సుశీల్ కొయిరాలా
నేపాల్ రాజ్యాంగ నిర్ణాయక సభ అందరూ అంచనావేసినట్టే, ఆందోళనపడినట్టే ఆఖరి నిమిషంలో కూడా తీవ్ర గందరగోళంమధ్య బండి లాగిస్తోంది. కొత్త రాజ్యాంగం రూపకల్పనకు చివరాఖరి గడువుగా ఏడాదిక్రితం ప్రతినిధులు తమకు తాముగా నిర్ణయించిన ‘జనవరి 22’ కూడా ముగిసే క్షణాల్లో అది సభ్యుల నినాదాలతో మార్మోగుతున్నది. ప్రస్తుత ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా పదవీకాలం ముగుస్తుండటం... దేశంలో ఏ ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ఉండాలన్న అంశంలో అధికార, విపక్ష కూటముల మధ్య ఒక అంగీకారం కుదరకపోవడం పర్యవసానంగా ఇప్పుడక్కడ తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. కొయిరాలా ఖాళీచేయాల్సిన పదవిని ఎగరేసుకుపోవడానికి కూటమిలోని యూనిఫైడ్ మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీ చైర్మన్ కె.పి. శర్మ ఎత్తులు వేస్తుండగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయకూడదని నేపాలీ కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉంది. తమ అంతర్గత పోరునే చక్కదిద్దుకోలేని దుస్థితిలో పడిపోయిన పాలక కూటమి సభలో విపక్షం వేస్తున్న వీరంగాన్ని నిలువరించలేకపోతున్నది.
నేపాల్ దాదాపు రెండు శతాబ్దాల హిందూ రాజరిక పాలనలో అన్నివిధాలా దెబ్బతింది. అవినీతి, అసమానతలు, ఆకలి, అనారోగ్యంవంటి రుగ్మతలతో కునారిల్లిన ఆ దేశంలో దశాబ్దంపాటు మావోయిస్టు పార్టీ సాయుధపోరాటాన్ని నడిపింది. చివరకు ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం తర్వాత ఆ పోరాటాన్ని విరమించడానికి 2006లో అంగీకరించింది. దేశంలో సంపూర్ణ గణతంత్ర వ్యవస్థను నెలకొల్పడమే ధ్యేయంగా రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పాటు చేయడం, కొత్త పార్లమెంటు ఏర్పడేవరకూ దాన్నే పార్లమెంటుగా పరిగణించడంవంటి అంశాల్లో ఏకాభిప్రాయం ఏర్పడ్డాక 2008లో ఆ సభకు ఎన్నికలు జరిగాయి. ప్రజల్లో గట్టి పట్టున్న మావోయిస్టులు 40 శాతం స్థానాలు కైవసం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ ప్రధాని అయ్యారు. రెండేళ్ల వ్యవధిలో రాజ్యాంగ రచన పూర్తిచేసి నూతన వ్యవస్థకు పురుడు పోసి ఈ సభ ముగిసిపోవాలని, ఆ వెంటనే పార్లమెంటుకు ఎన్నికలు జరగాలని ఆనాడు నిర్ణయించుకున్నారు. కానీ, ఆచరణలో అదంతా తారుమారైంది. నాయకుల మధ్య సమన్వయ లేమి... ప్రతి చిన్న విషయంలోనూ విభేదాలు ఆ సభను నిరర్ధకం చేశాయి. అందరికందరూ తమ మాటే చెల్లుబాటు కావాలని, తమ ప్రతిపాదనలే ఆమోదం పొందాలని చూడటంతో ఆ సభ విఫలమైంది. దాని గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోయినా ఫలితం శూన్యం. చివరకు 2012 జూన్‌లో ఆ సభ కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు, కొత్త రాజ్యాంగ సభకు ఎన్నికల వంటి అంశాలపై సైతం నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పడిన ఆపద్ధర్మ సర్కారు ఆ కార్యక్రమాలను పూర్తిచేయాల్సివచ్చింది. సహజంగానే 2013 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ గణనీయ సంఖ్యలో స్థానాలు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న సీపీఎన్-యూఎంఎల్‌తో కలిసి నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా ప్రధానిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. మావోయిస్టులు మూడో స్థానంతో సర్దుకోవాల్సివచ్చింది.
