నేపాల్ సర్వతోముఖాభివృద్ధికి సాయం
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: భారత్-నేపాల్‌ల మధ్య గత నాలుగు నెలలుగా చెదిరిన ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడినపెట్టే దిశగా ఇరు దేశాలు విస్తృత చర్చలు చేపట్టాయి. రవాణా, విద్యుత్ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తొమ్మిది అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ నుంచి నేపాల్‌కు 80 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే 400 కేవీ ధాల్కేబార్-ముజఫర్‌పూర్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఇద్దరూ జాతికి అంకితం చేశారు.
అనంతరం ఓలీ సమక్షంలో మోదీ మీడియాతో మాట్లాడుతూ నేపాల్‌లో శాంతి, సుస్థిరత వెల్లివిరియాలని కోరుకుంటున్నామని ఆ దేశ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధమని చెప్పారు. ఓలీ మాట్లాడుతూ భారత్ ఎప్పటికీ తమ సన్నిహిత మిత్ర దేశంగా ఉంటుందన్నారు. ప్రధానితో భేటీకి ముందు ఓలీతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు. భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్‌కు గతంలో ప్రకటించిన 100 కోట్ల డాలర్లలో భాగంగా 25 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం విడుదల, భారత్‌తో సరిహద్దుగల తెరాయ్ ప్రాంతంలో 518 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, నేపాల్ బంగ్లాదేశ్‌ల మధ్య విశాఖపట్నం పోర్టు ద్వారా వర్తకం. విశాఖపట్నం నుంచి రైలు రవాణా మార్గం మొదలైన అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.