రద్దయిన నోట్లు (ఫైల్ ఫోటో)
కాఠ్మాండు : రద్దయిన పెద్ద నోట్లు నేపాల్‌లో ఇంకా భారీగా ఉన్నట్టు తెలిసింది. ఈ వారంలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, తమ వద్దనున్న లక్షల కొద్దీ రద్దయిన భారత నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో మన దేశ అధికారులతో చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాత, నేపాల్ ప్రజల వద్ద, అధికారిక రంగాల్లో సుమారు రూ.950 కోట్ల రద్దయిన భారత బ్యాంకు నోట్లు ఉన్నట్టు అంచనాలు వెలువడ్డాయి. ఈ నోట్లను ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలనే విషయంలో నేపాల్, భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నేపాల్ ప్రజల వద్ద భారీగా రద్దయిన పెద్ద నోట్లు ఉన్నట్టు తెలిసింది.
అవినీతికి వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీ నోట్లకు, ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే భారత్ కరెన్సీని ఎక్కువగా వాడుతున్న నేపాల్, భూటాన్ దేశాలు ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. భారత డిమానిటైజేషన్ నిర్ణయం నేపాలీ దేశస్తులను తీవ్రంగా బాధించిందని, ఇప్పటికే పలుమార్లు భారతీయ నేతలతో ఈ విషయంపై చర్చించామని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని పీఎం ఓలీ నేపాల్ పార్లమెంట్‌కు తెలిపారు.
శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే భారత పర్యటనలో నేపాల్ ప్రధాని ఓలీ, మన ప్రధాని నరేంద్రమోదీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను, ఇతర అధికారులను కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్య చర్చల్లో భాగంగా రద్దయిన నోట్ల విషయం గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. నోట్ల ఎక్స్చేంజ్ చేసుకుంటామని ఆర్‌బీఐ మాటిచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక చర్చలు జరుగలేదని సెంట్రల్ నేపాల్ రాష్ట్ర బ్యాంకు గవర్నర్ చింతా మనీ శివకోటి చెప్పారు. ఆర్‌బీఐ, నేపాల్ లేదా మరే ఇతర దేశాల నుంచి పాత కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోలేదని మన దేశ సీనియర్ అధికారులు చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో దీనిపై ఎలాంటి ప్రొవిజన్లను రూపొందించలేదని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని, భారత ప్రధానితో భేటీ అయి, ఈ విషయంపై చర్చించబోతున్నారు.
నేపాల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. భారత కరెన్సీని నేపాలీ ప్రజలు, వ్యాపారస్తులు అధికంగా వాడతారు. అయితే ఒక్కసారిగా మోదీ డిమానిటైజేషన్ ప్రకటించడంతో, భారత కరెన్సీ నోట్లను ఇళ్లలో పొదుపు చేసుకున్న నేపాలీ ప్రజలపై ఈ ప్రభావం అధికంగా పడింది.
Comments
Please login to add a commentAdd a comment