నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా కన్నుమూత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌కు మిత్రునిగా పేరుపొందిన నేపాల్ మాజీ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా(79) మంగళవారం కన్నుమూశారు. దేశ రాజధాని కఠ్మాండు శివార్లలోని మహరాజ్‌గంజ్‌లో స్వగృహంలో తెల్లవారుజాము 12.50 గంటలకు(స్థానిక కాలమానం) శ్వాససమస్యతో తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న సుశీల్‌కు న్యుమోనియా సోకింది. సోమవారం ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించింది.
ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ అంత్యక్రియలను బుధవారం నిర్వహిస్తారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుశీల్ భారత్‌తో స్నేహసంబంధాలకు గట్టి మద్దతుదారుగా పేరుపడ్డారు. 2014 ఫిబ్రవరి -2015 అక్టోబర్ మధ్య నేపాల్ ప్రధానిగా పనిచేశారు. అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్‌లో సుస్థిరత తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. భారత్‌తో చక్కని సంబంధాలను కొనసాగించారు. అయితే పదవీకాలం చివరిలో కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో గత అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. 1954లో రాజకీయాల్లోకి వచ్చిన సుశీల్ నేపాల్‌లో రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. అవివాహితుడైనా యన 16 ఏళ్లు భారత్‌లో ప్రవాస జీవితాన్నిగడిపారు.
సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని భారత బృందం నివాళి.. భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం కఠ్మాండులోని దశరథ్ రంగశాల స్టేడియంలో ఉంచిన సుశీల్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి ఘటించింది. సుశీల్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బృందంలో ఆనంద్‌శర్మ(కాంగ్రెస్), శరద్ యాదవ్(జేడీ-యూ), సీతారాం ఏచూరి(సీపీఎం), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. కాగా సుశీల్ కొయిరాలా మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు.