దేశంకాని దేశంలో.. తమది కాని యుద్ధంలో... సమిధలుగా మనోళ్లు | Russia-Ukraine war: Indian Youth Forced into Russian Army Near Ukraine war | Sakshi
Sakshi News home page

దేశంకాని దేశంలో.. తమది కాని యుద్ధంలో... సమిధలుగా మనోళ్లు

Published Mon, Aug 5 2024 4:42 AM | Last Updated on Mon, Aug 5 2024 7:23 AM

Russia-Ukraine war: Indian Youth Forced into Russian Army Near Ukraine war

రష్యాలో ఉద్యోగాలు, విద్య పేరిట ఉచ్చు  

బలవంతంగా ఉక్రెయిన్‌ యుద్ధంలోకి 

ఏజెంట్ల చేతిలో నిలువునా మోసం 

ప్రధాని చర్చించినా వదలని రష్యా  

భవిష్యత్తు మీద బంగారు కలలతో ఆశలకు రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరారు. ఉపాధి దొరికితే కొత్త ఉషోదయాలు చూస్తామనుకున్నారు. కానీం చివరకు తమది కాని యుద్ధంలో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున తలపడుతున్న భారత యువకుల విషాదమిది. ఎందుకిలా జరుగుతోంది? తమది కాని దేశంలో, తమకు సంబంధమే లేని యుద్ధంలో వారు ఎందుకిలా బలవుతున్నట్టు...? 

అతని పేరు రవి మౌన్‌. హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువకుడు. రష్యాలో డ్రైవర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్‌ చెప్పాడు. నమ్మిన కుటుంబం భూమి తెగనమ్మి మరీ ఏజెంట్‌కు రూ.11.5 లక్షలు ముట్టజెప్పింది. తీరా జనవరి 13న రష్యాకు వెళ్లాక ఏజెంట్‌ మోసగించినట్టు అర్థమైంది. ఇప్పుడతని ముందు రెండే ఆప్షన్లు. పదేళ్ల జైలు. లేదంటే ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం. పదేళ్ల జైలు కంటే తనకిష్టం లేకున్నా యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు రవి. 

ఈ విషయం కుటుంబానికి తెలియనివ్వలేదు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న భారత యువకుల వీడియోలో అతన్ని చూశాకే వారికి తెలిసింది. చివరగా మార్చిలో కుటుంబంతో మాట్లాడాడు. అప్పటినుంచి వారికతని సమాచారమే లేదు. యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చేందుకు రాత్రంతా గోతులు, కందకాలు తవ్వడమే పని! నాలుగు నెలల తర్వాత యుద్ధభూమిలో ప్రాణాలొదిలాడు. రవి సోదరునితో పాటు రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా సోమవారం దీన్ని ధ్రువీకరించింది. డ్రైవర్‌ ఉద్యోగం ఆశ చూపి యుద్ధానికి ఎలా బలి పెడతారన్న రవి కుటుంబం ప్రశ్నకు బదులిచ్చేదెవరు...? 

భారీ వేతనాలు ఎర చూపి... 
ఇది ఒక్క రవి కథే కాదు. ఎంతోమంది భారత యువకులకు భారీ వేతనంతో ఉద్యోగాలంటూ ఊరించి రష్యాకు తీసుకెళ్తున్నారు. చివరికిలా బలవంతంగా యుద్ధాన్ని నెత్తిన రుద్దుతున్నారు. 2023 డిసెంబర్‌ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య చాలామంది భారతీయులు ఇలా రష్యా సైన్యంలో చేరారు. వారిక్కూడా అక్కడికి వెళ్లేదాకా ఆ సంగతి తెలియదు! 2023 డిసెంబర్‌లో హర్‌‡్ష కుమార్‌ అనే యువకున్ని బెలారస్‌కని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్‌ మధ్యలోనే వదిలేశాడు. రష్యా సైన్యానికి చిక్కడంతో యుద్ధంలో పాల్గొనాల్సి వచి్చంది. అమృత్‌సర్‌కు చెందిన తేజ్‌పాల్‌సింగ్‌ పరిస్థితీ అంతే.

 ఏజెంటుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ ఉద్యోగం కోసం రష్యా వెళ్లి చివరకు సైన్యంలో తేలాడు. చివరగా మార్చి 3న కుటుంబంతో మాట్లాడారు. జూన్‌లో మరణించాడు. పశి్చమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కు చెందిన ఉర్గెన్‌ తమాంగ్‌ క్రిమియా యుద్ధ ప్రాంతం నుంచి మార్చిలో వీడియో పంపాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం, మంచి జీతం పేరిట ఏజెంట్‌ మోసగించాడని వాపోయాడు. 10 రోజులు నామమాత్ర ఆయుధ శిక్షణ ఇచ్చి బలవంతంగా వార్‌ జోన్‌లోకి నెట్టారని వెల్లడించాడు. తన యూనిట్‌లోని 15 మంది రష్యనేతర సైనికుల్లో 13 మంది ఎలా దుర్మరణం పాలయ్యారో వివరంగా చెప్పుకొచ్చాడు. ఏపీ నుంచి కూడా పలువురు యువకులు ఈ వలలో చిక్కి ఉక్రెయిన్‌ యుద్ధక్షేత్రానికి చేరినట్టు చెబుతున్నారు.  

