కోపగించిన నేపాల్!
ఆపదలు చుట్టిముట్టినప్పుడు బాధితులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూడటం ఎంత సహజమో... పిలుపు కోసం ఎదురుచూడకుండా ముందుకు ఉరకడం మానవతావాదులకు కూడా అంతే సహజం. తొమ్మిదిరోజులక్రితం నేపాల్‌లో భూకంపం విలయం సృష్టించాక మన దేశంతోసహా ఎన్నో దేశాలు అలాంటి మానవతా దృక్పథంతోనే రంగంలోకురికాయి. తమ తమ బృందాలను హుటా హుటీన ఆ దేశానికి తరలించాయి. శిథిలాలకింద చిక్కుకున్నవారి ఆచూకీని కనుగొని రక్షించడంపైనా, అలాంటివారికి వెంటనే వైద్యసాయం అందించడంపైనా, ఆహార పదార్థాలు చేరేయడంపైనా దృష్టి కేంద్రీకరించాయి. ఎనిమిది రోజుల తర్వాత కూడా శిథిలాలకింద సజీవంగా ఉన్నవారిని గుర్తించి కాపాడాయి. తక్షణ వైద్య సాయం అందాల్సిన వారిని హెలికాప్టర్లలో తరలించాయి. అయితే ఇదంతా సవ్యంగానే జరిగిందనుకోవడానికి లేదు. కఠ్మాండూలో అందినంత వేగంగా దేశంలోని మారు మూల ప్రాంతాలకు సాయం చేరలేదు. సర్వం ధ్వంసమైన ఆ ప్రాంతాలకు చేరుకునేందుకు ఎలాంటి దారీ లేకపోవడం నిజమే అయినా అది మాత్రమే ఏకైక కారణం కాదు. అష్టకష్టాలూ పడి మారుమూల ప్రాంతాలకు వెళ్లే కన్నా మీడియా దృష్టిలో పడటానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం మంచిదనుకునేవారు చాలామందే ఉంటారు. పర్యవసానంగా రోజులు గడుస్తున్నా తమను పట్టించుకున్న వారు లేరని, పస్తులతో అలమటించవలసివస్తున్నదని ఆ దేశ ప్రధాని కొయిరాలా ముందే పలువురు ఆగ్రహం వ్యక్తంచేయడం చానెళ్లు చూసినవారందరికీ కనబడింది. నేపాల్‌లో వచ్చిన భూకంపం సామాన్యమైనది కాదు. రిక్టర్ స్కేల్‌పై 7.9గా నమోదైన ఆ భూ ప్రళయం మిగిల్చిన విషాదం మాటలకందనిది. ఇళ్లు, భవనాలు కూలిపోయి 7,400మంది వరకూ మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదని చెబుతున్నారు. అయితే ఈ విషాదాన్ని ఆసరా చేసుకుని తమ దేశాన్ని చిన్నబుచ్చేలా మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయని నేపాల్ పౌరులు కొన్ని రోజులుగా ఆవేదనపడుతున్నారు. ఆ ఆవేదనంతా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 60,000 ట్వీట్లు వెలువడ్డాయి. అందులో నిజం లేకపోలేదు. అసలు నేపాల్‌లో వచ్చిన భూకంపం గురించి మన ప్రధాని మోదీ చెప్పేవరకూ ఆ దేశ ప్రధానికి తెలియదనేంత స్థాయిలో ప్రచారం సాగింది. మిగిలిన దేశాలకంటే మన బృందాలే సాయం అందించడంలో ముందుంటున్నాయన్నదీ ఇలాంటిదే. మన దళాలు అందిస్తున్న సాయం గురించీ, వారి కృషి కారణంగా ఆపదనుంచి బయటపడినవారి గురించీ చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. పోలిక తీసుకొచ్చినప్పుడూ, మిగిలినవారంతా వెనబడ్డారని చెప్పినప్పుడూ సమస్య వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ భూకంపం వచ్చిన గంటలోపే నేపాల్ ప్రధానితో మాట్లాడటంతోపాటు శాయశక్తులా ఆదుకుంటామని చెప్పడమేకాక వెనువెంటనే ‘ఆపరేషన్ మైత్రి’ పేరిట సైన్యాన్ని, ఇతర సిబ్బందిని తరలించే ఏర్పాటుచేశారు. ఇలాంటి చర్యలన్నీ ఆ దేశ ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చాయనడంలో సందేహం లేదు. ఆ సంగతిని ఢిల్లీలోని నేపాల్ రాయబారి కూడా చెప్పారు. సాయం పొందినవారు మన గురించి అలా ఎంత చెప్పినా...ఏమేం చేస్తున్నామో మనమే చెప్పుకున్నా అభ్యంతరం ఉండదు. కానీ వైపరీత్యాన్ని ఎదుర్కోవడంలో మిగిలిన దేశాలన్నిటికన్నా మనమే అగ్రభాగాన ఉన్నామని ప్రకటించడం మాత్రం ఇబ్బందికరమైనది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజూ అలా చెప్పగానే దాన్ని ఖండించడానికన్నట్టు నేపాల్‌లోని మీడియా మన సైనిక బృందాలు ఎవరెస్టుపై చిక్కుకున్న 39మంది సైనికుల్ని కాపాడటంపైనే దృష్టిపెట్టాయని విమర్శించింది. మన వైద్య బృందాలు భారత దౌత్యకార్యాలయంలో శిబిరాన్ని ఏర్పాటుచేస్తే ఇజ్రాయెల్ వంటి దేశాలు దెబ్బతిన్న ప్రాంతాలకే వెళ్లి చికిత్స అందించాయని తెలిపింది.
ప్రకృతి వైపరీత్యాలు అందునా భూకంపం వంటివి భౌతిక విధ్వంసాన్నే కాదు...మానసిక కుంగుబాటును కూడా తీసుకొస్తాయి. అందునా చుట్టూ వేరే దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న నేపాల్ వంటి పేద దేశానికి భూకంపం వంటి వైపరీత్యాలు తెచ్చే కష్టనష్టాలు అపారంగా ఉంటాయి. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియని ప్రభుత్వ యంత్రాంగం స్తబ్దుగా ఉండిపోతుంది. వీటిపై మీడియాలో వెలువడిన కథనాలు కూడా అక్కడి పౌరులకు మనస్థాపం కలిగించాయి. బాధితులను ప్రశ్నలడిగిన తీరు, వారి గురించి చేసిన వ్యాఖ్యానాలు కోపం తెప్పించాయి. అందుకే మన మీడియాకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో భారీయెత్తున ప్రచారం సాగింది. తమపై భారత్ పెద్దన్న తరహాలో పెత్తనం చలాయించాలని చూస్తున్నదని సాధారణ పరిస్థితుల్లోనే నేపాల్ పౌరులు విశ్వసించేవారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నేపాల్‌పై ఏదో వ్యాఖ్యానించాడని కథనం వెలువడగానే కొన్నేళ్లక్రితం ఆ దేశంలోని భారత వ్యాపార సంస్థలపై దాడులు చోటుచేసుకున్నాయి. నేపాల్‌కు సంబంధించినంత వరకూ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకపోవడంవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. వైపరీత్యం సంభవించి ఎనిమిదిరోజులు దాటినందున ఇక తమకు రక్షణ బృందాల అవసరం లేదని, అలాంటి బృందాలన్నీ వెళ్లిపోవాలని తాజాగా నేపాల్ తాఖీదిచ్చింది. ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదని, ఇక పునరావాసంపై దృష్టిపెట్టాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని అక్కడి ప్రభుత్వం చెబుతున్నది. ఇది అన్ని దేశాలకూ వర్తిస్తుందన్నది నిజమే అయినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే నేపాల్ తాజా నిర్ణయం తీసుకున్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇందులో ఎంత నిజమున్నదన్న సంగతిని పక్కనబెట్టి వైపరీత్యాల సమయంలో సున్నితంగా వ్యవహరించడం, అవతలివారి మనో భావాలను గౌరవించడం అవసరమని అందరూ గుర్తించాలి.