మోదీ ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోయారు!
న్యూఢిల్లీ: 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గంభీరంగా ప్రసంగించారు. దాదాపు 94నిమిషాలపాటు ఆయన ప్రసంగం సాగింది. ఈ ప్రసంగాన్ని చాలామంది ఆహూతులు శ్రద్ధగా విన్నారు, కానీ నేతలు మాత్రం పార్టీలకతీతంగా ధ్యానముద్రలోకి దిగారు. ప్రసంగాన్ని ఈ చెవి నుంచి ఆ చెవికి వదిలేసి తాపీగా నిద్రలోకి జారుకున్నారు. మోదీ మాట్లాడుతున్నంతసేపు నిద్రమత్తులో జోగారు.
ఒక్కరేమిటి.. ఇలా కునుకుపాట్లు పడుతూ కేంద్ర మంత్రులు, ఇతర నేతలు కెమెరాకు చిక్కారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, అనంత కుమార్, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. నిద్రలోకి జారుకున్నట్టు కనిపించారు. కళ్లుమూసి నిద్రమత్తులో ఉన్నట్టు కనిపించిన వారి దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది కూడా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించి.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి, వ్యూహాలు, పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇలా పలు అంశాలపై ఈసారి ప్రధాని ప్రసంగం సుదీర్ఘంగా సాగి మరో రికార్డు సృష్టించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే విపాసన ధ్యానాన్ని పది రోజులు ప్రత్యేకంగా సాధన చేసి వచ్చారు. ఆ ప్రభావంతో కేజ్రీవాల్ ధ్యానముద్రలో మునిగిపోగా.. ఆయనను చూసి బీజేపీ నేతలు కాస్తా ధ్యానాన్ని నేర్చుకొని ఉంటారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.