పీఓకే కూడా మనదే!
అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ
* అక్కడ పాక్ సాగిస్తున్న అకృత్యాలను ప్రపంచం దృష్టికి తేవాల్సి ఉంది
* కశ్మీర్ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం; లోయలో శాంతి సాధిస్తాం
* దేశ భద్రత, సమగ్రతపై రాజీలేదు
* కశ్మీర్ హింసకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణం
* అన్ని వర్గాలతో తక్షణం చర్చలు చేపట్టాలి: ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) కూడా మన జమ్మూకశ్మీర్లో అంతర్భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. బలూచిస్తాన్‌లో, పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతాల్లో పొరుగుదేశం అకృత్యాలను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఇందుకు సంబంధించి దౌత్యపరమైన ఎదురుదాడి ప్రారంభించాలన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఆ ప్రాంతాల ప్రజలతో సంబంధాలను ఏర్పర్చుకుని, అక్కడి దారుణ స్థితిగతులపై సమాచారం సేకరించాలని విదేశాంగ శాఖను ప్రధాని ఆదేశించారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, ఆందోళనలు, పాక్ మద్దతులో సాగుతున్న సీమాంతర ఉగ్రవాద ఫలితమేనని కుండబద్ధలు కొట్టిన మోదీ.. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదన్నారు. గత 35 రోజులుగా కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు, వాటిలో 55 మంది ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కశ్మీర్ ఆందోళనలకు పరిష్కారం వెదికే దిశగా లోక్‌సభ లైబ్రరీ హాల్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో శుక్రవారం మోదీ ప్రసంగించారు. రాజ్యాంగ పరిధిలో కశ్మీర్ సమస్యకు శాశ్వత, శాంతియుత పరిష్కారం వెదికేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. అన్ని వర్గాల కశ్మీరీల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాలుగు గంటల పాటు కొనసాగిన భేటీలో కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు, జమ్మూకశ్మీర్లో అధికారంలో ఉన్న పీడీపీ పాల్గొన్నాయి. కశ్మీర్ సమస్యపై స్పందించడం ముదావహమన్న పీడీపీ.. అక్కడ విశ్వాస కల్పన చర్యలు చేపట్టాల్సిన తక్షణావసరం ఉందని పేర్కొంది.
త్వరలోనే సాధారణ పరిస్థితులు: మోదీ
‘పౌర సమాజానికి దగ్గరవడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల్లో కశ్మీర్ యువత భాగస్వాములయ్యేలా చర్యలు వేగవంతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిన వేళ, పొరుగు దేశం ప్రోత్సాహంతో సాగుతున్న ఉగ్రవాదం చుట్టుముట్టిన సమయంలో ఈ పోరులో మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలి. ఈ విషయంలో నిర్మాణాత్మక మద్దతును ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం ఆశిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అంకితభావం, మీ పూర్తి సహకారంతో త్వరలోనే జమ్మూ కశ్మీర్‌లో సాధారణ జన జీవనం తిరిగి నెలకొల్పుతాం’ అని మోదీ అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కశ్మీర్ అంశాన్ని ఎదుర్కొందన్నారు.
వాజ్‌పేయి బాటలోనే పయనిస్తాం
‘అందరి భారతీయుల్లాగానే రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై తీవ్రంగా బాధపడ్డా. విద్యార్థుల చదువుకు ఆటంకాలు చూస్తే బాధగా ఉంది. కశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యే యాపిల్స్ మార్కెట్లకు చేరడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సంక్షేమ పనుల్ని కొనసాగించలేకపోతున్నాయి. ప్రజలు, భద్రత దళాలకు చెందిన ఎవరు మరణించినా సరే మనమంతా బాధపడాలి. వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలుపుతున్నా. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు, కశ్మీర్ లోయలో శాంతి నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నాం. అప్పుడే ప్రజలు వారి సాధారణ జీవనం గడపగలరు’ అని పేర్కొన్నారు. కశ్మీర్ చర్చలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అనుసరించిన ఇన్సానియత్(మానవత్వం), జమ్హూరియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ మార్గంలోనే పయనిస్తామని చెప్పారు.
