యువత‘రంగం’ రియల్‌ ఎస్టేట్‌.. సర్వేలో ఆసక్తికర అంశాలు | Youth highest priority for investments in real estate sector | Sakshi
Sakshi News home page

సర్వేలో ఆసక్తికర అంశాలు.. యువత పెట్టుబడుల్లో రియల్‌ ఎస్టేట్‌దే అగ్రస్థానం

Published Mon, Nov 28 2022 3:56 AM | Last Updated on Mon, Nov 28 2022 3:37 PM

Youth highest priority for investments in real estate sector - Sakshi

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన పట్నాల నగేష్‌ వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల వ్యాపారంలో వచ్చిన లాభాలను స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు. వ్యాపారిగా ప్రతి పైసాకు లెక్క వేసే తాను రియల్‌ ఎస్టేట్‌లోనే పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. ‘బ్యాంకు వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. బంగారం ధరలు భారీగా పెరిగాయి. అందువల్లే వాటిలో పెట్టుబడి పెట్టడంలేదు. చాలా మంది స్టాక్‌ మార్కెట్‌ బాగుందంటున్నా, దానిపై నాకు అంతగా అవగాహన లేదు. అందుకే వచ్చిన లాభాలను స్థిరాస్థి రంగంలోనే పెడుతున్నా’ అని నగేష్‌ చెప్పారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మేలని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కవులూరి ఆదిత్య అంటున్నారు. ‘గతంలో మా నాన్నగారు నా పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఈ మధ్యనే నాకు బాబు పుట్టాడు. నేనూ డిపాజిట్లు పెడతామని అనుకున్నా. పోస్టాఫీసులు, బ్యాంకులకు వెళ్తే వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. పెరుగుతున్న ధరలు (ద్రవ్యోల్బణం) పరిగణనలోకి తీసుకుంటే వాటిపై రాబడి లేకపోగా నష్టపోతున్నామనిపించింది. అందుకే రిస్క్‌ ఉన్నా మా బాబు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రతి నెలా సిప్‌ విధానంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తున్నా’ అని వివరించారు.
– సాక్షి, అమరావతి

వీరిద్దరూ చెప్పింది వాస్తవమే. స్థిరాస్తి రంగం, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకే నేటి యువత ప్రాధాన్యతనిస్తోంది. మరీ ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దేశ యువత పెట్టుబడి తీరులో వచ్చిన స్పష్టమైన మార్పుకు ఇది నిదర్శనమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపేవారు.

ఇప్పుడు రిస్క్‌ (నష్ట భయం) ఉండే రియల్‌ ఎస్టేట్, స్టాక్‌ మార్కెట్‌ వంటి ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), అన్‌రాక్‌ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో వివిధ ఆదాయ తరగతులకు చెందిన 5,500 మందిపై ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు నిర్వహించిన సర్వేలో పలు అంశాలు వెలుగు చూశాయి.

కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులు తగ్గాయని, రియల్‌ ఎస్టేట్, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగాయని సర్వే తెలిపింది.

‘రియల్‌’నే నమ్ముతున్నారు
యువత పెట్టుబడుల్లో రియల్‌ ఎస్టేట్‌దే అగ్రస్థానమని సర్వే వెల్లడించింది. 59 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌లోనే పెట్టుబడికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. 28 శాతం మంది స్టాక్‌ మార్కెట్‌పై ఆసక్తి చూపించారు. కోవిడ్‌ వచ్చిన సంవత్సరం 2020 జనవరి – జూన్‌ మధ్య రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య 48 శాతం ఉండగా, ఈ ఏడాది జనవరి – జూన్‌ మధ్య 11 శాతం పెరిగిందని సర్వే తెలిపింది.

అత్యధికంగా 33 శాతం మంది సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం స్థిరాస్తి కొంటున్నట్లు తెలిపారు. 22 శాతం మంది అత్యవసర సమయాల్లో స్థిరాస్తి అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. 17 శాతం మంది భవిష్యత్తులో వ్యాపారం మొదలు పెట్టడానికి ముందస్తుగా  ఇన్వెస్ట్‌ చేస్తుంటే, 15 శాతం మంది రిటైర్మెంట్‌ తర్వాత అండగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈక్విటీ పెట్టుబడులు కోవిడ్‌ ఏడాదికి, ఈ ఏడాదికి 3 శాతం పెరిగి 25 శాతం నుంచి 28 శాతానికి చేరినట్లు తేలింది. ఇదే సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 18 శాతం నుంచి 7 శాతానికి పడిపోగా, బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 9 శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది. వడ్డీరేట్లు తగ్గి కనిష్ట స్థాయికి చేరడం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణంగా వెల్లడైంది.

ఇప్పుడు మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. అలాగే బంగారం ధరలు కూడా గరిష్ట స్థాయిలో ఉండటంతో ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని సర్వేలో వెల్లడైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement