మోదీ వ్యాఖ్యలకు పాక్ నుంచి మద్దతు!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), బలూచిస్థాన్ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను బెలూచిస్థాన్ నాయకులు, హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. పీవోకే, బెలూచిస్తాన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి తమకు అండగా నిలువాల్సిన అవసరముందని బలూచిస్తాన్ హక్కుల కార్యకర్త హమ్మల్ హైదర్ బలూచ్ కోరారు.
పాక్ ప్రభుత్వం సింధీ రాజకీయ కార్యకర్తలను దారుణంగా హతమారుస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు రాజకీయ కార్యకర్తలను హత్యచేస్తూ మరోవైపు మతగ్రూపులకు మద్దతు పలుకుతున్నదని, ఇది ప్రపంచానికి ముప్పుగా మారే అవకాశముందని పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా బలూచిస్థాన్ ప్రజలను పాక్ దారుణంగా పొట్టనబెట్టుకుంటున్నదని తెలిపారు.
బలూచిస్థాన్ ప్రజలు భారత్‌తో ఉమ్మడి భావజాల అనుబంధాన్ని కలిగి ఉన్నారని, వారు లౌకిక, ప్రజాస్వామిక విలువలను విశ్వసిస్తారని చెప్పారు. బలూచ్ ప్రజలకు మద్దతునివ్వాలని భారత్ ప్రధానమంత్రి కోరుకోవడం ఇదే మొట్టమొదటిసారని, ఇదెంతో కీలక నిర్ణయమని హమ్మల్ ప్రశంసించారు. పీవోకే, బలూచిస్థాన్ ప్రజలకు మద్దతుగా ప్రధాని మోదీ మాట్లాడినందుకు ఆయనకు హక్కుల కార్యకర్త నైలా ఖాద్రి బలూచ్ కృతజ్ఞతలు తెలిపారు. బలూచిస్థాన్ ప్రజలైన తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యను సెప్టెంబర్‌లో జరిగే ఐక్యారాజ్యసమితి సమావేశాల్లో భారత్ లేవనెత్తుతుందని తాము ఆశిస్తున్నామని ఆమె చెప్పారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) కూడా మన జమ్మూకశ్మీర్లో అంతర్భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. బలూచిస్తాన్‌లో, పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతాల్లో పొరుగుదేశం అకృత్యాలను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఇందుకు సంబంధించి దౌత్యపరమైన ఎదురుదాడి ప్రారంభించాలన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఆ ప్రాంతాల ప్రజలతో సంబంధాలను ఏర్పర్చుకుని, అక్కడి దారుణ స్థితిగతులపై సమాచారం సేకరించాలని విదేశాంగ శాఖను ప్రధాని ఆదేశించారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, ఆందోళనలు, పాక్ మద్దతులో సాగుతున్న సీమాంతర ఉగ్రవాద ఫలితమేనని కుండబద్ధలు కొట్టిన మోదీ.. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదన్నారు.