కఠ్మాండులోని త్రిభువన్ ఎయిర్పోర్టు నుంచి భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామాగ్రిని తరలిస్తున్న భారత్ సైన్యం (ఫైల్ ఫొటో)
భూకంపం సంభవించగానే నేపాల్ ప్రభుత్వం కంటే ముందుగా స్పందించి.. శిథిలాల తొలిగింపు, బాధితుల తరలింపు కార్యక్రమాల్ని చేపట్టిన భారత్ చర్యలు ఆ దేశ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాయా? నేపాల్- చైనా సంబంధాలపై ప్రభావం చూపేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నాయి నేపాల్ మావోయిస్టు పార్టీలు! భూకంపం అనంతర పరిణామాలపై నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా నేతృత్వంలో శనివారం కఠ్మాండులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో యూసీపీఎన్ (యూనైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- మావోయిస్టు) ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. భూకంప బాధితులకు సహాయం పేరుతో భారత సైన్యం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని, వారి చర్యలు నేపాల్ అంతర్గత భద్రతను ప్రమాదకర స్థితిలోకి నెట్టేవిగా ఉన్నాయని, ఈ విషయంలో భారత సైన్యానికి తగిన మార్గదర్శకాలు సూచించాలని యూసీపీఎన్ కూటమి అధ్యక్షుడు పుష్ప కమల్ దహాల్, మోహన్ బైద్య, మజ్దూర్ కిసాన్ పార్టీ నాయకుడు నారాయణ్ మాన్.. ప్రధాని కోయిరాలాకు సూచించినట్లు నేపాల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.
త్రిభువన్ ఎయిర్పోర్టు, నేపాల్- చైనా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే భారత సైన్యం కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ఇది నేపాల్- చైనా మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని కమ్యూనిస్టు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మీడియాలో వినవస్తోన్న వార్తల్లో నిజం లేదని, నేపాల్ ప్రభుత్వం ఆదేశాలమేరకే ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం పనిచేస్తున్నదని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. నేపాల్కు భారత్ అందించేది స్నేహహస్తమేనని విదేశాంగ కార్యదర్శి జైశంకర్ అన్నారు.