నేపాల్ ప్రధానిగా కొయిరాలా
కఠ్మాండు: నేపాల్ రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. భారత్‌లో 16 ఏళ్లు స్వచ్ఛంద ప్రవాసమున్న నేపాలీ కాంగ్రెస్ అగ్రనేత సుశీల్ కొయిరాలా(74) సోమవారం పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్-యూఎంఎల్ మద్దతుతో ప్రధానిగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో తలపండిన సుశీల్‌కు పాలనలో మాత్రం ఎలాంటి అనుభవమూ లేదు. 601 స్థానాలున్న పార్లమెంటులో జరిగిన ఎన్నికలో ఏకైక అభ్యర్థి అయిన ఆయనకు అనుకూలంగా 405 ఓట్లు వచ్చాయి. 2008లో నేపాల్‌లో రాజరికం రద్దయ్యాక ప్రధాని పదవి చేపట్టిన ఆరో వ్యక్తి సుశీల్. గత ఏడాది చివర్లో జరిగిన రాజ్యాంగ అసెంబ్లీ ఎన్నికల్లో 194 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)అతిపెద్ద పార్టీగా అవతరించడం తెలిసిందే.
173 సీట్లు గెలుచుకున్న సీపీఎన్-యూఎంఎల్.. ఎన్సీతో కుదుర్చుకున్న ఆరు సూత్రాల ఒప్పందం కింద సుశీల్ ప్రధాని కావడానికి మద్దతిచ్చింది. పార్లమెంటులో ఓటింగ్ తర్వాత సుశీల్ మాట్లాడుతూ ఏడాదిలోగా కొత్త రాజ్యాంగాన్ని ప్రకటి ంచేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. కాగా, ప్రధానిగా సుశీల్ ఎన్నికవడం నేపాల్ ప్రజాస్వామ్య బలోపేతంలో మైలురాయిలాంటి పరిణామమని భారత ప్రధాని మన్మోహన్ తన సందేశంలో పేర్కొన్నారు.
సుశీల్ కొయిరాలా తూర్పు నేపాల్‌లోని బిరాట్‌నగర్‌లో జన్మించారు. మాజీ ప్రధాని గిరిజా ప్రసాద్ కొయిరాలాకు ఆయన సమీప బంధువు. సుశీల్ నిరాడంబరుడిగా, ఆదర్శవాదిగా పేరొందారు.
1960లో అప్పటి నేపాల్ రాజు ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేసినప్పుడు సుశీల్ భారత్ చేరుకున్నారు. నేపాల్, భారత్‌లలో వివిధ సందర్భాల్లో ఆరేళ్లు జైల్లో గడిపారు.
అవివాహితుడైన ఆయన గత ఏడాది గొంతు కేన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు.