దేశ రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పలు పరిణామాలు
లోక్‌సభలో 400 సీట్ల టార్గెట్ చేరుకోలేని ఎన్డీఏ
మూడోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ
ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు
దశాబ్దకాలం తర్వాత జమ్ముకశ్మీలో అసెంబ్లీ ఎన్నికలు
దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్‌కు ఊహించని ఓటమి
కొద్దిరోజుల్లో 2025ను స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ డిసెంబర్ 31తో 2024 ముగియనుంది. 2024లో దేశంలో అనేక చెడు, మంచి ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో పలు పరిణామాలు సంభవించాయి. అవి ప్రజల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
లోక్‌సభ ఎన్నికలు 2024
దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ 1 మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. 400 సీట్ల టార్గెట్‌తో ఎన్డీఏ ఎన్నికల పోరులోకి దిగగా, దానిని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 400 సీట్లను చేరుకోలేకపోయింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు.
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా
తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ రాజీనామాతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఢిల్లీ ప్రజలు తనకు క్లీన్ చిట్ ఇస్తేనే సీఎం పదవి స్వీకరిస్తానని అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్న సమయంలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర ఎన్నికలు
ఈ ఏడాది మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైతే, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతు లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అత్యధిక మెజారిటీ సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ఉండగా, ఈ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు.
హేమంత్ సోరెన్‌కు జైలు శిక్ష
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు 2024 అనేక ఒడిదుడుకులను అందించింది. ఒక కేసులో ఆయన 2024 జనవరిలో జైలులో ఉన్నారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత హేమంత్ సోరెన్ బెయిల్ పొంది తిరిగి జార్ఖండ్ సీఎం పదవిని చేపట్టారు. ఈ సమయంలో చంపై సోరెన్ జేఎంఎంను వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించింది. తిరిగి హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచాయి. దశాబ్దకాలం తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే నిలిచింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ అద్భుత విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
యూపీకి రాహుల్ గాంధీ పునరాగమనం
2024 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా నిలిచాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుండి ఓటమిని ఎదుర్కొన్నారు. అయితే ఆ సమయంలో రాహుల్ కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌లలో పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. ఈ నేపధ్యంలో ఆయన వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు.
నవీన్ పట్నాయక్ ఓటమి
ఈ ఏడాది ఒడిశాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒడిశా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అధికారం నుంచి వైదొలగవలసి వచ్చింది.
ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం
నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా ఈ సంవత్సరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఆమె 64.99% ఓట్లతో విజయం సాధించి, తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.
సిక్కిం అసెంబ్లీలో ప్రతిపక్షం అంతం
ప్రభుత్వ పనితీరుపై నిఘా ఉంచడానికి ప్రతిపక్షం అవసరం. అయితే సిక్కింలో ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. 32 సీట్ల సిక్కిం అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ఒకే పార్టీకి చెందినవారు. ఇటీవల రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు.
ఢిల్లీ సీఎంగా అతిషి
తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో తొలుత ఢిల్లీ సీఎంగా మనీష్ సిసోడియాకు అవకాశం దక్కనుందని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాల దరిమిలా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి అతిషిని ఎన్నిక చేశారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. నిత్యం ఇవే వార్తలు
Comments
Please login to add a commentAdd a comment