Sushil Koirala
-
నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా కన్నుమూత
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌కు మిత్రునిగా పేరుపొందిన నేపాల్ మాజీ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా(79) మంగళవారం కన్నుమూశారు. దేశ రాజధాని కఠ్మాండు శివార్లలోని మహరాజ్‌గంజ్‌లో స్వగృహంలో తెల్లవారుజాము 12.50 గంటలకు(స్థానిక కాలమానం) శ్వాససమస్యతో తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న సుశీల్‌కు న్యుమోనియా సోకింది. సోమవారం ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వ లాంఛనాలతో సుశీల్ అంత్యక్రియలను బుధవారం నిర్వహిస్తారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుశీల్ భారత్‌తో స్నేహసంబంధాలకు గట్టి మద్దతుదారుగా పేరుపడ్డారు. 2014 ఫిబ్రవరి -2015 అక్టోబర్ మధ్య నేపాల్ ప్రధానిగా పనిచేశారు. అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్‌లో సుస్థిరత తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. భారత్‌తో చక్కని సంబంధాలను కొనసాగించారు. అయితే పదవీకాలం చివరిలో కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో గత అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. 1954లో రాజకీయాల్లోకి వచ్చిన సుశీల్ నేపాల్‌లో రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. అవివాహితుడైనా యన 16 ఏళ్లు భారత్‌లో ప్రవాస జీవితాన్నిగడిపారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని భారత బృందం నివాళి.. భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం కఠ్మాండులోని దశరథ్ రంగశాల స్టేడియంలో ఉంచిన సుశీల్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి ఘటించింది. సుశీల్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బృందంలో ఆనంద్‌శర్మ(కాంగ్రెస్), శరద్ యాదవ్(జేడీ-యూ), సీతారాం ఏచూరి(సీపీఎం), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. కాగా సుశీల్ కొయిరాలా మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. -
కొయిరాలా రాజీనామా.. మళ్లీ పోటీకి సై
ఖట్మాండు: నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంబరణ్ యాదవ్‌కు సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు అపద్ధర్మ ప్రధానిగా కొనసాగించాలని సూచించారు. ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు పార్లమెంటు సమాయత్తం అవుతుండగా... ఇప్పటికీ కొ్తత ప్రధాని ఎవరనే దానిపై ప్రధాన పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ సంక్షోభం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు కీలక భారత్ సరిహద్దు వాణిజ్య ఒప్పందంపై దేశమంతటా నిరసనలు, రోడ్డు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ప్రధాని పదవికి కొయిరాలా రాజీనామా లాంఛనం మాత్రమే. ఆదివారం పార్లమెంటులో జరగబోయే నూతన ప్రధాని ఎన్నికలో ఆయన కూడా ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రధాని అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కోయిరాల ప్రధానంగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలితో పోటీపడుతున్నారు. -
ఆదమరచి ఉండగా దెబ్బతీసింది
తాజా భూకంపంపై నేపాల్ ప్రధాని కఠ్మాండు: పెను విధ్వంసం సృష్టించిన ఏప్రిల్ 25 భూకంపం నుంచి కోలుకుంటూ పునర్నిర్మాణ చర్యల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉండటంతో.. తాజాగా మంగళవారం సంభవించిన భూకంపాన్ని ఎదుర్కోలేకపోయామని నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా పేర్కొన్నారు. ‘‘మేం ఆదమరచి ఉండగా దెబ్బతీసింది’’ అని చెప్పారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన తాజా భూకంపం ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆయన గురువారం దోలఖా ప్రాంతంలో పర్యటించారు. కాగా, తాజా భూకంపంలో మృతుల సంఖ్య 110కి పెరిగింది. -
భారత్ సాయంతో నేపాల్‌కు ప్రమాదమా?
భూకంపం సంభవించగానే నేపాల్ ప్రభుత్వం కంటే ముందుగా స్పందించి.. శిథిలాల తొలిగింపు, బాధితుల తరలింపు కార్యక్రమాల్ని చేపట్టిన భారత్ చర్యలు ఆ దేశ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాయా? నేపాల్- చైనా సంబంధాలపై ప్రభావం చూపేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి నేపాల్ మావోయిస్టు పార్టీలు! భూకంపం అనంతర పరిణామాలపై నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా నేతృత్వంలో శనివారం కఠ్మాండులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో యూసీపీఎన్ (యూనైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- మావోయిస్టు) ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. భూకంప బాధితులకు సహాయం పేరుతో భారత సైన్యం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని, వారి చర్యలు నేపాల్ అంతర్గత భద్రతను ప్రమాదకర స్థితిలోకి నెట్టేవిగా ఉన్నాయని, ఈ విషయంలో భారత సైన్యానికి తగిన మార్గదర్శకాలు సూచించాలని యూసీపీఎన్ కూటమి అధ్యక్షుడు పుష్ప కమల్ దహాల్, మోహన్ బైద్య, మజ్దూర్ కిసాన్ పార్టీ నాయకుడు నారాయణ్ మాన్.. ప్రధాని కోయిరాలాకు సూచించినట్లు నేపాల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. త్రిభువన్ ఎయిర్‌పోర్టు, నేపాల్- చైనా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే భారత సైన్యం కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ఇది నేపాల్- చైనా మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని కమ్యూనిస్టు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మీడియాలో వినవస్తోన్న వార్తల్లో నిజం లేదని, నేపాల్ ప్రభుత్వం ఆదేశాలమేరకే ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం పనిచేస్తున్నదని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. నేపాల్‌కు భారత్ అందించేది స్నేహహస్తమేనని విదేశాంగ కార్యదర్శి జైశంకర్ అన్నారు. -
రక్తదానం చేసి ఆదుకోండి
ఖాట్మాండూ: రక్తదానం చేసి భూకంప క్షతగాత్రులను ఆదుకోవాలని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కోయిరాల అన్నారు. ప్రజల రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని విన్నవించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. క్షతగాత్రులతో నేపాల్ లోని ఆస్పత్రులు నిండిపోయాయి. ఆస్పత్రులకు తీసుకువస్తున్న వారిని బయటే ఉంచి చికిత్స అందజేస్తున్నారు. శనివారం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల 2200 మందికిపైగా మరణించారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. -
30 గంటల్లో 25 సార్లు కంపించిన భూమి!
ఖాట్మండు: నేపాల్‌లో పరిస్థితి దారుణాతిదారుణంగా ఉంది. క్షతగాత్రులను చూస్తుంటే మనసు కదిలిపోయిందని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఎంతో బాధతో చెప్పారు. నిన్న, ఈరోజు తెల్లవారుజామున వరుసగా అనేకసార్లు భూమి కంపించింది. గత 30 గంటల్లో నేపాల్‌లో 25 సార్లు భూమి కంపించింది. నేపాల్‌కు భవిష్యత్తులో భారీ భూకంపాల ముప్పు ఉందని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాజీ అధ్యక్షుడు హరీష్ గుప్తా చెప్పారు. నేపాల్ శిథిలాల నుంచి మృతదేహాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. ఒక్క నేపాల్ లోయలోనే వెయ్యి మంది చనిపోయినట్లు సమాచారం. మొత్తం 2123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఎవరెస్ట్ శిఖరంపై 18 మంది చనిపోయారు. భారత్‌లో భూకంపం దాటికి 67 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి కుటుంబాలకు మోదీ ప్రభుత్వం 2 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. నిన్న వచ్చిన భూకంపానికి నేపాల్ భూమి దద్దరిల్లింది. హిమాలయ పాదాల చెంత భారీ భూకంపం వస్తుందని హెచ్చరికలు నిజం చేస్తూ నిన్న విరుచుకుపడిన భూకంపానికి నేపాల్ నరకంగా మారింది. నేపాల్‌కు మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హరీష్ గుప్తా చెప్పారు. ఖట్మాండు నడిబొడ్డున ఠీవీగా తలెత్తుకొని కనిపించే రెండు శతాబ్దాల చరిత్ర గల కట్టడం దర్హారా టవర్ మరుభూమిలా మారిపోయింది. ఎంతో చారిత్రాక నేపధ్యం ఉన్న ఈ టవర్ భూకంపంలో పూర్తిగా నేలమట్టమైంది. తొమ్మిది అంతస్తుల దర్హారా కట్టడం కళ్లముందే కాలగర్భంలో కలిసిపోయింది. మిలటరీ అవసరాల కోసం, పరిసరాలపై నిఘా కోసం నిర్మించిన దర్హారా టవర్ నగరానికే ప్రధాన ఆకర్షణగా ఉండేది. 