⇒ యువతకు గాలం వేస్తున్న ఐఎస్‌ఐఎస్
న్యూఢిల్లీ: ‘ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సుఖాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కోరుకున్న కన్యలను పెళ్లి చేసుకోవచ్చు. కావాలనుకుంటే అమరులైన జిహాదీల భార్యలను పెళ్లి చేసుకోవచ్చు. మన ప్రభుత్వం ఉచితంగా అందించే ఇంట్లో ఉండవచ్చు. చేసే ఉద్యోగానికి కావాల్సినంత డబ్బు చేతికందుతుంది. తిండికి కొదవుండదు. మంచి మాంసం, తాజా కూయగారలు తినవచ్చు. బిస్కట్లు, చాక్‌లెట్లు కూడా తినవచ్చు. షరియా చట్టానికి లోబడి సుఖంగా జీవించవచ్చు. కలిసొస్తే మనమందరం స్వర్గంలో కలుసుకోవచ్చు’
నేడు ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) టెర్రరిస్టు సంస్థలోకి భారత్ నుంచి ముఖ్యంగా కేరళ నుంచి యువతను లాగేందుకు ప్రలోభ పెడుతున్న పద్ధతి ఇది. కేరళకు చెందిన అబ్దుల్ రషీద్ అబ్దుల్లా ఇరాన్ ఈశాన్య ప్రాంతంలోని ఖొరాసన్ పర్వతాల నుంచి కేరళ యువతతో రహస్యంగా మాట్లాడిన మాటలివి. మాటలు ఇతరులకు పోకుండా కట్టుదిట్టమైన నెట్‌వర్క్ ఫోన్ల ద్వారా మాట్లాడినప్పటికీ వీటిని నేషనల్ మీడియా ఈ మాటల ఆడియో సంకేతాలను అందుకోగలిగింది. అబ్దుల్ రషీద్ అఫ్ఘానిస్తాన్ ఐఎస్‌ఐఎస్ తరఫున భారత రిక్రూటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కేరళకు చెందిన అబ్దుల్ టెర్రరిస్టు సంస్థలో చేరిన రెండేళ్లలోనే రిక్రూటర్ స్థాయికి ఎదిగిన విషయాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గత జనవరి నెలలోనే గుర్తించింది.
(ఆ 80 మందిని చంపింది మేమే)
కేరళలోని కాసర్‌గాడ్‌కు చెందిన అబ్దుల్లా, కాసర్‌గాడ్ నుంచి 17 మందిని, పలక్కాడ్ నుంచి నలుగురిని రిక్రూట్ చేసుకొని అఫ్ఘాన్‌కు తరలించిన విషయాన్ని ఎన్‌ఐఏ గుర్తించింది. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజ్‌మెంట్ నిపుణులు కూడా ఉన్నారు. ప్రపంచంలోని ముస్లింల అందరి నేత అబూ బకర్ అల్ బగ్ధాది పాలించిన ఇరాక్, శామ్, లిబియా, కొరసామ్, ఆఫ్రికా ప్రాంతాల్లో ఇప్పుడు తమ ఇస్లామిక్ స్టేట్ ప్రభుత్వాలే ఉన్నాయని, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసులు, ఆర్థిక, ధాతృత్వ విభాగాలన్నీ తమ ప్రభుత్వ హయాలోనే కొనసాగుతున్నట్లు మలయాళంలో మాట్లాడిన అబ్దుల్లా తెలిపారు. ‘మిత్రమా, ముర్షీద్ మొన్ననే ఓ కన్య పిల్లను పెళ్లి చేసుకున్నాడు. సజీద్ ఇద్దరు పిల్లలున్న వితంతువును, మంజత్ ఒక పాపున్న వితంతువును పెళ్లి చేసుకున్నాడు. నేను చెప్పొచ్చేదేమిటంటే పెళ్లి చేసుకోవడం ఇక్కడ చాలా ఈజీ’ అని కూడా అబ్దుల్ ప్రలోభపెట్టాడు.
(భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!)
భారత్ నుంచి ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల్లో చేరేందుకు వెళుతున్న 75 మందిని మార్చి వరకు దేశ సరిహద్దుల్లో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. వారిలో కేరళకు చెందిన వారు 21 మందికాగా, తెలంగాణకు చెందిన వారు 16, కర్ణాటకకు చెందిన వారు 9 మంది, తమిళనాడుకు చెందిన వారు నలుగురు, మహారాష్ట్రకు చెందిన వారు 8 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఆరుగురు, ఉత్తరాఖండ్‌కు చెందిన వారు నలుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురు, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఒక్కరు చొప్పున ఉన్నారు.