నేరం నిరుద్యోగానిదే... 
సంపాదనకు విదేశీ బాట, ప్రవాస భారతీయుని హోదా మన సమాజంలో గౌరవ చిహ్నాలు. గ్రామీణ నిరుద్యోగిత మరీ ఎక్కువ ఉన్న పంజాబ్, హరియాణా యువత కెనడా, యూరప్‌ దేశాలకు విపరీతంగా వెళ్తుంటారు. కానీ ఆ దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. రష్యన్‌ స్టాంప్‌ ఐరోపా దేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందనే ఆశతో పంజాబ్, హరియాణా యువకులు రష్యా బాట పడుతున్నారు. తీరా వెళ్లాక ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధంలో తేలుతున్నారు. రష్యా సైన్యంలో మనోళ్లు 40 మంది దాకా ఉన్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నా వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.  

8 మంది భారతీయుల మృతి: కేంద్రం 
విదేశీ యువతను రష్యా ఇలా ఉక్రెయిన్‌ యుద్ధానికి బలి పెడుతున్న నేపథ్యంలో తమ పౌరులు ఆ దేశాలకు వెళ్లకుండా పలు దేశాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. నేపాల్‌ వంటి చిన్న దేశాలు కూడా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేశాయి. మన దేశంలో అలాంటి చర్యల ఊసే లేదు! కనీసం మోసగిస్తున్న ఏజెంట్లపైనా చర్యల్లేవు. సరికదాం, రష్యాలో ఉపాధి కోసం వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలనే ప్రకటనలతో కేంద్రం సరిపెడుతోంది! మన యువకులు ఉక్రెయిన్‌ యుద్ధంలో బలవుతున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి రష్యా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రత్యేకంగా చర్చించినా లాభం లేకపోయింది. 

మనోళ్లను స్వదేశానికి పంపేందుకు రష్యా అధికారులు ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ మరణించినట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ తాజాగా గత గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ‘‘12 మంది భారతీయులు ఇప్పటికే రష్యా సైన్యాన్ని వీడినట్టు సమాచారముంది. మరో 63 మంది కూడా సైన్యం నుంచి త్వరగా విడుదల చేయాలని రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు’’ అని వెల్లడించారు. రష్యా సైన్యం తరఫున యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న భారతీయులను వెనక్కు పంపేలా ఆ దేశంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పారు.

ఇలా మోసగిస్తున్నారు... 
నిరుపేద యువతను వారికే తెలియకుండా రష్యా సైన్యంలోకి పంపేందుకు ఏజెంట్లు ప్రధానంగా లక్షల్లో జీతం, మెరుగైన జీవితాన్ని ఎరగా చూపుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో సీబీఐ చేసిన దాడుల్లో భారీ మానవ అక్రమ రవాణా రాకెట్‌ వెలుగు చూసింది. దాని సభ్యులను విచారించగా ఈ వివరాలు బయటికొచ్చాయి. 

→ ఈ ‘రష్యాలో ఉపాధి’ ప్రచారానికి వారు ప్రధానంగా సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారు. 
→ ఒకసారి బాధితులు తమ వల్లో పడగానే స్థానిక ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. రంగుల కల చూపి ఒప్పిస్తారు.
→ పలు సందర్భాల్లో ఉన్నత విద్యను కూడా ఎర వేస్తున్నారు. 
→ రష్యాలో దిగీ దిగగానే స్థానిక ఏజెంట్లు వాళ్ల పాస్‌పోర్టులు లాగేసుకుంటారు. 
→ ఆనక బలవంతంగా రష్యా సైన్యంలో చేరక తప్పని పరిస్థితులు కల్పిస్తారు.  

ఇతని పేరు సయ్యద్‌ ఇలియాస్‌ హుసేనీ. కర్నాటకలోని కలబురిగి వాసి. వెనక ఉన్నది అతని మిత్రులు అబ్దుల్‌ నయీం, మహ్మద్‌ సమీర్‌ అహ్మద్‌. వీళ్లు, తెలంగాణలోని నారాయణపేటకు చెందిన మొహమ్మద్‌ సూఫియాన్‌ దుబాయ్‌ విమానాశ్రయంలో పని చేసేవారు. రష్యాలో సెక్యూరిటీ గార్డులు కావాలంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు చూశారు. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందన్న ఏజెంట్‌ మాటలు నమ్మి నలుగురూ గత డిసెంబర్లో రష్యా వెళ్లారు. వారిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుని ఉక్రెయిన్‌ సరిహద్దులకు పంపారు. అక్కడి నుంచి ఇలియాస్‌ తమ దుస్థితిని ఇలా గోప్యంగా వీడియో తీసి పంపాడు. ఇలియాస్‌ తండ్రి నవాజ్‌ అలీ హెడ్‌ కానిస్టేబుల్‌. తన కొడుకును, అతని స్నేహితులను ఎలాగైనా సురక్షితంగా తీసుకు రావాలంటూ అప్పటినుంచీ అతను ఎక్కని గడప లేదు.

– సాక్షి,  నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement