా గానీ సరికావన్నారు.
Comments
Please login to add a commentAdd a comment