అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయల్లో నైట్‌డ్యూటీ గోల మొదలైంది. ఎప్పుడూ లేని విధంగా కంప్యూటర్ ఆపరేటర్లు, ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్లు, అకౌంటెంట్లను నైట్ డ్యూటీలకు నియమించడంపై వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆడపిల్లలు ఉండే కేజీబీవీల్లో రాత్రిపూట వారికి రక్షణగా ఎస్‌ఓ, సీఆర్టీలు, పీఈటీ, ఏఎన్‌ఎంలను నియమిస్తూ ఎస్పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. రోజూ ఇద్దరు ఉద్యోగులు నైట్‌డ్యూటీ చేయాల్సి ఉంది. ఇన్ని రోజులూ ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే జిల్లా అధికారులు మరో అడుగు ముందుకేసి పార్ట్‌టైం ఉద్యోగులనూ నైట్‌డ్యూటీలకు నియమించడం విమర్శలకు తావిస్తోంది.
జీతం తక్కువ...పైగా నైట్‌డ్యూటీలు
ఎస్‌ఓలకు రూ. 20 వేలు, సీఆర్టీలకు రూ. 14 వేలు, పీఈటీలకు రూ. 11 వేలు, ఏఎన్‌ఎంలకు రూ. 9 వేలు జీతాలు ఇస్తున్నారు. మరి తక్కువ వేతనాలు రూ. 5–6 వేలు తీసుకుంటున్న ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతోనూ నైట్‌డ్యూటీలు చేయించాలని నిర్ణయించడం బాధాకరమని వారు వాపోతున్నారు. వాస్తవానికి ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్లు పార్ట్‌టైం పద్ధతిన పిల్లలకు కుట్టు, అల్లికలు నేర్పించాలనే నిబంధన ఉంది. మరి అలాంటి ఉద్యోగులను రాత్రి విధులకు కేటాయించారు.
పరిశీలిస్తున్నాం..
ఒకేషనల్ టీచర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను నైట్‌డ్యూటీలకు నియమించలేదు. షెడ్యూలు ప్రకారం నియమించిన వారిలో ఎవరైనా గైర్హాజరైతే వారి స్థానంలో ఒకేషనల్ టీచర్లు, కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించే విషయమై పరిశీలిస్తున్నాం.
– దశరథరామయ్య,
పీఓ, ఎస్‌ఏఎస్
కేజీబీవీల్లో నైట్‌డ్యూటీ గోల!
Published Sat, Aug 20 2016 1:15 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement