నేపాల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
నేపాల్ ప్రధాని దేవ్‌బాతో భేటీలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేపాల్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ హామీనిచ్చారు. నేపాల్æప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాతో గురువారం మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం, భూకంపాల తర్వాత హిమాలయన్ దేశాల్లో పునర్నిర్మాణం వంటి ఎనిమిది అంశాలపై వీరిద్దరూ ఒప్పందం చేసుకున్నారు.
భారత్–నేపాల్‌ల మధ్య ఉన్న ఓపెన్ సరిహద్దు దుర్వినియోగం కాకుండా ఇరుదేశాల భద్రత, రక్షణ బలగాలు ఒకరినొకరు సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. దీనికి దేవ్‌బా స్పందిస్తూ ప్రతి విషయంలోనూ భారత్‌కు సహకారం అందిస్తామని, ఓపెన్ సరిహద్దు ఉన్నప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగనివ్వమని హామీనిచ్చారు. సమావేశానంతరం ఇద్దరు నేతలు విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ దేవ్‌బాతో సమావేశం సుహృద్భావ వాతావరణంలో చక్కగా జరిగిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ, భద్రత అంశాలు ఎంతో కీలకమైనవిగా అభిప్రాయపడ్డారు. అనంతరం కటైయా–కుసాహ, రాక్సల్–పర్వానీపూర్ సరిహద్దుల ప్రాంతాల మధ్య విద్యుత్ రవాణా లైన్లను ప్రారంభించారు.