కార్మిక చట్టాలకు ప్రభుత్వాల తూట్లు | Governments undermined labor laws | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాలకు ప్రభుత్వాల తూట్లు

Published Sun, Nov 30 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

కార్మిక చట్టాలకు ప్రభుత్వాల తూట్లు

కార్మిక చట్టాలకు ప్రభుత్వాల తూట్లు

నరసరావుపేట వెస్ట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీజే చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. స్థానిక ఏంజెల్ టాకీసు సెంటర్‌లో శనివారం రాత్రి ఏఐటీయూసీ జిల్లా 9వ మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఎన్నో పోరాటాలు, త్యాగాలు, రక్త తర్పణం చేసి సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల పేరుతో పారిశ్రామిక కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెడుతున్నాయని ఆరోపించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దుచేసి వారి గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వే, డిఫెన్స్, ఆయిల్ వంటి కీలక పరిశ్రమలన్నింటిని ఆక్రమించేందుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాయని విమర్శించారు. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కార్మికుల బతుకులు దయనీయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్మికులందరూ ఏకమై నిలదీయాలని చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గాలను మరింత దుర్భర స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.

గుంటూరు జిల్లా రాజధానిగా ఏర్పడడం వల్ల ఈ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలు, కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు వస్తాయని, రానున్న పదేళ్లలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోట మాల్యాద్రి సభకు అధ్యక్షత వహించగా.. జిల్లా ప్రదాన కార్యదర్సి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు జీవీ కృష్ణారావు, వర్కింగ్ అధ్యక్షుడు చల్లా చినఆంజనేయులు, నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు సీహెచ్‌ఎల్‌కాంతారావు, షేక్ సైదా, ఉప్పలపాటి రంగయ్య, కాసా రాంబాబు, సీఆర్‌మోహన్, మారుతీవరప్రసాదు, జి.సురేష్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

తొలుత ఏఐటీయూసీ మహాసభలు సందర్భంగా పట్టణంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుటనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. మల్లమ్మ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement