నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 53 మంది మృతి చెందారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని ఢిల్లీ, బీహార్‌లోనూ కనిపించింది. బీహార్‌లో పట్నా, సమస్తీపూర్, సీతామర్హి తదితర జిల్లాల్లో కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. ఈ నేపధ్యంలో 90 ఏళ్ల క్రితం బీహార్‌లో సంభవించిన భారీ భూకంపం గురించి తమ పూర్వీకులు చెప్పిన విషయాలను స్థానికులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
1934 జనవరి 15న బీహార్‌లో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆనవాళ్లు ఇప్పటికీ బీహార్‌లో కనిపిస్తాయి. తాజాగా భూకంపం సంభవించిన దరిమిలా 90 ఏళ్ల క్రితం నాటి బీతావహ భూకంపం జ్ఞాపకాలను స్థానికులు గుర్తుచేసుకున్నారు. బీహార్ ప్రాంతం భూకంపాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. 1934లో సంభవించిన భూకంపం కారణంగా బీహార్ మొత్తం ధ్వంసమైంది. నాటి ఆ భూకంపం మధుబని జిల్లాలోని రాజ్‌నగర్‌ను శిథిలాల నగరంగా మార్చివేసింది. కోసి ప్రాంతంలో రైలు కనెక్టివిటీ విధ్వంసానికి గురైంది. నేటికీ ఇక్కడ నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి.
బీహార్‌లో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. 1764, 1833లో బీహార్ ప్రాంతంలో భూకంపాలు సంభవించినట్లు చరిత్ర చెబుతోంది. బీహార్‌లో 1988, ఆగస్టు 21న 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే 1934లో 8.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. బీహార్‌లో భూకంప ప్రభావంపై నిపుణులు(Experts) అధ్యయనం చేసినప్పుడు ముజఫర్‌పూర్, దర్భంగా, ముంగేర్ వంటి జిల్లాల్లో ప్రకంపనలు అధికంగా వచ్చాయని వెల్లడయ్యింది.
1934లో సంభవించిన భూకంపం కారణంగా దర్భంగాలో 1,839 మంది, ముజఫర్‌పూర్‌లో 1,583, ముంగేర్‌లో 1,260 మంది మృతిచెందారు. మొత్తంగా 7253 మంది మృతిచెందారు. దాదాపు 3,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూకంప ప్రభావం కనిపించింది. నాటి భూకంపం తీవ్రతకు రాజ్‌నగర్ నగరం పూర్తిగా శిథిలమయ్యింది. ఇప్పటికీ ఈ నగరాన్ని శిథిలాల నగరం అని పిలుస్తారు. నాటి భూకంపంలో దేశంలోని మూడు అత్యుత్తమ ప్యాలెస్‌లలో ఒకటైన రాజ్‌నగర్‌లోని రామేశ్వర్ విలాస్ ప్యాలెస్(Rameshwar Vilas Palace) పూర్తిగా ధ్వంసమైంది.
బీహార్‌లో భూకంపాలు అనేకసార్లు విధ్వంసం సృష్టించాయి. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఎప్పుడైనా పెద్ద ఎత్తున భూకంపాలు సంభవించవచ్చనే ఆందోళనను వ్యక్తం చేశారు. బీహార్‌లోని ప్రతి జిల్లాకు భూకంపం ముప్పు పొంచి ఉంది. 38 జిల్లాల్లో ఎనిమిది జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా భావించే జోన్-5లో ఉన్నాయి. ఇక్కడ ఎత్తయిన భవనాలను నిర్మించడాన్ని నిషేధించారు.
ఇది కూడా చదవండి: నాడు సస్పెండ్.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్ కృష్ణ?
Comments
Please login to add a commentAdd a comment