మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్.. ఏం మాట్లాడారు?
మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్.. ఏం మాట్లాడారు?
Published Tue, Nov 15 2016 5:38 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
ఖాట్మండు : భారత్లో పెద్దనోట్ల రద్దుతో నేపాల్ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆ దేశ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహాల్), మన ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద బ్యాంకు నోట్లు నేపాల్ ప్రజల దగ్గర పెద్ద మొత్తంలో ఉన్నాయని, వాటిని మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రచండ కోరారు. ఐదు నిమిషాల పాటు జరిపిన ఈ టెలిఫోనిక్ సంభాషణలో పెద్ద మొత్తంలో నేపాల్ ప్రజలు కలిగి ఉన్న పెద్ద నోట్ల కట్టలు, వాటివల్ల వారికి ఎదురవుతున్న కష్టాలను ప్రచండ, మోదీతో చర్చించారు. వేలకొలది నేపాలీ ప్రజలు భారత్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ డబ్బులను ఆర్జిస్తున్నారని, పొరుగు దేశంలోకి వచ్చి వైద్య చికిత్స చేపించుకుంటారని, భారత మార్కెట్లోనే వారికి కావాల్సిన రోజువారీ వస్తువులను కొనుగోలు చేస్తారని ఖాట్మండు పోస్టు రిపోర్టు చేసింది.
ఈ నేపథ్యంలో రద్దు చేసిన భారత బ్యాంకు నోట్లు నేపాలీ ప్రజలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా భారత్లోని పుణ్యక్షేత్రాలకు విచ్చేసే వారు, సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య ఒప్పందాలు చేసేవారి దగ్గర కూడా ఈ నిరుపయోగమైన కరెన్సీనే ఎక్కువగా ఉందని తెలిపింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను లీగల్ బిల్లులోకి మార్చుకునే అవకాశం లేకపోతే కొంతమంది నేపాల్ ప్రజలు దాచుకున్న సేవింగ్స్ అంతటిన్నీ కోల్పోవాల్సి వస్తుందని ఫెడరేషన్ ఆఫ్ నేపాలీస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి పేర్కొంది. ఈ అంశాలన్నింటిన్నీ పరిగణలోని తీసుకుని, భారతప్రభుత్వం రద్దు చేసిన నోట్లను మార్చుకునే అవకాశం నేపాల్ ప్రజలకు కల్పించాలని ప్రచండ వ్యక్తిగత వెబ్సైట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, నేపాల్ ప్రజలు నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలిపినట్టు మోదీ పేర్కొన్నారు. హఠాత్తుగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆ దేశ సెంట్రల్ బ్యాంకైన నేపాల్ రాష్ట్ర బ్యాంకు(ఎన్ఆర్బీ) కూడా ఈ నోట్ల వాడకాన్ని అక్కడ రద్దుచేసింది. రూ.500, రూ.1000 పెద్దనోట్లు నేపాల్ ఫైనాన్సియల్ సిస్టమ్లో 33.6 మిలియన్లుగా ఉన్నాయని తెలిపింది. ఎన్ఆర్బీ కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. బ్యాన్ చేసిన నోట్లను, నేపాలీ ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది.
Advertisement
Advertisement