నేపాల్ ప్రధానిపై అవిశ్వాసం
కఠ్మాండు : నేపాల్ ప్రధాని ఓలిపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో సీపీఎన్-యూఎంఎల్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలోపడడం తెలిసిందే. దీంతో మావోయిస్టు సెంటర్ మంత్రులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఓలి తాను పదవి నుంచి వైదొలగనని, పార్లమెంటులోనే తేల్చుకుంటానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టు సెంటర్, నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ), సీపీఎన్ (యునెటైడ్).. ఓలీపై నేపాల్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఓటింగ్ వచ్చే వారం జరిగే అవకాశం ఉంది. కాగా 601 మంది సభ్యులు గల పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు మూడింటికి కలిపి 292 మంది సభ్యులున్నారు. ఓలికి పార్టీ యూఎంఎల్‌కి 175 మంది సభ్యులున్నారు. తీర్మానం గట్టెక్కడానికి 299 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే 50 మంది సభ్యులు గల ఆరు మధేసి పార్టీలు అవిశ్వాసానికి మద్దతిస్తామన్నాయి.