వారి మనసు గెలవాలి: కాంగ్రెస్
ముఖ్య పార్టీలతో సహా చిన్న పార్టీలు, ఇతర వర్గాల్ని చర్చలకు పిలవాలని భేటీలో కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేశాయి. ‘గాయాల్ని నయం చేయడం ముఖ్యం, చర్చలకు ద్వారాల్ని మూయవద్దు. సామాన్యుల, యువత హృదయాన్ని, మనసుల్ని గెలవాలి’ అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సూచించారు. అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని కశ్మీర్‌కు పంపాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి.
కశ్మీర్‌పై రాష్ట్ర విధానం అంటూ లేదు: జైట్లీ
భేటీ అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాన పార్టీలతో చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయన్నారు. కశ్మీర్‌పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అంటూ వేర్వేరుగా ఏవీ లేవని, కేవలం కేంద్ర విధానమే ఉందని, పరిస్థితి మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘కశ్మీర్‌కు రూ. 80 వేల కోట్ల ఆర్థిక సాయంపై కసర త్తు కొనసాగుతోంది. కొంత మొత్తం ఇప్పటికే ఇచ్చాం. మిగతా మొత్తానికి త్వరలో కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుంది’ అని రాజ్‌నాథ్ తెలిపారు.
కశ్మీర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపే ముందు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి చర్యల్ని చేపట్టాల్సి ఉందన్నారు. అలాంటి చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలపగానే, బృందాన్ని పంపే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కశ్మీర్‌కు చెందిన అన్ని వర్గాలతో చర్చలు నిర్వహించాలని, పెల్లెట్ గన్స్ వాడకం ఆపాలన్న తమ డిమాండ్లపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని సీపీఎం పేర్కొంది. తమ డిమాండ్లను అంగీకరించడం లేదా నిరాకరించడం చేయలేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు.
భారత్‌తో చర్చల యోచన: పాకిస్తాన్
ఇస్లామాబాద్: కశ్మీర్ అంశంపై భారత్‌ను చర్చలకు ఆహ్వానించే ఆలోచనలో పాక్ ఉందని ఆ దేశ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. ఇటీవలి విదేశీ రాయబారుల సదస్సుపై మాట్లాడుతూ... చర్చల విషయమై భారత్‌కు పాక్ విదేశాంగ కార్యదర్శి అధికారికంగా లేఖ రాస్తారని చెప్పారు. కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై మాత్రమే చర్చిస్తామని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
లోక్‌సభలో తీర్మానం
కశ్మీర్ హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం లోక్‌సభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. లోయలో శాంతి, భద్రతలు తిరిగి నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో దేశ ఐక్యత, భద్రత విషయంలో రాజీపడొద్దని కోరింది. కశ్మీరీల్లో, యువతలో నమ్మకం పెంపొందించేలా అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని విజ్ఞప్తి చేసింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీర్మానాన్ని చదివి వినిపించగా అన్ని పార్టీలూ ఆమోదించాయి. కశ్మీర్‌లో పరిస్థితి దిగజారుతున్నందున సభలో తీర్మానం చేయాలంటూ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అందుకు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంగీకరించారు. అంతకముందే ఇదే అంశంపై ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రితో కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా చర్చించారు. లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడే కొద్దిసేపటి ముందే తీర్మానానికి ఆమోదం తెలిపారు.
జమ్మూకు విస్తరించిన ఆందోళన
శ్రీనగర్: కశ్మీర్ లోయలో గత 34రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు శుక్రవారం జమ్మూ ప్రాంతానికీ విస్తరించాయి. కశ్మీర్‌లో వేర్వేరు చోట్ల జరిగిన వేర్పాటువాదుల ఆందోళనలో శుక్రవారం ఒక్కరోజే 47 మంది గాయపడ్డారు. జమ్మూలోని దోడా జిల్లాలో నిరసనకారుల రాళ్లదాడిలో ఒక డ్యూటీ మేజిస్ట్రేట్, ఒక సీనియర్ ఎస్పీ, ముగ్గురు పోలీసు అధికారులు సహా 12 మంది గాయపడ్డారు. అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్, బారాముల్లా, సోపోర్, కుప్వారా, బందిపురా జిల్లాల్లో ప్రాంతాల్లో నిరసనకారులు పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు.
మిలిటెంట్ల కాల్పుల్లో ఇద్దరి మృతి
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు, ఒక పౌరులు మరణించారు. చాన్సెర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది.