ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలోని 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానన్నారు. పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్‌కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఆప్ బహిరంగ సభలో బీజేపీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.
‘‘వచ్చే ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75ఏళ్లు వస్తాయి. రిటైరవుతారు. ప్రధానిగా ఆయనకు మరో ఏడాది సమయమే ఉంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింట్లోనూవిద్యుత్తు ఉచితంగా ఇవ్వండి. బడులు, ఆసుపత్రులు బాగు చేయండి. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లోపు ఆ పని చేసి చూపిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తా’’ అన్నారు.
‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వమటే ‘డబుల్ దోపిడీ, నిరుద్యోగం, అధిక ధరలు’. హరియాణాలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ దిగిపోనుంది. జార్ఖండ్, మహారాష్ట్రల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పోతాయి’’ అన్నారు. తన జేబులో ఆరు స్వీట్లున్న ప్యాకెట్ ఉందని కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్ర, ఆరోగ్య వసతులు, విద్య... ఇవే ఆ ఆరు స్వీట్లు’’ అని చెప్పారు. ఢిల్లీలో పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ ఆరు స్వీట్లు ప్రజలకు అందకుండా పోతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment