
మయన్మార్ దౌత్య కార్యాలయ కాన్సులర్ ఆర్‌సీ యాదవ్
కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో మార్గం సుగమం
ఈ ఘటనపై సాక్షి వరుస కథనాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి పేరుతో బ్యాంకాక్ వెళ్లి అక్రమంగా మయన్మార్‌లో చిక్కుకుపోయిన 140 మంది భారతీయ యువకుల కుటుంబాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో విదేశాంగశాఖ స్పందించింది. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమంగా సైబర్ కేఫ్‌ల నిర్వహణ, అక్కడ యువకులను నిర్బంధించడం, హింసించడం వంటి ప్రతికూల చర్యలతో మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది.
మాయ్ సాట్ ద్వారా ఇండియాకు..
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో మయన్మార్ అధికారు లు భారత దౌత్య కార్యాలయానికి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోపు బాధితులను ఇండియాకు పంపించేందుకు దౌత్య కార్యాలయం కూడా రోడ్‌మ్యాప్ రూపొందించుకునే పనిలో ఉంది. వాస్తవానికి వీరిని బ్యాంకాక్ నుంచి దాదాపు 505 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్‌లోని మైవాడీ జిల్లాకు బలవంతంగా తరలించారు.
తిరిగి వీరిని బ్యాంకాక్ కాకుండా.. మైవాడీలోని మోయే నది దాటి కేవలం 11 కి.మీ.ల దూరంలో ఉన్న థాయ్‌లాండ్‌లోని మాయ్‌సాట్ ప్రావిన్స్ ద్వారా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారత యువకులంతా మైవాడీలోని కేకే2 పార్క్‌లో బందీలుగా ఉన్నారు.
‘సాక్షి’కి మెయిల్
మయన్మార్‌లోని మైవాడీ జిల్లాలో భారతీయ యువకులు చిక్కుకున్న విషయమై ‘సాక్షి’దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై సాక్షి మయన్మార్ రాజధాని యంగాన్‌లోని దౌత్య కార్యాలయాన్ని సంప్రదించింది. బాధితుల పాస్‌పోర్టులు పంపి వారిని కాపాడాలని కోరింది.
దీనిపై సానుకూలంగా స్పందించిన దౌత్య కార్యాలయం కాన్సులర్ ఆర్‌సీ యాదవ్ బందీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ‘సాక్షి’కి మెయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు స్థానిక అధికారులతో చర్చలు మొదలుపెట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment