కరోనా వైరస్ పుట్టుకలో చైనా పాత్రపై అనుమానం మొదటి నుంచి ఉందే. అయితే మధ్యలో డబ్ల్యూహెచ్‌వో జోక్యం, ట్రంప్ హయాంలో యూఎస్ నిఘా వర్గాల నివేదికల్ని బయటకు రానివ్వకపోవడంతో ఆ ఆరోపణలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అనిపించాయి. ఈ తరుణంలో ఉన్నట్లుండి ల్యాబ్ థియరీ ఒక్కసారిగా తెర మీదకు రావడం, మళ్లీ చైనాపై అమెరికా సహా కొన్ని దేశాలు ఆరోపణలతో విరుచుకుపడడం చూస్తున్నాం. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది.. గత నెలరోజుల పరిణామాలే ఇందుకు కారణమా? ఇందులో భారతదేశానికి చెందిన ఓ యువ అన్వేషకుడి పాత్రేంత అనేది పరిశీలిస్తే..
వెబ్‌డెస్క్: ‘‘కరోనా వైరస్ పుట్టుక వుహాన్ ల్యాబ్‌లోనే జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’’.. ఇది డ్రాగన్ కంట్రీపై అగ్రదేశం అమెరికా చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఎదురుదాడి ప్రారంభించిన చైనా.. అమెరికాపైనే నిందలు వేయడంతో పాటు ఫౌఛీ మెయిల్స్ లీక్ వ్యవహారాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో గత నెలరోజుల ల్యాబ్ లీక్ థియరీ అంశం ఎలా ఉప్పెనలా ఎగిసిపడిందో చూద్దాం.
డ్రాస్టిక్లో మనోడు!
కరోనా పుట్టుక విషయంలో చాలామంది సైంటిస్టులకు, రీసెర్చర్లకు అనుమానాలున్నాయి. ఈ తరుణంలో ఆసక్తి ఉన్నవాళ్లంతా కలిసి డ్రాస్టిక్(DRASTIC) పేరుతో ఒక సైట్ క్రియేట్ చేశారు. కరోనా వైరస్ పుట్టుక తమ తమ అభిప్రాయాల్ని, రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయాల్ని ట్విట్టర్ ద్వారా ఆ పేజీలో తెలియజేస్తున్నారు. ఇందులో పలువురు భారతీయులూ ఉండగా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఓ యువకుడు ‘ది సీకర్’(The seeker) పేరుతో తన అభిప్రాయాల్ని వెల్లడించారు. నిజానికి తొలుత ఈ యువకుడు కూడా మార్కెట్ ద్వారానే వైరస్ వ్యాపించిందని నమ్మాడంట. ఆ తర్వాత కొన్ని దర్యాప్తులను, రీసెర్చ్ పత్రాలను, మరికొందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ల్యాబ్ థియరీల వెనుక ఉన్న కథనాల్ని ఉటంకిస్తూ కొన్ని వ్యాసాలు రాశాడు.
ఇది న్యూస్‌వీక్ పీస్ వెబ్‌సైట్‌ను ప్రముఖంగా ఆకర్షించడంతో అతని(సైంటిస్ట్/రీసెర్చర్/సాధారణ యువకుడు) ఉద్దేశాల్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనం ఆధారంగానే ప్రధాన మీడియా హౌజ్‌లు ఒక్కసారిగా వుహాన్ ల్యాబ్ థియరీపై పడ్డాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం #WuhanLabLeak హ్యాష్‌ట్యాగ్‌తో మారుమోగింది. ఆపై సైంటిస్టులు ల్యాబ్ థియరీని పున:పరిశీలించగా, మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మూడు నెలల్లో వైరస్ పుట్టుక వ్యవహారం తేల్చాలని ఇంటెలిజెన్స్ విభాగాల్ని ఆదేశించడం, అమెరికా ఛీప్ సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీ ‘2019 వుహాన్ రీసెర్చర్ల అనారోగ్యం’ రికార్డులను బయటపెట్టాలని చైనాను డిమాండ్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి.
2012 నుంచే..
చైనాలోని ఓ జంతువుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి మొదలైంది. ఇది అప్పట్లో వినిపించిన వాదన. కానీ, కోవిడ్ 19 పుట్టుక చైనాలోని ల్యాబ్(వుహాన్ పేరు తర్వాత తెరపైకి) పుట్టిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఈ తరుణంలో నెలరోజులుగా(ముఖ్యంగా ఈ వారం నుంచి) వుహాన్ ల్యాబ్ థియరీపైనే ఎక్కువ ఫోకస్ అవుతోంది. 2012 నుంచే కరోనా వైరస్ పుట్టుకకు బీజం పడిందని, ఓ మైన్లలో పని చేసే ఆరుగురు అస్వస్థతకు గురి అయ్యారన్న వాదన బలంగా వినిపించింది. దీనికితోడు 2019లో యున్నన్ గుహాలను పరిశీలించిన వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు రీసెర్చర్లు జబ్బు పడడం, వాళ్లకు గోప్యంగా చికిత్స అందించడం, ఆ తర్వాతే కరోనా విజృంభణ.. ఇలా వరుస ఆరోపణలతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
చైనా ఎదురుదాడి.. అమెరికా గొంతులో వెలక్కాయ
‘‘2019లో వుహాన్ ల్యాబ్ లో అనారోగ్యానికి గురైన ముగ్గురు వ్యక్తుల మెడికల్ రికార్డులు చూపండి. వారు నిజంగా అనారోగ్యానికి గురయ్యారా? అయితే.. అనారోగ్యానికి కారణమేంటి?’’ అని చైనాను ఆంటోనీ ఫౌచీ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా లేదా అనే దానిపై కీలకమైన ఆధారాలు అందించే తొమ్మిది మంది మెడికల్ రికార్డులను రిలీజ్ చేయాలని కోరారు. అయితే ఇదే ఫౌచీ గతంలో ‘ల్యాబ్ థియరీ’ని కొట్టిపడేశాడు. దీనికితోడు వుహాన్ ల్యాబ్ తో సంబంధం ఉన్న ఎకో హెల్త్ అలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్.. థ్యాంక్స్ చెబుతూ ఫౌచీకి పంపిన ఈ మెయిల్ కూడా వివాదాస్పదమైంది. దీంతో ఇప్పుడు ఫౌచీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇక కరోనా వైరస్ పుట్టుక విషయంలో అమెరికా పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని, అక్కడి ల్యాబ్‌లను పరిశీలించాలని చైనా, డబ్ల్యూహెచ్‌వోను కోరడంతో అమెరికా గొంతులో వెలక్కాయపడ్డట్లయ్యింది. అంతేకాదు కరోనా వైరస్ పుట్టుకపై స్టడీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)ను ఆహ్వానించాలని అమెరికాకు చైనా పిలుపునిచ్చి గట్టి కౌంటరే ఇచ్చింది. అయితే అమెరికా మాత్రం ఆ పని చేయదని, ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కు పైగా బయో ల్యాబ్‌ల్లో జరిగే అవకతవకలు బయటపడతాయని భయపడుతుందని చైనా గ్లోబల్ టైమ్స్ ప్రముఖంగా ఒక కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment