ఎవరెస్ట్‌పై అదనపు నిచ్చెనలు, తాళ్లు
కఠ్మాండు: గతేడాది సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న ఎవరెస్ట్ శిఖరంపై అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లను బిగిస్తున్నట్లు నేపాల్ పర్వతారోహణ అసోసియేషన్ తెలిపింది. పర్వతంపై వాలులో పగుళ్లు, రంధ్రాలు ఏర్పడడంతో పర్వతారోహణకు ఎక్కువ సమయం పడుతోందని అసోషియేషన్ ఛైర్మన్ అంగ్ షేరింగ్ షేర్పా చెప్పారు.
పగుళ్ల వల్ల ఈ సారి మరిన్ని నిచ్చెనల అవసరముందని అడ్డంకుల్ని తొలగించే బృందాలు చెప్పాయన్నారు. ప్రతి ఏటా అల్యూమినియం నిచ్చెనలు, తాళ్ల ఏర్పాటుకు ఆరుగురి బృందం పనిచేసేదని, ఈ సారి పదిమంది అవసరమయ్యారన్నారు. పర్వతారోహకుల కోసం ప్రతి ఏడాది మరమ్మతుల బృందం బేస్ క్యాంప్ నుంచి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లు అమరుస్తుంది.