1832లో అప్పటి ప్రధానమంత్రి భీమ్సేన్ తపా ఆధ్వర్యంలో నిర్మాణమైన దర్హారా టవర్‌ను యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే ఇంత ఘనచరిత్ర ఉన్న శిఖరం ఇపుడు తుడిచిపెట్టుకుపోయింది. -
తీరు మారని నేపాల్ పార్టీలు
నేపాల్ రాజ్యాంగ నిర్ణాయక సభ అందరూ అంచనావేసినట్టే, ఆందోళనపడినట్టే ఆఖరి నిమిషంలో కూడా తీవ్ర గందరగోళంమధ్య బండి లాగిస్తోంది. కొత్త రాజ్యాంగం రూపకల్పనకు చివరాఖరి గడువుగా ఏడాదిక్రితం ప్రతినిధులు తమకు తాముగా నిర్ణయించిన ‘జనవరి 22’ కూడా ముగిసే క్షణాల్లో అది సభ్యుల నినాదాలతో మార్మోగుతున్నది. ప్రస్తుత ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా పదవీకాలం ముగుస్తుండటం... దేశంలో ఏ ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ఉండాలన్న అంశంలో అధికార, విపక్ష కూటముల మధ్య ఒక అంగీకారం కుదరకపోవడం పర్యవసానంగా ఇప్పుడక్కడ తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. కొయిరాలా ఖాళీచేయాల్సిన పదవిని ఎగరేసుకుపోవడానికి కూటమిలోని యూనిఫైడ్ మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీ చైర్మన్ కె.పి. శర్మ ఎత్తులు వేస్తుండగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయకూడదని నేపాలీ కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉంది. తమ అంతర్గత పోరునే చక్కదిద్దుకోలేని దుస్థితిలో పడిపోయిన పాలక కూటమి సభలో విపక్షం వేస్తున్న వీరంగాన్ని నిలువరించలేకపోతున్నది. నేపాల్ దాదాపు రెండు శతాబ్దాల హిందూ రాజరిక పాలనలో అన్నివిధాలా దెబ్బతింది. అవినీతి, అసమానతలు, ఆకలి, అనారోగ్యంవంటి రుగ్మతలతో కునారిల్లిన ఆ దేశంలో దశాబ్దంపాటు మావోయిస్టు పార్టీ సాయుధపోరాటాన్ని నడిపింది. చివరకు ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం తర్వాత ఆ పోరాటాన్ని విరమించడానికి 2006లో అంగీకరించింది. దేశంలో సంపూర్ణ గణతంత్ర వ్యవస్థను నెలకొల్పడమే ధ్యేయంగా రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పాటు చేయడం, కొత్త పార్లమెంటు ఏర్పడేవరకూ దాన్నే పార్లమెంటుగా పరిగణించడంవంటి అంశాల్లో ఏకాభిప్రాయం ఏర్పడ్డాక 2008లో ఆ సభకు ఎన్నికలు జరిగాయి. ప్రజల్లో గట్టి పట్టున్న మావోయిస్టులు 40 శాతం స్థానాలు కైవసం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ ప్రధాని అయ్యారు. రెండేళ్ల వ్యవధిలో రాజ్యాంగ రచన పూర్తిచేసి నూతన వ్యవస్థకు పురుడు పోసి ఈ సభ ముగిసిపోవాలని, ఆ వెంటనే పార్లమెంటుకు ఎన్నికలు జరగాలని ఆనాడు నిర్ణయించుకున్నారు. కానీ, ఆచరణలో అదంతా తారుమారైంది. నాయకుల మధ్య సమన్వయ లేమి... ప్రతి చిన్న విషయంలోనూ విభేదాలు ఆ సభను నిరర్ధకం చేశాయి. అందరికందరూ తమ మాటే చెల్లుబాటు కావాలని, తమ ప్రతిపాదనలే ఆమోదం పొందాలని చూడటంతో ఆ సభ విఫలమైంది. దాని గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోయినా ఫలితం శూన్యం. చివరకు 2012 జూన్‌లో ఆ సభ కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు, కొత్త రాజ్యాంగ సభకు ఎన్నికల వంటి అంశాలపై సైతం నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పడిన ఆపద్ధర్మ సర్కారు ఆ కార్యక్రమాలను పూర్తిచేయాల్సివచ్చింది. సహజంగానే 2013 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ గణనీయ సంఖ్యలో స్థానాలు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న సీపీఎన్-యూఎంఎల్తో కలిసి నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా ప్రధానిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. మావోయిస్టులు మూడో స్థానంతో సర్దుకోవాల్సివచ్చింది. గత సభ ఎందుకు విఫలమైందో, దేశం పట్ల తమ బాధ్యతేమిటో గుర్తించడంలో విఫలమైన నేపాల్ రాజకీయ పక్షాలు ఈ కొత్త సభలోనూ పాత పద్ధతులను వదులుకోలేదు. రాజ్యాంగ రచనా ప్రక్రియకు అవసరమైన కమిటీ కోసమని ప్రతిపాదించిన బిల్లును మావోయిస్టులు, వారి కూటమిలోని మాధేసీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓటింగ్ ద్వారా కాక ఏకాభిప్రాయంతో మాత్రమే అడుగు ముందుకేయాలంటున్నాయి. రాష్ట్రాల స్వరూప స్వభావాలపైనా, పాలనా విధానంపైనా స్పష్టమైన అంగీకారం కుదిరాకే రాజ్యాంగ రచనకు సంబంధించిన కమిటీ సంగతి తేల్చాలన్నది ఆ పార్టీల డిమాండు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉండాలన్న విషయంలో ఏకాభిప్రాయమున్నా దానికి ఎలాంటి ప్రాతిపదిక అవసరమో పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. దాదాపు వంద జాతులు, ఇంచుమించు అంతే సంఖ్యలో భాషలు ఉన్న నేపాల్‌లో జాతుల ప్రాతిపదికన కనీసం డజను రాష్ట్రాలను ఏర్పర్చాలన్నది మావోయిస్టు కూటమి పార్టీల నిశ్చితాభిప్రాయం. అలా అయినప్పుడే పాలనలో భిన్న జాతులకు చోటు లభించడం, వాటి ఆకాంక్షలు నెరవేరడం సాధ్యమవుతుందన్నది వారి వాదన. అయితే ఇది భవిష్యత్తులో వైషమ్యాలకు దారితీస్తుందని పాలక కూటమి అభిప్రాయపడుతున్నది. భౌగోళిక ప్రాతిపదికన, ఆర్థిక వెసులుబాటు ఆధారంగా మహా అయితే ఏడు రాష్ట్రాలు ఏర్పరిస్తే చాలన్నది వారి ఉద్దేశం. ఈ అంశం విషయమై తొలి రాజ్యాంగసభలోనే ఒక అవగాహన కుదరక ప్రతిష్టంభన ఏర్పడగా...అప్పట్లో ఏకాభిప్రాయం ఏర్పడిన సెక్యులరిజం అంశం కూడా ఇప్పుడు పెను సమస్యగా మారింది. దేశం సెక్యులర్ రిపబ్లిక్‌గా ఉండాలా...లేక హిందూ రాజ్యంగా ఉండాలా అనే చర్చ మొత్తం రాజ్యాంగ సభకే ఎసరుపెట్టేలా ఉంది. సెక్యులర్ రిపబ్లిక్‌పై 2006లో దాదాపు అన్ని ప్రధాన పక్షాలు అంగీకారానికొచ్చాయి. ఇప్పుడు అదంతా తారుమారైంది. అధికార కూటమి పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీల్లో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలుండటమే కాదు... హిందూ రాజ్యం ఏర్పాటు భావనకు మద్దతు పెరుగుతున్నది. అంగీకారం కుదిరిన అంశాలను తిరగదోడితే ఊరుకోబోమని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. మూడు కోట్లమంది జనాభా గల నేపాల్ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నా, దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నా, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నా దేశంలో సుస్థిర పాలన ఏర్పడటం అత్యవసరం. అది సాధ్యం కావాలంటే ముందు రాజ్యాంగ రచనా ప్రక్రియ ప్రారంభం కావాలి. నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైతే నేపాల్ మరోసారి పెను సంక్షోభంలో కూరుకుపోతుందని అధికార, విపక్షాలు రెండూ గ్రహించాలి. బాధ్యతగా వ్యవహరించాలి. -
'మృత్యువుతో పోరాటం చేస్తున్నాను'
ఖాట్మండ్: అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పూర్తైన తర్వాత నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా స్వదేశానికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నానని సుశీల్ కోయిరాల వెల్లడించారు. సుశీల్ కు న్యూయార్క్ లోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం నాలుకకు క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స జరిగింది. సుశీల్ కు ఐదు సెషన్ల రేడియో థెరపీ నిర్వహించారు. గత కొద్దికాలంగా మృత్యువు తో పోరాటం చేస్తున్నానని సుశీల్ తెలిపారు. నాలుకకు, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వ్యాధి సోకినా అధైర్య పడలేదని సుశీల్ కోయిరాలా మీడియాకు వెల్లడించారు. -
నేపాల్ ప్రధానిగా కొయిరాలా
కఠ్మాండు: నేపాల్ రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. భారత్‌లో 16 ఏళ్లు స్వచ్ఛంద ప్రవాసమున్న నేపాలీ కాంగ్రెస్ అగ్రనేత సుశీల్ కొయిరాలా(74) సోమవారం పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్-యూఎంఎల్ మద్దతుతో ప్రధానిగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో తలపండిన సుశీల్‌కు పాలనలో మాత్రం ఎలాంటి అనుభవమూ లేదు. 601 స్థానాలున్న పార్లమెంటులో జరిగిన ఎన్నికలో ఏకైక అభ్యర్థి అయిన ఆయనకు అనుకూలంగా 405 ఓట్లు వచ్చాయి. 2008లో నేపాల్‌లో రాజరికం రద్దయ్యాక ప్రధాని పదవి చేపట్టిన ఆరో వ్యక్తి సుశీల్. గత ఏడాది చివర్లో జరిగిన రాజ్యాంగ అసెంబ్లీ ఎన్నికల్లో 194 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)అతిపెద్ద పార్టీగా అవతరించడం తెలిసిందే. 173 సీట్లు గెలుచుకున్న సీపీఎన్-యూఎంఎల్.. ఎన్సీతో కుదుర్చుకున్న ఆరు సూత్రాల ఒప్పందం కింద సుశీల్ ప్రధాని కావడానికి మద్దతిచ్చింది. పార్లమెంటులో ఓటింగ్ తర్వాత సుశీల్ మాట్లాడుతూ ఏడాదిలోగా కొత్త రాజ్యాంగాన్ని ప్రకటి ంచేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. కాగా, ప్రధానిగా సుశీల్ ఎన్నికవడం నేపాల్ ప్రజాస్వామ్య బలోపేతంలో మైలురాయిలాంటి పరిణామమని భారత ప్రధాని మన్మోహన్ తన సందేశంలో పేర్కొన్నారు. సుశీల్ కొయిరాలా తూర్పు నేపాల్‌లోని బిరాట్‌నగర్‌లో జన్మించారు. మాజీ ప్రధాని గిరిజా ప్రసాద్ కొయిరాలాకు ఆయన సమీప బంధువు. సుశీల్ నిరాడంబరుడిగా, ఆదర్శవాదిగా పేరొందారు. 1960లో అప్పటి నేపాల్ రాజు ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేసినప్పుడు సుశీల్ భారత్ చేరుకున్నారు. నేపాల్, భారత్‌లలో వివిధ సందర్భాల్లో ఆరేళ్లు జైల్లో గడిపారు. అవివాహితుడైన ఆయన గత ఏడాది గొంతు కేన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు. -
నేపాల్ కొత్త ప్రధానిగా సుశీల్ కోయిరాలా
కాఠ్మాండ్: నేపాల్ కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కోయిరాలా ఎన్నికైయ్యారు. తన పార్టీకి మెజారిటీ లేకపోయినా , పార్లమెంట్ లో కోయిరాలకు మూడింట రెండొంతులు బలం ఉండటంతో ఆయన ప్రధానిగా ఎన్నికైయ్యారు. దీంతో గత సంవత్సరం కాలంగా ఉన్న రాజకీయ స్తబ్ధతకు తెరపడింది. కోయిరాలకు సీపీఎన్-యూఎమ్ఎల్ అండగా నిలబడటంతో అతని ఎన్నిక ఖాయమైంది. 405 మంది సభ్యులు కోయిరాలకు అనుకూలంగా ఓటేయడంతో ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగుమైంది. కాగా, యూసీపీఎన్-మావోయిస్టు పార్టీ, నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలతో సహా కొన్ని పార్టీలు కోయిరాలాకు వ్యతిరేకంగా ఓటేశాయి. -
నేపాల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నేపాలీ కాంగ్రెస్
కఠ్మాండు: నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇటీవల ముగిసిన ప్రత్యక్ష ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన నేపాలీ కాంగ్రెస్, తాజాగా జరిగిన దామాషా ఓటింగ్‌లోనూ తొలిస్థానంలో నిలిచింది. దామాషా పద్ధతిన మొత్తం 93,77,519 ఓట్లు ఉండగా, సుశీల్ కొయిరాలా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌కు 24,21,252 ఓట్లు లభించాయి. ఝాలానాథ్ ఖనాల్ నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ పార్టీ 22,43,447 ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. ప్రచండ నేతృత్వంలోని యూసీపీఎన్-మావోయిస్టు పార్టీ 14,38,666 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ప్రత్యక్ష ఎన్నికలు 240 స్థానాలకు జరగగా, నేపాలీ కాంగ్రెస్‌కు 105, సీపీఎన్-యూఎంఎల్‌కు 91, యూసీపీఎన్-మావోయిస్టు పార్టీకి 26 స్థానాలు లభించించగా, చిల్లర పార్టీలకు 18 స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. దామాషా ఓట్ల ప్రకారం 335 మంది సభ్యులను ఎన్నుకోనుండగా, మిగిలిన 26 స్థానాలకు ప్రభుత్వమే సభ్యులను నామినేట్ చేస్తుంది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ నేతలు చర్చలు ప్రారంభించారు.