గత సభ ఎందుకు విఫలమైందో, దేశం పట్ల తమ బాధ్యతేమిటో గుర్తించడంలో విఫలమైన నేపాల్ రాజకీయ పక్షాలు ఈ కొత్త సభలోనూ పాత పద్ధతులను వదులుకోలేదు. రాజ్యాంగ రచనా ప్రక్రియకు అవసరమైన కమిటీ కోసమని ప్రతిపాదించిన బిల్లును మావోయిస్టులు, వారి కూటమిలోని మాధేసీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓటింగ్ ద్వారా కాక ఏకాభిప్రాయంతో మాత్రమే అడుగు ముందుకేయాలంటున్నాయి. రాష్ట్రాల స్వరూప స్వభావాలపైనా, పాలనా విధానంపైనా స్పష్టమైన అంగీకారం కుదిరాకే రాజ్యాంగ రచనకు సంబంధించిన కమిటీ సంగతి తేల్చాలన్నది ఆ పార్టీల డిమాండు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉండాలన్న విషయంలో ఏకాభిప్రాయమున్నా దానికి ఎలాంటి ప్రాతిపదిక అవసరమో పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. దాదాపు వంద జాతులు, ఇంచుమించు అంతే సంఖ్యలో భాషలు ఉన్న నేపాల్‌లో జాతుల ప్రాతిపదికన కనీసం డజను రాష్ట్రాలను ఏర్పర్చాలన్నది మావోయిస్టు కూటమి పార్టీల నిశ్చితాభిప్రాయం. అలా అయినప్పుడే పాలనలో భిన్న జాతులకు చోటు లభించడం, వాటి ఆకాంక్షలు నెరవేరడం సాధ్యమవుతుందన్నది వారి వాదన. అయితే ఇది భవిష్యత్తులో వైషమ్యాలకు దారితీస్తుందని పాలక కూటమి అభిప్రాయపడుతున్నది. భౌగోళిక ప్రాతిపదికన, ఆర్థిక వెసులుబాటు ఆధారంగా మహా అయితే ఏడు రాష్ట్రాలు ఏర్పరిస్తే చాలన్నది వారి ఉద్దేశం. ఈ అంశం విషయమై తొలి రాజ్యాంగసభలోనే ఒక అవగాహన కుదరక ప్రతిష్టంభన ఏర్పడగా...అప్పట్లో ఏకాభిప్రాయం ఏర్పడిన సెక్యులరిజం అంశం కూడా ఇప్పుడు పెను సమస్యగా మారింది. దేశం సెక్యులర్ రిపబ్లిక్‌గా ఉండాలా...లేక హిందూ రాజ్యంగా ఉండాలా అనే చర్చ మొత్తం రాజ్యాంగ సభకే ఎసరుపెట్టేలా ఉంది. సెక్యులర్ రిపబ్లిక్‌పై 2006లో దాదాపు అన్ని ప్రధాన పక్షాలు అంగీకారానికొచ్చాయి. ఇప్పుడు అదంతా తారుమారైంది. అధికార కూటమి పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీల్లో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలుండటమే కాదు... హిందూ రాజ్యం ఏర్పాటు భావనకు మద్దతు పెరుగుతున్నది. అంగీకారం కుదిరిన అంశాలను తిరగదోడితే ఊరుకోబోమని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. మూడు కోట్లమంది జనాభా గల నేపాల్ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నా, దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నా, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నా దేశంలో సుస్థిర పాలన ఏర్పడటం అత్యవసరం. అది సాధ్యం కావాలంటే ముందు రాజ్యాంగ రచనా ప్రక్రియ ప్రారంభం కావాలి. నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైతే నేపాల్ మరోసారి పెను సంక్షోభంలో కూరుకుపోతుందని అధికార, విపక్షాలు రెండూ గ్రహించాలి. బాధ్యతగా వ్యవహరించాలి.